Farhana Review: అమ్మాయిలూ… అపరిచితులతో జాగ్రత్త అని చెప్పే ఫర్షానా..

Farhana Movie Review: కొన్ని నిర్మాణ సంస్థలకు ఓ పేరుంటుంది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్... మంచి సినిమాలు నిర్మిస్తుందనే పేరు తెచ్చుకుంది. ఐశ్వర్య రాజేష్‌ ఓ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నారంటే, అందులో ఏదో విషయం ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది.

Farhana Review: అమ్మాయిలూ... అపరిచితులతో జాగ్రత్త అని చెప్పే ఫర్షానా..
Aishwarya Rajeshs Farhana
Follow us
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Janardhan Veluru

Updated on: May 12, 2023 | 5:02 PM

Farhana Movie Review: కొన్ని నిర్మాణ సంస్థలకు ఓ పేరుంటుంది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్… మంచి సినిమాలు నిర్మిస్తుందనే పేరు తెచ్చుకుంది. ఐశ్వర్య రాజేష్‌ ఓ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నారంటే, అందులో ఏదో విషయం ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. అలాంటివారి నమ్మకాన్ని నిలబెట్టే సినిమా ఫర్హానా. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్ లో ఐశ్వర్యరాజేష్‌ నటించిన మూవీ!

నటీనటులు: ఐశ్వర్య రాజేష్‌, సెల్వరాఘవన్‌, ఐశ్వర్య దత్త, జిత్తన్‌ రమేష్‌, అనుమోల్‌ తదితరులు

కథ, దర్శకత్వం: నెల్సన్‌ వెంకటేశన్‌

ఇవి కూడా చదవండి

నిర్మాణ సంస్థ: డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్

నిర్మాతలు: ఎస్‌ ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ ఆర్‌ ప్రభు

సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్‌

ఎడిటింగ్‌: విజె సాబు జోసెఫ్‌

ఆర్ట్: శివ శంకర్‌

ఫర్హానా (ఐశ్వర్య రాజేష్‌) వివాహిత. ఆమె భర్త కరీమ్‌ (జిత్తన్‌ రమేష్‌)కి ఓ చెప్పుల షాపు ఉంటుంది. ఆమె తండ్రి కూడా అదే షాపులో క్యాషియర్‌గా కూర్చుంటాడు. బ్రాండెడ్‌ ఐటమ్స్ మీద పెరిగిన మోజు, ప్రతిదీ ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే డోర్‌ స్టెప్స్ ముందుకు వస్తుండటం… వంటి కారణాల వల్ల వారి చెప్పుల వ్యాపారం సరిగా నడవదు. దానికి తోడు రోజురోజుకూ ఇల్లు గడవడమే గగనమవుతుంటుంది. దాంతో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటుంది ఫర్హానా. ఆమె స్నేహితురాలు నిత్య సాయంతో ఉద్యోగం సంపాదిస్తుంది. కాల్‌ సెంటర్‌ ఉద్యోగాలు వద్దని అంటారు ఇంట్లో. కానీ భర్త సపోర్ట్ చేస్తాడు. ఇంటెన్సివ్‌లు ఎక్కువగా వస్తాయని మరో డిపార్ట్ మెంట్‌కి షిఫ్ట్ అవుతుంది ఫర్హానా. అక్కడ ఆమెకు ఎ.దయాకర్‌ పరిచయమవుతాడు. అతని స్వరంతో పరిచయం పెరుగుతుంది. మనసులోని మాటలన్నీ అతనికి చెప్పేస్తుంది. కానీ ఒకానొక సందర్భంలో ఫర్హానా కొలీగ్‌ హత్యకు గురవుతుంది. అప్పటి నుంచి పరిస్థితులన్నీ తారుమారవుతాయి. ఇంతకీ ఆ హత్యకూ, ఫర్హానా, దయాకర్‌ మధ్య దూరానికీ కారణం ఏంటి? ఈషా ఎవరు? అసలేం జరిగింది? తనను చుట్టుముట్టిన సమస్యల నుంచి ఫర్హానా ఎలా బయటపడింది? వంటివి ఆసక్తికరమైన అంశాలు.

దర్శకుడు నెల్సన్‌ ఎంపిక చేసుకున్న కథ బావుంది. ఫోన్‌ ట్రాప్‌ గురించి గతంలోనూ చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఫర్హానాలో ప్రస్తావించిన ఫ్రెండ్లీ చాట్‌ మీద తెలుగులో సినిమాలు ఈ మధ్యకాలంలో కనిపించలేదు. కొన్ని వృత్తులను వృత్తులుగానే చూడాలి. వాటిని మనసుకు తీసుకుంటే అనర్థాలు క్యూ కడతాయి. ఆశలకు హద్దుంటుంది. అవసరాల కోసం గీత దాటితే సమస్యల వలయం తప్పదని చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. కుటుంబ సభ్యులను కాదని, బాగా మాట్లాడుతున్నారని బయటి వారితో అన్నీ చెప్పుకోవడం తగదనే సందేశాన్నిచ్చారు. బాధ్యత తెలిసిన భార్య, అర్థం చేసుకునే భర్త ఉంటే ఎలాంటి సుడిగుండాల నుంచైనా బయటపడవచ్చనే విషయాన్ని సున్నితంగా చెప్పారు. సొసైటీలో నానాటికీ పెరుగుతున్న యాప్‌లు, వాటి వల్ల జరిగే అనర్థాలు వంటి వాటిని ప్రస్తావించిన తీరు కొత్తగా అనిపించింది.

ఫర్హానా కేరక్టర్‌కు ఐశ్వర్య రాజేష్‌ ప్రాణం పోశారు. దిగువ మధ్యతరగతి ఇల్లాలిగా మెప్పించారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు చుట్టూ సమాజాన్ని చూడటం వల్ల కలిగిన కోరికలు… వీటి మధ్య సతమతమైన మహిళగా పర్ఫెక్ట్‌గా కనిపించారు ఐశ్వర్య. ఆమె భర్త కేరక్టర్‌లో జిత్తన్‌ రమేష్ ఒదిగిపోయారు. విలన్‌ని చూపించకుండా చివరిదాకా దాచిన తీరు బావుంది. అతన్ని చూపించిన ప్రతిసారీ కెమెరామేన్‌ పెట్టిన యాంగిల్స్ ని మెచ్చుకోవాల్సిందే. ఫర్హానా మూవీకి హైలైట్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌. ప్రతి సీన్‌ని బీజీఎంతో ఎలివేట్‌ చేశారు జస్టిన్‌ ప్రభాకరన్‌.

అక్కడో ఇక్కడో విన్న విషయాలను సరిగ్గా తెర మీద ప్రెజెంట్‌ చేశారు ఫర్హానాలో. ఎదుటివారు తియ్యగా మాట్లాడినంత మాత్రాన మంచివారైపోరు. అవతలివారిని అయాచితంగా నమ్మకూడదు. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. కేవలం గొంతు నమ్మి ఎదుటివారి విష వలయంలో పడి సమస్యలు కొని తెచ్చుకోకూడదు. కూర్చుని మాట్లాడితే కుటుంబసభ్యులు మన సమస్యలను అర్థం చేసుకుంటారు…. ఇలాంటి చాలా విషయాలను చెప్పి, అవగాహన పెంచే ప్రయత్నం చేశారు డైరక్టర్‌. తెలుగులో పాటలు రాసిన వారి పేర్లను టైటిల్‌ కార్డులో వేసి ఉంటే బావుండేది. తమిళ లిరిసిస్ట్‌ల పేర్లు తెలుగు పాటల రచయితల స్థానంలో ఎందుకు ప్రచురించారో అర్థం కాదు.

ఫర్హానా… గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదని చెప్పే ప్రయత్నం!

– డా. చల్లా భాగ్యలక్ష్మి

మరిన్ని సినిమా రివ్యూలు చదవండి..