Custody Movie Review: ఫస్టాఫ్ థ్రిల్.. సెకండాఫ్ డల్.. ‘కస్టడీ’ మూవీ ఎలా ఉందంటే..?

ఈ మధ్య అక్కినేని హీరోలకు వరస ఫ్లాపులు వస్తున్నాయి. దాంతో ఈ సారి వచ్చే సినిమా కచ్చితంగా హిట్ కొట్టేలా ఉండాలి కానీ మామూలుగా కాదు అని గట్టి నమ్మకంతో కస్టడీ సినిమాతో వచ్చేసారు నాగ చైతన్య అక్కినేని.

Custody Movie Review: ఫస్టాఫ్ థ్రిల్.. సెకండాఫ్ డల్.. ‘కస్టడీ’ మూవీ ఎలా ఉందంటే..?
Custody Movie Review
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 12, 2023 | 12:43 PM

మూవీ రివ్యూ: కస్టడీ

నటీనటులు: నాగ చైతన్య అక్కినేని, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ అమరెన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు

సంగీత దర్శకులు: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రఫీ: ఎస్ఆర్ కతీర్ ఐఎస్ సి

ఎడిటర్: వెంకట్ రాజన్

దర్శకుడు: వెంకట్ ప్రభు

నిర్మాత: శ్రీనివాస చిట్టూరి

ఈ మధ్య అక్కినేని హీరోలకు వరస ఫ్లాపులు వస్తున్నాయి. దాంతో ఈ సారి వచ్చే సినిమా కచ్చితంగా హిట్ కొట్టేలా ఉండాలి కానీ మామూలుగా కాదు అని గట్టి నమ్మకంతో కస్టడీ సినిమాతో వచ్చేసారు నాగ చైతన్య అక్కినేని. వెంకట్ ప్రభు దీనికి దర్శకుడు కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ చిత్రం నిజంగానే ప్రేక్షకుల మెప్పు పొందుతుందా..? అసలు సినిమా ఎలా ఉంది..? పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

శివ (నాగ చైతన్య) ఒక సిన్సియర్ కానిస్టేబుల్. డ్యూటీ కోసం ప్రాణాలు కూడా లెక్కచేయని తనం ఆయనది. ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. అతడికి డ్యూటీ ఎంత ప్రాణమో.. రేవతి (కృతి శెట్టి) కూడా అంతే ప్రాణం. కానీ కులాలు వేరు కావడంతో రేవతి ఇంట్లో శివతో పెళ్లికి ఒప్పుకోరు పెద్దలు. ఈ ప్రేమకథ ఇలా సాగుతుండగానే.. కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి శివ జీవితంలో. అతడి లైఫ్‌లోకి రాజు (అరవింద్ స్వామి) ఎంటర్ అవుతాడు. మరోవైపు రాజును చంపాడనికి పోలీస్ కమీషనర్ నటరాజన్ (శరత్ కుమార్) సహా పోలీస్ ఫోర్స్, రౌడీలు రంగంలోకి దిగుతారు. అసలు ఈ రాజు ఎవరు.. అతన్ని చంపడానికి అంతమంది ఎందుకు వెంట పడుతున్నారు..? మధ్యలో ముఖ్యమంత్రి (ప్రియమణి) ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు..? అసలు రాజును సిబిఐకి అప్పగించాలని శివ ఎందుకు అంత బలంగా ప్రయత్నిస్తుంటాడు..? ఈ ప్రయాణంలో శివకి ఎదురైన సవాళ్లు ఏమిటి? మధ్యలో రేవతి ఎక్కడికి వెళ్లింది అనేది మిగిలిన కథ..

కథనం:

కథ విషయానికి వస్తే కస్టడీ పాయింట్ కాస్త కొత్తగా అనిపిస్తుంది. రొటీన్ రెగ్యులర్ మాస్ సినిమాలా కాకుండా.. స్క్రీన్ ప్లే బేస్డ్ డ్రామాగా దీన్ని తెరకెక్కించాడు దర్శకుడు వెంకట్ ప్రభు. ముఖ్యంగా ఈయన సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఆ స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఇందులోనూ కనిపిస్తుంది. కాకపోతే ఎక్కువ కాదు.. అక్కడక్కడా ఛమక్కులు మాత్రమే. హీరో తన స్టేషన్‌కి వచ్చిన విలన్‌ను కొందరి నుంచి కాపాడాల్సి వస్తుంది. సాధారణంగా సినిమాల్లో విలన్లను చంపేస్తుంటారు కానీ ఇందులో కాపాడటమే కథ. దానికోసం హీరో ఎన్ని సమస్యలు ఫేస్ చేసాడనే లైన్‌ను తీసుకుని కథ అల్లుకున్నాడు వెంకట్ ప్రభు. కస్టడీ కథ అంతా 1995 టైంలో జరుగుతుంది. సినిమాలో యాక్షన్ బాగుంది కానీ లవ్ స్టోరీ, కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు. చైతూ, కృతి శెట్టి మధ్య సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. సినిమా టేక్ ఆఫ్ అవ్వడానికి కనీసం 25 నిమిషాలకు పైగానే తీసుకున్నాడు దర్శకుడు. ఆ తర్వాత కానీ కథ ట్రాక్ ఎక్కదు. ఎప్పుడైతే కథలోకి అరవింద్ స్వామి వస్తాడో.. అప్పట్నుంచి కథ బాగానే ముందుకు వెళ్తుంది.

ఇంటర్వెల్ వరకు చాలా వేగంగా వెళ్తుంది సినిమా. సెకెండాఫ్‌పై అంచనాలు పెంచేస్తుంది ఇంటర్వెల్ సీక్వెన్స్. ఫస్టాఫ్‌లో పాటలు, లవ్ ట్రాక్ మైనస్ కాగా.. ప్రీ ఇంటర్వెల్ సీన్ హైలెట్ అయింది. సినిమా పర్లేదు.. సెకండాఫ్ ఈ మాత్రం ఉన్నా చాలు పక్కా బొమ్మ బ్లాక్‌బస్టర్ అనుకుంటున్న సమయంలో.. ఊహించని రీతిలో డౌన్ అయిపోయింది కథనం. సెకెండాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నార్మల్‌లా ఉండటం.. విలన్ బ్యాగ్రౌండ్ వీక్ అవ్వడంతో కథ దారి తప్పింది. దానికి తోడు స్లో నరేషన్ చాలా వరకు సినిమాపై అభిప్రాయం మార్చేసింది. ట్విస్టులున్నా.. పెద్దగా ఆకట్టుకోవు. సినిమా కథ అంతా 48 గంటల్లోనే సాగుతుంది. నాలుగేళ్ల కింద వచ్చిన కార్తి ఖైదీ సినిమాకు ఖరీదైన జిరాక్స్ తీస్తే ఎలా ఉంటుందో.. ఇప్పుడు కస్టడీ కూడా అలాగే అనిపిస్తుంది. సిఎంగా ప్రియమణి పాత్ర జయలలితను గుర్తు చేస్తుంది.

నటీనటులు:

శివ పాత్రలో నాగ చైతన్య బాగున్నాడు.. మరోసారి మెప్పించాడు.. తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. లుక్ పరంగానూ మారిపోయాడు చైతూ. ఇక కృతి శెట్టి ఉన్నంతలో పర్లేదు. సినిమాలో హీరో కంటే ఎక్కువగా అరవింద్ స్వామి హైలెట్ అయ్యాడు. చేసేది క్రైమ్ అయినా కూడా.. తాను నమ్మిందే న్యాయం అనుకునే పాత్ర ఇది. అరవింద్ స్వామి డైలాగులు కూడా బాగున్నాయి.. అక్కడక్కడా మంచి వినోదం పండింది. నటరాజన్‌గా శరత్ కుమార్ పాత్ర కూడా బాగుంది. అటు శరత్ కుమార్.. ఇటు అరవింద్ స్వామి పాత్రలు హైలైట్ కావడంతో.. ఆటోమేటిక్‌గా చైతూ కూడా హైలైట్ అయిపోయాడు. ప్రియమణి జస్ట్ ఓకే.. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నికల్ టీం:

యువన్ శంకర్ రాజా, ఇళయ రాజ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని సీన్స్‌కు పర్ఫెక్టుగా యాప్ట్ అయిన మ్యూజిక్.. మరికొన్ని చోట్ల తేలిపోయింది. పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఎస్ఆర్ కతీర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ మాత్రం కాస్త వీక్.. అక్కడక్కడా కొన్ని సీన్స్ బోర్ కొట్టిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పర్లేదు. వెంకట్ ప్రభు దర్శకుడిగా ఫస్టాఫ్ దుమ్ము లేపినా.. సెకండాఫ్ మాత్రం వదిలేసాడు. ఫస్టాఫ్ తీరుగా సెకండాఫ్ ఉండుంటే కస్టడీ రేంజ్ మారిపోయేది.

పంచ్ లైన్: కస్టడీ.. ఫస్టాఫ్ థ్రిల్.. సెకండాఫ్ డల్..

మరిన్ని సినిమా రివ్యూలు చదవండి..