Hidimba Movie Review: హిడింబ రివ్యూ.. యంగ్ హీరో అశ్విన్ హిట్టు అందుకున్నాడా ?..
అశ్విన్ బాబు, నందిత శ్వేత జంటగా అనీల్ కన్నెగంటి తెరకెక్కించిన సినిమా ‘హిడింబ’. ఈ చిత్రం జులై 20న విడుదలైంది. ఇండియన్ సినిమాలోనే న్యూ కాన్సెప్ట్ అంటూ వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..? అసలు హిడింబ ఎలా ఉంది..? పూర్తి రివ్యూలో చూద్దాం..
మూవీ రివ్యూ: హిడింబ
నటీనటులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, మకరంద్ దేశ్‌పాండే, రఘు కుంచె, శ్రీనివాసరెడ్డి, సంజయ్ స్వరూప్, రాజీవ్ కనకాల, షిజ్జు, రాజీవ్ పిళ్ళై, శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం: వికాస్ బాడిస
సినిమాటోగ్రఫీ: బి. రాజశేఖర్
దర్శకుడు : అనిల్ కన్నెగంటి
నిర్మాతలు: గంగపట్నం శ్రీధర్
అశ్విన్ బాబు, నందిత శ్వేత జంటగా అనీల్ కన్నెగంటి తెరకెక్కించిన సినిమా ‘హిడింబ’. ఈ చిత్రం జులై 20న విడుదలైంది. ఇండియన్ సినిమాలోనే న్యూ కాన్సెప్ట్ అంటూ వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..? అసలు హిడింబ ఎలా ఉంది..? పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ :
IPS ఆద్య (నందితా శ్వేతా) ఓ సిన్సియర్ ఆఫీసర్. కేరళ నుంచి వచ్చి హైదరాబాద్‌లోనే జాబ్ చేస్తుంటుంది. ఆమెతో పాటు అభయ్ (అశ్విన్ బాబు) పోలీస్ ఆఫీసర్. హైదరాబాద్‌లో వరుసగా అమ్మాయిలు అదృశ్యం అవుతుంటారు.. ఒకటి రెండు కాదు చాలా మంది అమ్మాయిలు మిస్ అవ్వడంతో ఆ కేసును అభయ్, ఆద్య కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే వాళ్లకు దయా గురించి తెలుస్తుంది. అక్కడే చాలా మంది అమ్మాయిలు ఉంటారని తెలుసుకుని అతన్ని పట్టుకుంటారు. కానీ ఆ తర్వాత కూడా మిస్సింగ్ కేసులు ఆగవు. పైగా ఈ కేసు 25 ఏళ్ళ కిందటి కేరళలో జరిగిన ఓ కేసుతో ముడిపడి ఉంటుంది. అప్పుడేం జరిగింది.. హైదరాబాద్‌లో ఇప్పుడు జరుగుతున్న మిస్సింగ్స్‌కు పాతికేళ్ళ నాటి కేసుకు సంబంధమేంటి..? అభయ్, ఆద్య కలిసి ఈ కేసు చేధించారా లేదా.. అసలు హిడింబ అంటే ఏంటి..? అనేది మిగిలిన కథ..
కథనం:
కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలు చూస్తున్నపుడు ఓ ఎగ్జైట్‌మెంట్ వస్తుంది.. హిడింబ చూసినపుడు ప్రేక్షకులకు కూడా ఇలాంటి ఎగ్జైట్‌మెంట్ వస్తుంది. కానీ ఎగ్జైంట్‌మెంట్ కేవలం కాన్సెప్ట్ దగ్గరే ఆగిపోయింది. డెఫినెట్‌గా హిడింబ కొత్తగా అనిపిస్తుంది. కానీ ఇంత మంచి కాన్సెప్ట్ స్క్రీన్ ప్లే లోపాల ముందు తేలిపోయిందనిపించింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే సన్నివేశాలు చాలా కన్ఫ్యూజింగ్‌గా ఉన్నాయి. రెండు టైమ్ పీరియడ్స్ మధ్య జరిగే సీన్స్ కన్విన్సింగ్‌గా అనిపించవు. ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నా.. అర్థం కాదు. సెకండాఫ్‌లో వచ్చే మొదటి సీన్‌తోనే కన్ఫ్యూజన్ కూడా మొదలవుతుంది. మెయిన్ స్టోరీ మొదలయ్యే వరకు స్క్రీన్ ప్లే గజిబిజీగానే ఉంటుంది. ఆడియన్స్‌కు ఇదేదో ఫుల్ కిక్ ఇస్తుందనే మూడ్‌లో రివర్స్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు అనిల్. కానీ అది మిస్ ఫైర్ అయింది. సెకండాఫ్ షురూ అయిన తర్వాతే పూర్తి క్లారిటీ వస్తుంది. హిడింబ జాతి బ్యాక్ డ్రాప్ అంతా బాగుంది.. ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మ్యాన్ ఈటర్స్ అనే కాన్సెప్ట్ మనకు కొత్తదే.. అదే ఆసక్తికరంగా ఉంది. దాని చుట్టూ అల్లుకున్న సీన్స్ కొంతవరకు మెప్పిస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ షాకింగ్ అనిపిస్తుంది. సినిమాకు ఇంకాస్త కథనం యాడ్ అయ్యుంటే నెక్ట్స్ లెవల్ అయ్యేది కానీ స్క్రీన్ ప్లే లోపాలతో యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది హిడింబ. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్నీ ఇల్లాజికల్‌గా అనిపిస్తుంటాయి. 25 ఏళ్ళ నాటి సీన్స్ చూపిస్తూనే.. ఇప్పటి సీన్స్ కూడా చూపించడంతో కథ ఎక్కడ నడుస్తుందో అర్థం కాదు. సెకండాఫ్‌లో అన్ని ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చినా కూడా అప్పటికే ఆలస్యమైపోయింది.
నటీనటులు:
అశ్విన్ బాబు తన పాత్రకు న్యాయం చేసాడు.. మాస్ హీరోగా మెప్పించాడు. కొన్ని సీన్స్ హై ఓల్టేజ్‌లో కనిపించాడు. హీరోయిన్ నందిత శ్వేతా పర్లేదు. ఓ వైపు రొమాంటిక్‌గా కనిపిస్తూనే.. మరోవైపు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించింది. మరో ముఖ్యమైన పాత్రలో మకరంద్ దేశ్ పాండే అదరగొట్టాడు. ఇక సిజ్జు, రఘు కుంచె, శుభలేక సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి సహా మిగిలిన వాళ్లంతా ఓకే..
టెక్నికల్ టీం:
వికాస్ బాడిస సంగీతం జస్ట్ ఓకే. పాటలు పక్కనబెడితే.. బ్యాగ్రౌండ్ స్కోర్ మరీ లౌడ్‌గా అనిపించింది. కొన్ని సీన్స్‌లో బాగా పేలిన ఆర్ఆర్.. కొన్ని సీన్స్‌కు మైనస్ అయింది. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. అలాగే ఎడిటింగ్ ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది. సెకండాఫ్ కొన్ని సీన్స్ ల్యాగ్ అయ్యాయి. దర్శకుడు అనీల్ కన్నెగంటి మంచి కథ తీసుకున్నాడు కానీ కథనం ఆకట్టుకోలేదు. స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగుండుంటే కచ్చితంగా హిడింబ రేంజ్ మరోలా ఉండేది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా హిడింబ.. గుడ్ కాన్సెప్ట్.. బ్యాడ్ ఎగ్జిగ్యూషన్..