Mission 2024: మా రూటు సెపరేటు… రెండు ప్రధాన కూటములకు దూరం.. తటస్థ పార్టీల ముందున్న సవాళ్లేంటి?
ఐఎన్డీఐఏ కూటమిలో కాంగ్రెస్ సహా 26 పార్టీలు కనిపించగా, ఎన్డీయేలో బీజేపీ సహా 38 పార్టీలు చేతులుకలిపాయి. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ అయితే అటు, లేదంటే ఇటు అన్న చందంగా జట్టుకట్టాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల సరళి కూడా దాదాపు అలాగే ఉండేలా కనిపిస్తోంది.
గత కొద్ది రోజులుగా దేశంలో రాజకీయాలు రెండు ధృవాలుగా మారిపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP)ను వ్యతిరేకించే పార్టీలన్నీ కొత్తగా “ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A)” పేరుతో ఒక్క చోటకు చేరాయి. ఈ కూటమికి పోటీగా బీజేపీ కూడా మూలనపడేసిన ‘నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)’ బూజు దులిపి బలప్రదర్శన చేసింది. ఐఎన్డీఐఏ కూటమిలో కాంగ్రెస్ సహా 26 పార్టీలు కనిపించగా, ఎన్డీయేలో బీజేపీ సహా 38 పార్టీలు చేతులుకలిపాయి. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ అయితే అటు, లేదంటే ఇటు అన్న చందంగా జట్టుకట్టాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల సరళి కూడా దాదాపు అలాగే ఉండేలా కనిపిస్తోంది. బీజేపీకి అనుకూలంగా ఉంటే అటు ఓటు పడుతుంది.. లేదంటే ఐఎన్డీఐఏ కూటమికి ఓటు పడుతుంది అన్నట్టుగా పరిస్థితి మారింది. బైపోలార్ పాలిటిక్స్ మాదిరిగా మారిన ఈ పరిస్థితుల్లోనూ ఏ కూటమిలోనూ లేకుండా సొంతంగా తమ ఉనికి చాటుకుంటున్న తటస్థ రాజకీయ పార్టీలు కొన్ని ఉన్నాయి. అవేమీ చిన్నా, చితకా పార్టీలు కూడా కాదు. కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండడమే కాదు, పార్లమెంటులో మొత్తం 91 మంది ఎంపీల సంఖ్యాబలంతో ఏ కూటమిలోనూ లేని 11 రాజకీయ పార్టీలున్నాయి. అంటే దేశంలో ఇండియా, ఎన్డీయే మాత్రమే కాదు, వీటితో సంబంధం లేని తృతీయ శక్తి కూడా ఉందని స్పష్టమవుతోంది. మరి ఆ థర్డ్ ఫోర్స్.. కూటమిగా జట్టు కడతాయా లేక సొంత బలంతో ఎక్కడికక్కడ తమ అస్తిత్వాన్ని, బలాన్ని చాటుకుంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది.
పార్టీలు తటస్థం – సవాళ్లు అనేకం
రెండు ప్రధాన జాతీయ పార్టీల నేతృత్వంలో ఏర్పడ్డ రెండు ప్రధాన కూటములు దేశంలో పరస్పర రాజకీయ యుద్ధ వాతావరణానికి తెరలేపాయి. దేశ ప్రజలకు ఎలాంటి గందరగోళం లేకుండా రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశాన్ని ముందు పెట్టాయి. మోదీ పాలన నచ్చితే ఎన్డీయే కూటమికి, లేదంటే ఐఎన్డీఐఏ (I.N.D.I.A) కూటమికి ఓటేసే పరిస్థితిని కల్పించాయి. ఇలాంటప్పుడు ఈ రెండూ కాదు, మూడో ప్రత్యామ్నాయం కూడా ఉందని చెప్పాలంటే ఆ పార్టీలు జాతీయస్థాయిలో బలమైన కూటమిగానైనా జట్టు కట్టి ఉండాలి. ఎన్డీఏ, ఐఎన్డీఐఏలకు ధీటుగా తమ బలాన్ని ప్రదర్శించాలి. కానీ ఈ రెండు కూటములకు సమ దూరం పాటిస్తూ తమ సొంత బలాన్ని చాటుకోవాలని చూస్తున్న ఆ రాజకీయ పార్టీలు ఒక కూటమిగా మాత్రం లేవు. ఎవరికి వారు తమ తమ రాష్ట్రాల్లో తమ పట్టు నిలుపుకుంటే చాలు అన్నట్టుగా ఉన్నాయి. దేశంలోని పార్టీలన్నీ రెండు జట్లుగా విడిపోయిన తరుణంలో ఒంటరిగా ఈ రెండు కూటములను ఎదుర్కోవడం అంత సులభమేమీ కాదు. అసెంబ్లీ ఎన్నికల వరకు తమ పట్టు నిలుపుకోగలిగినా.. లోక్‌సభ ఎన్నికల వరకు వచ్చేసరికి ఈ తృతీయ తటస్థ రాజకీయ పార్టీలకు సవాళ్లు తప్పవని అర్థమవుతోంది. నిజానికి ఈ తరహా సవాళ్లను 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఒడిశాలోని బిజూ జనతా దళ్ (BJD) అధినేత ఒడిశాలో ఎదుర్కొన్నారు. ఏకకాలంలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు అసెంబ్లీలో బీజేడీకి అనుకూలంగా ఓటేసి, పార్లమెంట్ విషయంలో కొంత బీజేపీ వైపు మొగ్గు చూపిన పరిస్థితి కనిపించింది. నేటి భారత రాజకీయాల్లో అపర చాణక్యుడి మాదిరిగా వ్యూహాలు రచించడంతో దిట్టగా పేరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు (కేసీఆర్) కూడా ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించినట్టున్నారు. అందుకే ఏకకాలంలో జరగాల్సిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను విడదీసి, ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని మరీ అసెంబ్లీ ఎన్నికలను విడిగా ఎదుర్కొన్నారు. ఆ ఎన్నికల్లో సునాయాసంగా ఘన విజయం సాధించిప్పటికీ, కొద్ది నెలల వ్యవధిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం జాతీయ పార్టీలతో ప్రతిఘటన ఎదుర్కోక తప్పలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఏకకాలంలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఆధిపత్యాన్ని ప్రదర్శించగలిగింది.
ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో మోడీకి అనుకూలం లేదంటే వ్యతిరేకం అన్న తరహా పోరుకే ఆస్కారం ఎక్కువగా ఉంది. మోడీకి అనుకూలం, వ్యతిరేకం అన్న పేరుతో ఏకమైన పార్టీలు ఓట్లను సమీకరించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలుపెట్టాయి. ఈ పరిస్థితుల్లో ఈ రెండు కూటముల్లో లేని వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP), తెలుగుదేశం (TDP), భారత రాష్ట్ర సమితి (BRS), బహుజన్ సమాజ్ పార్టీ (BSP), బిజూ జనతా దళ్ (BJD), జనతా దళ్ (సెక్యులర్) – JD(S), శిరోమణి అకాలీదళ్ (SAD), ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (INLD) వంటి పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో తమ పట్టు నిలబెట్టుకోడానికి గట్టిగా శ్రమించాల్సి ఉంటుంది. ఎందుకంటే 2024లో జరగబోయే హై-టెన్షన్ ముఖాముఖి పోరులో ఈ పార్టీల తటస్థ వైఖరే ప్రతికూలంగా మారవచ్చు.
ఆహ్వానం అందకపోవడమే కారణమా?
ఆంధ్రప్రదేశ్(వైఎస్సార్సీపీ), తెలంగాణ(బీఆర్ఎస్), ఒడిశా(బీజేడీ) రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు లోక్‌సభలో మొత్తం 63 మంది ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ ప్రతిపక్షాల ఐక్య కూటమి ఐఎన్డీఐఏ (INDIA) నుంచి ఆహ్వానం లభించలేదు. ప్రతిపక్ష కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ అంటే వ్యతిరేకతే ఈ మూడు పార్టీల్లో కామన్‌గా కనిపించే లక్షణం. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలైనందున ఈ పార్టీలకు కూటమి నుంచి ఆహ్వానం అందలేదు. ప్రతిపక్ష కూటమిలో చేరకపోవడానికి అదొక్కటే కారణం కాదు.
రెండున్నర దశాబ్దాలుగా ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్, ఒడిశా రాజకీయాలపై గట్టి పట్టును కొనసాగిస్తూనే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. 2019లో రాజ్యసభలో అశ్విని వైష్ణవ్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీతో ఉన్న బలమైన బంధాన్ని ఆయన బహిరంగంగా ప్రదర్శించారు. అయితే రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా బలపడితే అదుపు చేయడం కష్టం అన్న సంగతి ఆయనకు తెలుసు. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఏమాత్రం సందు దొరకకుండా చేయాలన్న ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ బలపడితే మైనారిటీలు ఆ పార్టీ వెంట ఉంటారు. అది బీజేడీకి నష్టం కలిగిస్తుంది. అందుకే కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలను నవీన్ పట్నాయక్ కొనసాగిస్తున్నారు.
తెలంగాణలో బీఆర్‌ఎస్ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ మాదిరిగానే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కు మద్దతుగా బీఆర్ఎస్ నిలిచినప్పటికీ.. రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్‌తోనే ఎక్కువ రాజకీయ వైరం ఉంది. మరోవైపు రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో బీఆర్‌ఎస్‌ను బీజేపీ బి-టీమ్‌గా అభివర్ణిస్తూ విమర్శలు చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)గా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చి జాతీయస్థాయిలో రాజకీయాలు చేయాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమితో కలిసి సాగే అవకాశం ఏ కోశానా లేదు. అలాగని ఎన్డీఏ కూటమికి దగ్గరయ్యే పరిస్థితి కూడా అస్సలు లేదు. దళిత, మైనారిటీల్లో గట్టి పట్టున్న బీఆర్ఎస్, ఏమాత్రం ఎన్డీఏ కూటమికి దగ్గరైనా ఆ వర్గాలు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే రెండు కూటములకు సమదూరం పాటిస్తూ.. తటస్థంగా ఉంటూ రాష్ట్రంలోనే కాదు, రాష్ట్రం వెలుపల కూడా తన పట్టు ప్రదర్శించాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానంతో విబేధాలు తలెత్తాయి. వాటి కారణంగానే ఆయన కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీని పెట్టుకుని, దాదాపు దశాబ్దకాలం పోరాడి అధికారం సాధించారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండా ఒంటరిగానే రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. వైఎస్సార్సీపీ ఏర్పాటు, రాష్ట్ర విభజన వంటి పరిస్థితులతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుమరుగైపోయింది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దారిలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నప్పటికీ, దళిత, క్రైస్తవ, ముస్లిం వర్గాలే ప్రధాన ఓటుబ్యాంకుగా కలిగిన జగన్ ఎన్డీఏ కూటమిలో చేరే ప్రయత్నం అస్సలు చేయకపోవచ్చు.
ఈ మూడు పార్టీలకు కాంగ్రెస్‌తో ఉన్న విబేధాల కారణంగా ప్రతిపక్ష కూటమిని ఆహ్వానం అందలేదు. కాంగ్రెస్‌తో వైరం నేపథ్యంలో ఈ మూడు పార్టీలూ బీజేపీకి అనుకూలం అని లేదంటే బీజేపీతో లోపాయకారి అవగాహన ఉందనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాయి. ఎన్డీఏ ఏర్పాటైనప్పటి నుంచి ఆ కూటమిలో భాగంగా ఉంటూ వచ్చిన తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాతి కాలంలో కూటమి నుంచి బయటికొచ్చిన సందర్భాల్లో సైతం కాంగ్రెస్‌కు దగ్గర కాలేదు. కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ, 2018లో ఎన్డీఏ నుంచి బయటికొచ్చినప్పుడు మాత్రం తొలిసారిగా కాంగ్రెస్‌తో జట్టుకట్టింది. బహుశా ఆ పార్టీకి ఇదే చారిత్రక తప్పిదమై 2019లో ఘోర పరాజయం పాలైంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో తిరిగి చేరేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ.. బీజేపీ వైపు నుంచి సానుకూలత లేకపోవడంతో ఇప్పటికైతే తటస్థ రాజకీయ పార్టీగానే కొనసాగుతోంది.
దక్షిణాదిన కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో గట్టి పట్టున్న జనతాదళ్ (సెక్యులర్) కూడా ప్రస్తుతం తటస్థంగానే ఉన్నప్పటికీ.. ఎన్డీఏలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేడీ(ఎస్) కంచుకోట అయిన దక్షిణ కర్ణాటకలో ఆ పార్టీ ఓట్లను కాంగ్రెస్ చీల్చింది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతంతో పాటు సీట్లూ తగ్గాయి. ఇక ఉనికి కాపాడుకోవడం అనివార్యంగా మారిన పరిస్థితుల్లో ఆ పార్టీ ఎన్డీఏతో జట్టుకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారంరాత్రి ప్రధాని మోదీతో భేటీ అయిన జేడీఎస్ అధినేత కుమారస్వామి.. బీజేపీతో కలిసి పనిచేస్తామని స్పష్టంచేశారు.
ఉత్తరాదిన మరోలా..
పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్ 2020 వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్ రైతులు చేపట్టిన ఆందోళనల కారణంగా అకాలీలు ఎన్డీఏను వీడారు. పంజాబ్‌తో అకాలీదళ్‌కు రాజకీయ వైరం ఉన్నది కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో. అయితే ఆ రెండు పార్టీలూ ఇప్పుడు ఐఎన్డీఐఏ (ఇండియా) కూటమిలో ఉన్నాయి. కాబట్టి ఆ కూటమిలో చేరడానికి అసలేమాత్రం ఆస్కారం లేదు. మరోవైపు ఎన్డీయేను వీడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ వరుస పరాజయాలు చవి చూసింది. అకాళీదల్, బీజేపీ కలిసి పోటీ చేసినట్టయితే అనేక సీట్లలో ఫలితాలు తారుమారవుతాయని గ్రహించింది. అందుకే సుదీర్ఘకాలం స్నేహబంధం కలిగిన బీజేపీతో మళ్లీ జట్టు కట్టి ఎన్డీఏ కూటమిలోకి కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో ఒకప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతికి కూడా ప్రతిపక్ష కూటమి ఆహ్వానం పంపలేదు. పాట్నాలో జరిగిన సమావేశం సందర్భంగానే ఆమె ఆ కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రతిపక్ష కూటమిలో నేతల చేతులు కలుస్తాయి తప్ప మనసులు కలవవని, క్షేత్రస్థాయిలో కూటమిలోని పార్టీలు తన్నుకుంటున్నాయని దెప్పిపొడిచారు. దళిత, ముస్లిం సామాజిక సమీకరణాలతో రాజకీయాలు చేస్తున్న మాయావతి ఎన్డీఏతోనూ కలిసి సాగే అవకాశం లేదు. పార్లమెంటులో 9 మంది ఎంపీల సంఖ్యాబలం కలిగి ఉన్న మాయావతి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు సహా ఉత్తర్ ప్రదేశ్‌లో కూడా ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు.
మరోవైపు, హర్యానాకు చెందిన INLD థర్డ్ ఫ్రంట్‌కు అనుకూలంగా ఉంది. గతంలో ఎన్డీఏ కూటమిలో ఉండి వాజ్‌పేయి ప్రభుత్వంలో భాగం పంచుకున్న ఈ పార్టీలో చీలిక వర్గమైన జేజేపీ ఇప్పుడు హర్యానాలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో భాగంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ రెండు కూటములకు దూరంగా మూడవ ప్రత్యామ్నాయం వైపు చూస్తోంది.
ఏఐఎంఐఎం గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్‌ఎస్‌కు దగ్గరైంది. ముస్లిం వర్గాలకు ప్రాతినిథ్యం వహించే ఈ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయం చేస్తోంది. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి దక్కాల్సిన ఓట్లను ఎంఐఎం పార్టీ చీల్చి పరోక్షంగా బీజేపీకి సహకరిస్తోందని, ఒకరకంగా చెప్పాలంటే అది బీజేపీ బీ-టీమ్ అని ఎంఐఎంను మిగతా పార్టీలు విమర్శిస్తూ ఉంటాయి. మొత్తంగా ఏ కూటమిలోనూ లేని ఈ పార్టీల్లో కొన్ని ఎన్నికలు సమీపించే సమయానికి చేరితే ఎన్డీఏలో చేరే అవకాశాలు ఉన్నాయి. మిగతా పార్టీలు తటస్థ వైఖరితో అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు నిలబెట్టుకోగలిగినా సరే.. లోక్‌సభ ఎన్నికల్లో ఢీకొట్టడం అంత సులభమేమీ కాదని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. నలుగురు నడిచే బాటలో కాకుండా కొత్త మార్గంలో ప్రయాణం ఎన్ని సవాళ్లు విసురుతుందో.. ఈ తటస్థ పార్టీలు కూడా అన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..