PM Modi: యూపీఏ ‘స్కామ్’లతో బ్యాంకింగ్ రంగాన్ని నాశనం చేసింది.. రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోడీ ఫైర్..
PM Modi - Rozgar Mela: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత యూపీఏ ప్రభుత్వంపై మళ్లీ విరుచుకుపడ్డారు. యూపీఏ ప్రభుత్వం స్కామ్‌లతో బ్యాంకింగ్ రంగాన్ని నాశనం చేసిందంటూ ఫైర్ అయ్యారు. గతంలో వెన్ను విరిచిన బ్యాంకింగ్ రంగాన్ని తాము పునరుద్ధరించి లాభాల బాట పట్టించామని పీఎం మోడీ తెలిపారు.
PM Modi – Rozgar Mela: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత యూపీఏ ప్రభుత్వంపై మళ్లీ విరుచుకుపడ్డారు. యూపీఏ ప్రభుత్వం స్కామ్‌లతో బ్యాంకింగ్ రంగాన్ని నాశనం చేసిందంటూ ఫైర్ అయ్యారు. గతంలో వెన్ను విరిచిన బ్యాంకింగ్ రంగాన్ని తాము పునరుద్ధరించి లాభాల బాట పట్టించామని పీఎం మోడీ తెలిపారు. రోజ్‌గార్ మేళాలో భాగంగా వర్చువల్‌గా 70,000 మందికి పైగా ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ లెటర్‌లను అందించారు. కేంద్రం రోజ్‌గార్ మేళా ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ చేపడుతోంది. యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా అన్ని శాఖలలో 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోంది. ఈమేరకు శనివారం దేశవ్యాప్తంగా 44 ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళాను నిర్వహించి 70 వేల మందికి నియామక పత్రాలను అందించారు. వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. పలు కీలక అంశాలపై మాట్లాడుతూ విపక్షాలపై విచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతృత్వంలోని గత ప్రభుత్వం ‘ఫోన్ బ్యాంకింగ్ స్కామ్’ చేసిందని ఆరోపించారు. ఇది కొంతమందికి ప్రయోజనం కలిగించిందని, అయితే ఇది దేశ బ్యాంకింగ్ రంగానికి వెన్ను విరిచిందని పేర్కొన్నారు. అదే సమయంలో, బ్యాంకుల నుంచి పంపిణీ చేసిన రుణం తిరిగి రాలేదని.. ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రాణాంతకంగా మారిందన్నారు.
ఈ రోజు ప్రపంచంలో బ్యాంకింగ్ రంగం అత్యంత పటిష్టంగా ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి అని ప్రధాని మోడీ గుర్తుచేశారు. 9 ఏళ్ల క్రితం ఈ పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో మన బ్యాంకింగ్ రంగం భారీగా నష్టపోయిందన్నారు. నేడు మన బ్యాంకింగ్ రంగం దేశంలోని 140 కోట్ల జనాభాకు డిజిటల్ లావాదేవీల సౌకర్యాలను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. 9 సంవత్సరాల క్రితం పరిస్థితులు.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు.
కొంతమంది శక్తివంతమైన నాయకులు.. కుటుంబాలకు ఇష్టమైన వారికి వేల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చారని, ఆ రుణాలు ఎప్పటికీ తిరిగి చెల్లించరంటూ పేర్కొన్నారు. అనంతరం తమ ప్రభుత్వం, బ్యాంకుల నిర్వహణను బలోపేతం చేయడం, చిన్న బ్యాంకులను విలీనం చేయడం.. ఈ రంగానికి సహాయం చేయడానికి వృత్తి నైపుణ్యాన్ని ప్రవేశపెట్టడం వంటి అనేక చర్యలను చేపట్టిందని మోదీ నొక్కి చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు అంతకుముందు వేల కోట్ల రూపాయల నష్టాలకు ప్రసిద్ధి చెందాయని, ఎన్పీఏ నష్టాల్లో ఉందని.. అయితే ఇప్పుడు అవి రికార్డు లాభాలకు ప్రసిద్ధి చెందాయని ప్రధాని చెప్పారు.
‘ముద్ర’ పథకం కింద పేదలు, అసంఘటిత రంగాలకు రుణాల ద్వారా సహాయం, మహిళా స్వయం సహాయక బృందాలను ఆదుకోవడం లాంటివి చేస్తున్నామని.. బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు కష్టపడి, ప్రజలకు సేవ చేయడానికి, వివిధ ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి నిబద్ధతతో ఉన్నారని కొనియాడారు.
ప్రపంచ విశ్వాసానికి, ఆకర్షణకు కేంద్రంగా భారత్ ఆవిర్భవించిందని, దీన్ని దేశం పూర్తిగా వినియోగించుకోవాలని మోదీ అన్నారు. వివిధ రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో మరింత పెరుగుతుందని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..