Mem Famous Movie: మేం ఫేమస్ ఫుల్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే..

ఈ మ‌ధ్య‌ కేవలం ప్ర‌మోష‌న్స్‌తోనే హైప్ తెచ్చుకున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది మరో అనుమానం లేకుండా మేం ఫేమస్ మాత్రమే. దీనికోసం స్టార్స్ అంతా కదిలొచ్చారు.. వీడియోలు చేసారు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కూడా సినిమా అద్భుతం అంటూ విడుదలకు ముందే ట్వీట్ చేసారు.

Mem Famous Movie: మేం ఫేమస్ ఫుల్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే..
Mem Famous
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 26, 2023 | 2:33 PM

మూవీ రివ్యూ: మేం ఫేమస్

న‌టీన‌టులు: సుమంత్ ప్రభాస్,మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చ, అంజిమామ, శివ నందన్ తదితరులు

సంగీతం: కళ్యాణ్ నాయక్

సినిమాటోగ్రఫీ: శ్యామ్ దూపాటి

బ్యానర్లు: చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్

నిర్మాతలు: అనురాగ్ రెడ్డి,శరత్ చంద్ర, చంద్రు మనోహర్

కథ, కథనం, మాటలు, దర్శకత్వం: సుమంత్ ప్రభాస్

ఈ మ‌ధ్య‌ కేవలం ప్ర‌మోష‌న్స్‌తోనే హైప్ తెచ్చుకున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది మరో అనుమానం లేకుండా మేం ఫేమస్ మాత్రమే. దీనికోసం స్టార్స్ అంతా కదిలొచ్చారు.. వీడియోలు చేసారు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కూడా సినిమా అద్భుతం అంటూ విడుదలకు ముందే ట్వీట్ చేసారు. మరి ఈ సినిమాలో నిజంగానే అంత విషయం ఉందా..?

కథ:

ఈ సినిమా కథ అంతా బండ‌న‌ర్సంప‌ల్లి అనే గ్రామంలోనే జరుగుతుంది. ఆ ఊళ్ళోనే ఉండు ముగ్గురు స్నేహితుల కథ ఇది. మ‌హేష్ అలియాస్ మై (సుమంత్ ప్ర‌భాస్), దుర్గ (మ‌ణి ఎగుర్ల‌), బాల‌కృష్ణ (మౌర్య‌) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. అలాగే పనీ పాట లేకుండా ఊరి మీద పడి బలాదూర్‌గా తిరగడం.. ఏదో ఓ తిక్క పని చేసి అందరితో చివాట్లు తినడమే వాళ్ల పని. అంతా వీళ్లను ఏదో ఓ పని చేసుకోండ్రా అంటూ తిడుతూ ఉంటారు. ఓ సమయంలో ఊరంతా ఒక్కటై వీళ్లను నిలదీస్తుంది. ఇక ఆ సమయంలో ఏదో ఒకటి చేయాలని ఫిక్సైపోతారు ఈ ముగ్గురు. అలా ఓ బిజినెస్ పెడతారు.. మంచి లాభాలు వస్తున్నాయి అనుకుంటున్న సమయంలో అనుకోని పరిస్థితుల కారణంగా అప్పటి వరకు సంపాదించింది పొవడమే కాకుండా.. మీద నుంచి 2 లక్షల అప్పు కూడా పడుతుంది. దాంతో జీవితం అంతా తలకిందులు అయిపోతుంది. పైగా మై ప్రాణంగా ప్రేమించిన మౌనిక (సార్య ల‌క్ష్మ‌ణ్‌), బాల ప్రాణంగా ప్రేమించిన బబ్బీ (సిరా రాశీ) తో విడిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడేం చేసారు.. ఫేమస్ అవ్వడానికి మళ్లీ ఎలాంటి దారి ఎంచుకున్నారు అనేది మిగిలిన కథ..

కథనం:

మేం ఫేమస్‌లో ఇదే కథ అని చెప్పడానికేం లేదు.. ఏదనిపిస్తే అదే చేసుకుంటూ వెళ్లిపోయాడు దర్శకుడు కమ్ నటుడు సుమంత్ ప్రభాస్. యూత్‌ను తక్కువగా అంచనా వేయొద్దు.. వాళ్లలో టాలెంట్ చాలా ఉంటుంది.. కాకపోతే బయటికి రావాల్సినపుడే వస్తుంది అనేది ఈయన చెప్పాలనుకున్న కథ. దానికోసం పూర్తిగా యూత్ ఫుల్ నెరేషన్‌పైనే ఫోకస్ చేసారు సుమంత్. సినిమా మొదలవ్వడమే ఫన్ మోడ్‌లో స్టార్ట్ అవుతుంది. ఎక్కడా హీరో కారెక్టరైజేషన్ మాదిరే సీరియస్ నెస్ అయితే కనిపించదు. సరదాగా అలా వెళ్లిపోతుందంతే. తొలి 45 నిమిషాలు తినడం.. ఊరిమీద బలాదూర్ తిరగడం.. ఏదో ఓ తింగరి పని చేసి అందరితో చివాట్లు తినడం ఇదే సాగుతుంది. ఇంటర్వెల్‌కు అరగంట ముందు జ్ఞానోదయం అయిన తర్వాత బిజినెస్ మొదలుపెట్టడంతో కథ కూడా ముందుకు కదులుతుంది. వాళ్లెంతో ప్రాణంగా ప్రేమించి చేసిన బిజినెస్ నష్టాల పాలు కావడం.. అప్పటి వరకు తమతో పాటే ఉన్న స్నేహితుడు అనుకోని పరిస్దితుల్లో వదిలేసి సిటీకి వెళ్లిపోవడం లాంటి సన్నివేశాలు బాగున్నాయి. ఇంటర్వెల్ తర్వాత అసలు కథ మొదలవుతుంది. అయితే సినిమాలో హీరో మాదిరే.. బయట దర్శకుడికి కూడా పెద్దగా టార్గెట్స్ ఏం ఉండవు. ఏదనిపిస్తే అలా చేసుకుంటూ వెళ్లిపోతాయడంతే. ఫేమస్ అయిపోవడానికి యూ ట్యూబ్ వీడియోలు చేయాలనుకోవడం.. అవి చేసి లక్షల అప్పుడు తీరాలనుకోవడం.. రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవడం ఇవన్నీ లాజిక్‌కు దూరంగానే ఉంటాయి. కాకపోతే నవ్వు తెప్పిస్తాయి. ఈ సినిమాతో సుమంత్ చెప్పాలనుకున్న పాయింట్ అయితే ఒక్కటే.. యూత్ అనుకుంటే ఏదైనా సాధిస్తారు అని చెప్పడమే. దాన్నే సరదాగా తీసాడు. మధ్యలో వచ్చే సన్నివేశాలైనా.. అప్పుడప్పుడూ వచ్చే ఎమోషనల్ సీన్స్ అయినా అన్నీ సరదాగానే రాసుకున్నాడు సుమంత్. ఇలాంటి సినిమాల‌కు కామెడీనే ప్ర‌ధాన బ‌లం. అక్క‌డ‌క్క‌డ మెరుపులు త‌ప్పితే జాతి రత్నాలు తరహాలో నవ్వించడంతో సుమంత్ ప్ర‌భాస్ విఫ‌ల‌మ‌య్యాడు.

నటీనటులు:

సుమంత్ ప్ర‌భాస్ అదరగొట్టాడు. స్క్రీన్ మీద ఎనర్జీ నెక్ట్స్ లెవల్ అంతే. పైగా తన స్క్రిప్ట్ కావడంతో ఇంకా రెచ్చిపోయాడు. మై పాత్రకు ప్రాణం పోసాడు. మనోడి కామెడీ టైమింగ్ అదుర్స్ అంతే. మిగిలిన ఇద్దరు స్నేహితులు కూడా చాలా బాగా నటించారు. న్యాచురల్‌గా కనిపించారు. హీరో మరదలి పాత్రలో సార్య లక్ష్మణ్.. బబ్బీగా సిరా రాశీ బాగున్నారు. మరో కీలక పాత్రల్లో ముర‌ళీధ‌ర్‌గౌడ్‌, అంజిమామ‌, న‌రేంద్ర‌ర‌వి ఆకట్టుకున్నారు.

టెక్నికల్ టీం:

కళ్యాణ్ నాయక్ సంగీతం పర్లేదు. కాకపోతే సౌండింగ్ ఇష్యూ ఉంది. టెక్నికల్ సమస్యతో థియేటర్లో డైలాగులు కూడా సరిగ్గా వినబడలేదు. ఎడిటింగ్ సెకండాఫ్ వీక్. చాలా సన్నివేశాలు ల్యాగ్ అనిపించాయి. సినిమాటోగ్రఫీ వర్క్ పర్లేదు. దర్శకుడిగా సుమంత్ ప్రభాస్ పాస్ మార్కులు వేయించుకున్నాడు కానీ డిస్టింక్షన్ మాత్రం కాదు. డైలాగ్ రైటర్‌గా మాత్రం అక్కడక్కడా మంచి మాటలు రాసాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా మేం ఫేమస్.. అంత ఫేమస్ కాదు కానీ జస్ట్ ఓకే.