Malli Pelli: నరేష్- పవిత్ర లోకేష్‌ల మళ్లీ పెళ్లి రివ్యూ.. కనెక్ట్ అయితే ఓకే.. కాకపోతే

ఈ మధ్య కాలంలో తెలుగులో అత్యంత వివాదాస్పదంగా నిలిచిన సినిమా మళ్లీ పెళ్లి. అసలు నరేష్, పవిత్రల మధ్య ఏం జరుగుతుంది.. ఏం జరిగింది.. ఆయన జీవితంలో జరుగుతున్న సంఘటనలేంటి.. ఇవన్నీ కరెక్టా కాదా అనే నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కించారు ఎమ్మెస్ రాజు.

Malli Pelli: నరేష్- పవిత్ర లోకేష్‌ల మళ్లీ పెళ్లి రివ్యూ.. కనెక్ట్ అయితే ఓకే.. కాకపోతే
Malli Pelli
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: May 26, 2023 | 1:37 PM

రివ్యూ: మళ్లీ పెళ్లి

నటీనటులు: నరేష్ వికే, పవిత్రా లోకేష్, వనితా విజయ్ కుమార్, శరత్ బాబు, జయసుధ తదితరులు

ఎడిటింగ్: జునైద్ సిద్ధిక్యూ

సినిమాటోగ్రఫర్: బాల్ రెడ్డి

సంగీతం: సురేష్ బొబ్బిలి

కథ, దర్శకత్వం: ఎమ్మెస్ రాజు

నిర్మాత: నరేష్ విజయ్ కృష్ణ

ఈ మధ్య కాలంలో తెలుగులో అత్యంత వివాదాస్పదంగా నిలిచిన సినిమా మళ్లీ పెళ్లి. అసలు నరేష్, పవిత్రల మధ్య ఏం జరుగుతుంది.. ఏం జరిగింది.. ఆయన జీవితంలో జరుగుతున్న సంఘటనలేంటి.. ఇవన్నీ కరెక్టా కాదా అనే నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కించారు ఎమ్మెస్ రాజు. ఫిక్షన్ అంటూనే లైఫ్ స్టోరీ తీసారు నరేష్. మరి ఈ చిత్రం ఆకట్టుకుందా.. ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

నరేంద్ర (నరేష్ వికే) ఓ పెద్ద నటుడు. 250 సినిమాల అనుభవం ఉండి.. వేల కోట్ల ఆస్తి ఉన్న రిచ్ హీరో. అతడికి ఓ షూటింగ్‌లో పరిచయం అవుతుంది పార్వతి (పవిత్ర లోకేష్). ఆమెను తొలి చూపులనే చూసి ఇష్టపడతారు నరేంద్ర. అయితే ఆమెకు కూడా పర్సనల్ లైఫ్ ఉందని.. పెళ్లై పిల్లలు భర్తతో ఉందనే విషయం తెలిసి కామ్‌గా ఉండిపోతాడు. అదే సమయంలో తన జీవితంలో భార్య సౌమ్య సేతుపతి (వనిత విజయ్ కుమార్) తో అన్నీ గొడవలే ఉంటాయి. డబ్బు కోసం నరేంద్రను వేధిస్తుంటుంది సౌమ్య. దాంతో ఆమెతో విడిపోవాలని నిర్ణయించుకుంటాడు నరేంద్ర. అదే సమయంలో పార్వతితో ప్రేమలో పడతాడు. వీళ్ల ప్రేమ విషయాన్ని అమ్మా నాన్నలకు కూడా చెప్పి ఒప్పిస్తాడు. అదే సమయంలో పార్వతి తన భర్త ఫణీంద్ర (అద్దూరి రవివర్మ) తో ఎందుకు విడిపోవాలనుకుంటుంది.. ఆ తర్వాత ఏమైంది.. నరేంద్ర, పార్వతి ఒక్కటయ్యారా లేదా అనేది మిగిలిన కథ..

కథనం:

మళ్లీ పెళ్లి సినిమా అనేది కథ కాదు.. నరేష్ రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనల సమాహారమే. పైకి వాళ్లు ఎంత ఫిక్షన్ కథ అని చెప్తున్నా.. లోపల జరుగుతున్న సీన్స్ అన్నీ నరేష్ జీవితంలో జరిగినవే అనేది అర్థమవుతుంది. కాకపోతే ఈ చిత్రంలో కాస్త లోతుగా వెళ్లి తన జీవితాన్ని స్క్రీన్ మీద చూపించాడు నరేష్. ముఖ్యంగా తన మూడో భార్య రమ్యతో ఉన్న గొడవలను కూడా ఇ:దులో చూపించే ప్రయత్నం చేసాడు. అందుకే రమ్య రఘుపతి కూడా కోర్టుకు ఎక్కారు. ఈ సినిమా తీయడానికి ప్రధాన ఉద్దేశ్యం తనకు, పవిత్రకు మధ్య ఎలాంటి సంబంధం ఉందో ప్రపంచానికి నరేష్ చెప్పాలనుకోవడమే. అలాగే తన జీవితంలో మూడు పెళ్లిళ్లెందుకు చేసుకోవాల్సి వచ్చింది.. ఏ సందర్భంలో అలా చేయాల్సి వచ్చిందనేది కూడా స్క్రీన్ మీద చూపించాడు. ఈ సినిమా ఎవరి బయోపిక్ కాదని.. రమ్యా రఘుపతిపై రివేంజ్ తీర్చుకోవడానికి కాదని చెప్పాడు నరేష్. కానీ సినిమాలో ఈమె పాత్రే మెయిన్ విలన్. బహుశా తనను ఆమె ఎంతగా వేధించిందో నరేంద్ర పాత్రతో నరేష్ చెప్పాలనే ప్రయత్నం చేసి ఉండవచ్చు. అవన్నీ నిజాలే అని నమ్మలేం కూడా. ఎందుకంటే వాళ్లే ఫిక్షన్ అన్నారు కాబట్టి. నరేష్, పవిత్ర బయట ఉన్న రిలేషన్ సినిమా కథకు బాగా హెల్ప్ అయింది. వాళ్లిద్దరి మధ్యలో వచ్చే సన్నివేశాలు న్యాచురల్‌గా అనిపిస్తాయి. అందుకే దర్శకుడు ఎమ్మెస్ రాజు కూడా ఈ ఇద్దరిపైనే ఎక్కువగా ఫోకస్ చేసాడు. ఫస్టాఫ్ అంతా పార్వతితో పరిచయం.. ఆ తర్వాత నరేంద్ర ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఈ నేపథ్యంలోనే నడిపారు. కీలకమైన సెకండాఫ్‌లో అసలు మాజీ భార్య సౌమ్యతో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి.. అలాగే పార్వతి లైఫ్‌లో ఏం జరిగింది అనేది చూపించాడు. సినిమా అయితే ఆసక్తికరంగానే ఉంటుంది కానీ ఈ ఇద్దరి లవ్ స్టోరీ చూడ్డానికి జనం థియేటర్స్‌కు వస్తారా అనేది అనుమానం. అక్కడక్కడా సాగదీసినట్లు ఉండే సన్నివేశాలు బాగా ఇబ్బంది పెడతాయి. నరేష్, పవిత్ర లోకేష్, రమ్య రఘుపతి ట్రయాంగిల్ డ్రామా మీద జనాల్లో విపరీతమైన ఆసక్తికనే క్యాష్ చేసుకున్నాడు దర్శకుడు రాజు.

నటీనటులు:

నరేష్ చాలా రోజుల తర్వాత లెంతీ రోల్ చేసారు. తన కారెక్టరే కావడంతో పక్కాగా న్యాయం కూడా చేసాడు. ఎమోషనల్ డ్రామాలో అన్ని ఎమోషన్స్ పండించాడు నరేష్. అలాగే పవిత్ర లోకేష్ కూడా బాగా చేసారు. ఆమె కారెక్టరైజేషన్ బాగుంది. ఆమెను చాలా మంచిగా చూపించారు సినిమాలో. అలాగే మరో కీలక పాత్ర అయిన సౌమ్య సేతుపతి పాత్రలో వనిత విజయ్ కుమార్ నటించారు. ఆమెను విలన్‌గా చూపించారు. అలాగే పవిత్ర భర్త పాత్రలో నటించిన రవి వర్మను కూడా అలాగే చూపించారు. చిన్న పాత్రలే అయినా జయసుధ, శరత్ బాబు కారెక్టర్స్ బాగున్నాయి.

టెక్నికల్ టీం:

సురేష్ బొబ్బిలి ఆర్ఆర్ బాగుంది. రెండు మూడు పాటలు కూడా బాగానే అలరిస్తాయి. సినిమాటోగ్రఫీ వర్క్ ఓకే. ఎడిటింగ్ వీక్. ఫస్టాఫ్ బాగానే ఉన్నా.. సెకండాఫ్ కొన్ని సీన్స్ ల్యాగ్ అయ్యాయి. దర్శకుడిగా ఎమ్మెస్ రాజు న్యాయం చేసారు కానీ కథకుడిగా ఇంకాస్త స్క్రీన్ ప్లే టైట్‌గా ఉండుంటే బాగుండేది. నరేష్ స్టోరీ తెలియని వాళ్లకు ఈ సినిమా పెద్దగా ఎక్కదు.. కానీ కనెక్ట్ అయిన వాళ్లు మాత్రం సరదాగా నవ్వుకుంటారు. క్లైమాక్స్ కూడా బాగా రాసుకున్నాడు ఎమ్మెస్ రాజు.

పంచ్ లైన్:

మళ్లీ పెళ్లి.. కనెక్ట్ అయితే ఓకే.. లేకపోతే అంతే..