Rangabali Movie Review: ఓవరాల్ గా రంగబలి సినిమా ఎలా ఉందంటే..
ఛలో తర్వాత ఇప్పటివరకు సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు నాగశౌర్య. తాజాగా ఈయన యాక్షన్ కమ్ కామెడీ ఎంటర్టైనర్ రంగబలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి దీంతో ఆయన హిట్టు కొట్టడా లేదా అనేది చూద్దాం..
చిత్రం: రంగబలి
నటీనటులు: నాగశౌర్య,యుక్తి తరేజ,గోపరాజు రమణ, షైన్ టామ్ చాకో, సత్య, శరత్ కుమార్, మురళీ శర్మ, శుభలేఖ
సుధాకర్, అనంత్ శ్రీరామ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, భద్రమ్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు
సంగీతం: పవన్ సిహెచ్
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు
రచన, దర్శకత్వం: పవన్ బాసంశెట్టి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
ఛలో తర్వాత ఇప్పటివరకు సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు నాగశౌర్య. తాజాగా ఈయన యాక్షన్ కమ్ కామెడీ ఎంటర్టైనర్ రంగబలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి దీంతో ఆయన హిట్టు కొట్టడా లేదా అనేది చూద్దాం..
కథ:
రాజవరం అనే ఊరిలో శౌర్య ఉరఫ్ షో (నాగ శౌర్య) ఫాలోయింగ్ కు తిరుగులేదు. సొంతూర్లో సింహంలా బతుకుతుంటాడు ఈయన. వాళ్లకు ఒక మెడికల్ షాప్ ఉంటుంది. అయితే ఊర్లో ఉంటే ఎందుకు పనికి రాకుండా పోతున్నాడని వైజాగ్ వెళ్లి కోర్సు పూర్తి చేసి రమ్మంటాడు శౌర్య వాళ్ళ నాన్న. అక్కడ మెడికల్ కాలేజీకి వెళ్లిన శౌర్య సహజ (యుక్తి)ని చూసి ఇష్టపడతాడు. వాళ్ల పెళ్లికి సహజ తండ్రి (మురళి శర్మ) కూడా ఒప్పుకుంటాడు. కాకపోతే వాళ్ల ఊరిలో ఉన్న రంగబలి సెంటర్ పేరుతో ఆయనకు ప్రాబ్లం ఉంటుంది. దాని పేరు మార్చాలని శౌర్య అనుకుంటాడు. కానీ దానికి ఎమ్మెల్యే పరశురాం (షైన్ చాకో) అడ్డుపడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది.. శౌర్య, సహజ ఎలా కలిశారు.. రంగబలి పేరు మారిందా లేదా అనేది మిగిలిన కథ..
కథనం:
కడుపులు చెక్కలైపోయే కామెడీ.. కరిగిపోయే ఎమోషన్.. ఈ రెండు ఒకే సినిమాలో పర్ఫెక్ట్ గా మిక్స్ అవ్వడం అరుదు. బలవంతంగా కలపాలని చూస్తే రంగబలిలా తయారవుతుంది. ఈ సినిమా బాగోలేదని చెప్పలేము.. అలాగని భలే తీసాడురా అని పొగడలేము. ఫస్టాఫ్ వరకు రేసుగుర్రంలా పరిగెట్టింది సినిమా.. ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా నాన్ స్టాప్ గా నవ్వించాడు దర్శకుడు పవన్ భాసంశెట్టి. ముఖ్యంగా సత్య కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్.. జస్ట్ అలా ఒంటి చేత్తో సినిమాను నడిపించాడు. ఇంటర్వెల్ వరకు సినిమా చూశాక.. బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోతారు. ఛలో తర్వాత ఆ రేంజ్ సినిమా పడింది నాగశౌర్యకు అనుకుంటారు. కానీ అసలు డ్రా బ్యాక్ సెకండ్ హాఫ్ లో మొదలైంది. అప్పటివరకు ఎంటర్టైనింగ్ గా సాగిన కథ ఒక్కసారిగా సీరియస్ టర్న్ తీసుకుంది.. మెయిన్ స్టోరీ వచ్చేసరికి.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రొటీన్ ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్ ను భారీగా దెబ్బ తీసింది. క్లైమాక్స్ 20 నిమిషాలు కామెడీగా ప్రయత్నించాడు కానీ.. అదేదో హడావిడిగా ముగించినట్టే అనిపించింది. ఫస్టాఫ్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్.. సెకండ్ హాఫ్ లో కనీసం సగం ఉన్నా రంగబలి బ్లాక్ బస్టర్ అయ్యేది. కానీ సగం దూరం వచ్చి పెట్రోల్ అయిపోయిన బండిలా ఆగిపోయింది.
నటీనటులు:
నాగ శౌర్య మరోసారి స్క్రీన్ మీద ఫిట్ అయ్యాడు.. మాస్ లుక్స్ కూడా బాగున్నాయి. హీరోయిన్ ఏదో ఉందంటే ఉంది.. పాటల కోసం. విలన్ షైన్ చాకో దసరాలో అదరగొట్టాడు. కానీ ఇందులో అంత పవర్ ఫుల్ క్యారెక్టర్ పడలేదు. సత్య కామెడీ సినిమాకు బలం. ఒకరకంగా ఆయనే హీరో. మిగిలిన వాళ్ళందరూ పాత్రల మేర కనిపించారు.
టెక్నికల్ టీమ్:
పవన్ సిహెచ్ సంగీతం పర్లేదు. నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ వర్క్ పర్లేదు. ఎడిటింగ్ సెకండ్ హాఫ్లో కాస్త ట్రిమ్ చేసి ఉండాల్సిందే. దర్శకుడు పవన్ కథ చెప్పనంతవరకు ఇరగ్గొట్టాడు.. కథ చెప్పడం మొదలుపెట్టాక వెనకబడ్డాడు.. అయినా కూడా కామెడీ కోసం ఓసారి ట్రై చేయొచ్చు ఈ సినిమా.
పంచ్ లైన్:
ఓవరాల్ గా రంగబలి.. ఫస్టాఫ్ భళి.. సెకండాఫ్ బలి..