LGM Movie Review: ఎల్‌జీఎమ్ మూవీ రివ్యూ.. ఎంఎస్ ధోని సతీమణి సాక్షి నిర్మించిన మొదటి సినిమా ఎలా ఉందంటే?
క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేకమైన శకం క్రియేట్ చేసుకున్న ఎమ్మెస్ ధోనీ తాజాగా సినిమా ఇండస్ట్రీలోకి కూడా వచ్చారు. వచ్చీ రావడంతోనే తన మనసుకు బాగా చేరువైన తమిళంలోనే తొలి సినిమా నిర్మించారు ధోనీ. ఈయన నిర్మాత కావడంతో సినిమాపై అంచనాలతో పాటు ఆసక్తి కూడా పెరిగిపోయింది. మరి ఎమ్మెస్ ధోనీ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చిన ఎల్‌జిఎమ్ ఎలా ఉంది..? ఆడియన్స్‌కు నచ్చిందా లేదా అనేది చూద్దాం..
టైటిల్: LGM
నటీనటులు: హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు తదితరులు
సంగీతం: రమేష్ తమిళమణి
సినిమాటోగ్రఫర్: విశ్వజిత్ ఒడుక్కతిల్
ఎడిటింగ్: ప్రదీప్ ఇ రాఘవ్
నిర్మాణ సంస్థ: ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్
నిర్మాతలు: సాక్షి ధోని, వికాస్ హస్జ
దర్శకత్వం: రమేశ్ తమిళ్‌మణి
క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేకమైన శకం క్రియేట్ చేసుకున్న ఎమ్మెస్ ధోనీ తాజాగా సినిమా ఇండస్ట్రీలోకి కూడా వచ్చారు. వచ్చీ రావడంతోనే తన మనసుకు బాగా చేరువైన తమిళంలోనే తొలి సినిమా నిర్మించారు ధోనీ. ఈయన నిర్మాత కావడంతో సినిమాపై అంచనాలతో పాటు ఆసక్తి కూడా పెరిగిపోయింది. మరి ఎమ్మెస్ ధోనీ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చిన ఎల్‌జిఎమ్ ఎలా ఉంది..? ఆడియన్స్‌కు నచ్చిందా లేదా అనేది చూద్దాం..
కథ:
గౌతమ్ (హరీశ్ కల్యాణ్), మీరా (ఇవానా) ఒకే కంపెనీలో పని చేస్తుంటారు. రెండేళ్లు ఓ అగ్రిమెంట్ వేసుకుని మరీ లవ్ చేసుకుంటారు. ఒకర్ని ఒకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అన్నీ సెట్ అనుకున్న సమయంలో ఉన్నట్లుండి మీరా ఓ కండీషన్ పెడుతుంది. గౌతమ్‌ను పెళ్లి చేసుకోవాలంటే.. ముందు వాళ్ళ అమ్మ లీల (నదియా) గురించి తెలుసుకోవాలనుకుంటుంది మీరా. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో గౌతమ్‌ను కంటికి రెప్పలా పెంచుకుంటుంది తల్లి లీల. గౌతమ్‌కి కూడా తల్లి అంటే అంతే ఇష్టం. దాంతో పెళ్లి తర్వాత కూడా తల్లితోనే ఉండాలి అనుకుంటాడు. కానీ మీరా పెట్టిన కండీషన్‌తో గౌతమ్ బుర్ర తిరుగుతుంది. చిన్నప్పటి నుంచి హాస్టల్‌లోనే పెరగడంతో ఇతరులతో కలిసి ఉండడానికి అస్సలు ఇష్టపడని మీరాను అమ్మ కోసం వదిలేస్తాడు గౌతమ్. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్లీ మరో ఐడియాతో వస్తుంది మీరా. అప్పుడేం జరిగింది.. అత్తా కోడళ్లు కలిసిపోయారా అనేది అసలు కథ..
కథనం:
ఈ రోజుల్లో పెళ్లిపై ఎలాంటి అభిప్రాయం ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా నేటి జనరేషన్ అయితే పెళ్లి అంటేనే ఆమడదూరం పారిపోతున్నారు. ఇప్పుడొచ్చే వెబ్ సిరీస్‌లు, సినిమాలు కూడా అలాంటి కంటెంట్‌తోనే వస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లి అంటే భయపడేలాగే ఆ కంటెంట్ అంతా ఉంటుంది. ఇప్పుడు ఎల్‌జిఎమ్ సినిమా కూడా అలాంటి కథతోనే వచ్చింది. ఇందులోనూ పెళ్లిపై కన్ఫ్యూజ్ అయ్యే ఓ అమ్మాయిని చూపించారు దర్శకుడు రమేష్. ఈ కథను కాస్త తిరిగేస్తే బొమ్మరిల్లు గుర్తుకొస్తుంది. ముఖ్యంగా పెళ్లి అంటే అంతా అబ్బాయి, అమ్మాయి గురించి చెప్తుంటారు కానీ అత్తా కోడళ్ల గురించి చెప్పడం మాత్రం తక్కువే. LGM సినిమాలో ఎక్కువగా దీని గురించే చర్చ జరిగింది. అత్తా కోడలి మధ్య సయోధ్య ఉంటే.. అన్నీ బాగుంటాయి అని చూపించే ప్రయత్నమే చేసాడు దర్శకుడు రమేష్ తమిళమణి. అత్తా కోడళ్ల మధ్య గొడవలు.. వారిద్దరి మధ్య హీరో పడే కష్టాలు.. ఈ కాన్సెప్ట్‌తోనే ఎన్నో సినిమాలు వచ్చాయి.. దీన్నే కాస్త కామెడీగా చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. కానీ అందులో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా స్టోరీ బాగానే ఉన్నా.. స్క్రీన్ ప్లే మాత్రం చాలా అంటే చాలా నెమ్మదిగా సాగింది. ఫస్టాఫ్ ఓకే కానీ సెకండాఫ్ మాత్రం కన్ఫ్యూజింగ్‌గా సాగింది. క్లైమాక్స్ కూడా ఏదో హడావిడిగా.. ఎటు వెళ్తుందో తెలినట్లుగా ఉంది. కామెడీకి ఎమోషన్ జోడించినా పూర్తిగా అయితే వర్కవుట్ కాలేదు.
నటీనటులు:
హరీష్ కళ్యాణ్ మరోసారి ఆకట్టుకున్నాడు. జెర్సీలో చిన్న పాత్రలోనే మెప్పించిన ఈ కుర్ర హీరో.. ఇందులో హీరోగా పూర్తి న్యాయం చేసాడు. ఇక లవ్ టుడే ఫేమ్ ఇవానా మరోసారి అదరగొట్టింది. ఈ అమ్మాయి కారెక్టర్ బాగుంది. అలాగే స్క్రీన్ మీద చాలా బాగా కనిపిస్తుంది ఇవానా. ఈ కథకు మరో మెయిన్ పిల్లర్ నదియా రోల్. అమ్మగా ఈమె చాలా బాగా నటించింది. కథ మొత్తం ఇవానా, నదియా పాత్రల చుట్టే తిరుగుతుంది. అత్తాకోడళ్లుగా ఇద్దరి నటన ఆకట్టుకుంటుంది. నేటితరం అమ్మాయి మీరాగా ఇవానా, గడుసరి అత్తగా నదియా బాగున్నారు. యోగిబాబు కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్. హీరో స్నేహితుడిగా చేసిన నటుడి కామెడీ కూడా బాగానే ఉంది. మిగిలిన వాళ్లు ఓకే..
టెక్నికల్ టీం:
టెక్నికల్ టీంలో చాలా వరకు దర్శకుడే అన్ని పార్ట్స్ తీసుకున్నాడు. సంగీతం కూడా ఆయనే అందించాడు. ఆర్ఆర్ బాగున్నా.. పాటలు అయితే ఆకట్టుకోవు. ఎడిటింగ్ బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ వర్క్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ట్రావెల్ మూవీ కాబట్టి అన్ని ప్లేసెస్ బాగానే ఎక్స్‌ప్లోర్ చేసారు. దర్శకుడిగా కంటే రచయితగా తమిళమణి ఆకట్టుకున్నాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు దగ్గర ధోనీ ఎంటర్‌టైన్మెంట్స్ అయితే వెనకాడలేదు.
పంచ్ లైన్:
LGM.. లెట్స్ గెట్ మ్యారీడ్ విత్ స్మాల్ కన్ఫ్యూజన్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.