K. Viswanath no More: ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్న కళాతపస్వి కె. విశ్వనాథ్

సీనియర్‌ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూశారు. ఏన్నో అపురూప చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు..5 దశాబ్దాలకుపైగా తెలుగు చిత్రసీమపై తనదైన ముద్రవేసిన విశ్వనాథ్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Feb 03, 2023 | 7:16 AM

ప్రశస్తమైన సినిమాలను సృష్టించి తెలుగు సినిమాకు గౌవరవాన్ని, గుర్తింపును తెచ్చిన కళాదర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా స్థాయిని రెపరెప లాడించిన కె.విశ్వనాథ్.. తీసిన 60 చిత్రాల్లో ఎన్నో గొప్పఅవార్డులను, రివార్డ్‌లను స్వంతం చేసుకున్నారు.

తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో రెపరెప లాడించిన దిగ్గదర్శకుడు కళా తపస్వి కె. విశ్వనాథ్.. తెలుగు సినిమాకు సిరివెన్నెలలు కురిపించిన ఆపద్భాందవుడు. ఎన్నో చిత్రాల్లో భావుకత, ఆర్ధ్రత, కుటుంబ, సామాజిక అంశాలు సృజించడంలో విశ్వనాథ్ శైలే వేరు. కళాతపస్వి కె.విశ్వనాథ్ పేరు చెబితే ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘సిరిసిరిమువ్వ’ సినిమాలు గుర్తుకువస్తాయి. తెలుగు సినిమాల్లో సంగీతానికి పెద్ద పీటవేసి, శృతిలయలు నేర్పిన దర్శక యశస్వీ, కళా తపస్వి.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మశ్రీ కె.విశ్వనాథ్. విశ్వనాథ్ తన చిత్రానికి దర్శకత్వం వహించేటపుడు ఖాకీ దుస్తుల్లో ఉండటం ఆయన ప్రత్యేకత.

పాశ్చాత్య సంగీతహోరులో కొట్టుకుపోతున్న సంగీతాభిమానులకు.. సంప్రదాయ సంగీతంలో ఉన్న మాధుర్యం ఎంత గొప్పగా వుంటుందో గుర్తుచేసిన చిత్రం శంకరాభరణం. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు శాస్త్రీయసంగీతం నేర్పించడానికి ఉత్సాహం చూపించారంటే అది శంకరాభరణం సినిమా తర్వాతే జరిగింది. ప్రధాన పాత్రధారి జె.వి.సోమయాజులుకు ‘శంకరాభరణం శంకరశాస్త్రి’ గా పేరు స్థిరపడేటట్టు చేసిందీ శంకరాభరణం చిత్రం. ఈ చిత్ర విజయానికి మహాదేవన్ సంగీతం, వేటూరి సాహిత్యం, బాలు గాత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా, గాయకుడిగా అవార్డులు లభించాయి. 1980లో జాతీయ ఉత్తమ కుటుంబకథా చిత్రంగా శంకరాభరణం పురుస్కారం అందుకుంది.

ఇవి కూడా చదవండి

కమల్ హాసన్ తో కె.విశ్వనాథ్ తీసినా స్వాతిముత్యం.. ఆస్కార్ బరిలో భారత అధికారిక ఎంట్రీగా ఎన్నికైన ఏకైక తెలుగు చిత్రం. 1986లో జాతీయ ఉత్తమ చలనచిత్రం తెలుగులో స్వాతిముత్యం అవార్డు పొందింది.1982-నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా ఉత్తమచిత్రంగా సప్తపది, 1984- జాతీయ ఉత్తమ చలనచిత్రంగా తెలుగు సాగరసంగమం అవార్డులు సొంతం చేసుకున్నాయి. ‘స్వయంకృషి’, ‘స్వర్ణ కమలం’ ‘ఆపద్భాందవుడు’ ‘స్వాతి కిరణం’, ‘శుభప్రదం’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించి ప్రేక్షకుల మెప్పును పొందారు. అలాగే 1988 లో జాతీయ ఉత్తమ చలనచిత్రంగా తెలుగులో శృతిలయలు, 2004 లో జాతీయ ఉత్తమ చలనచిత్రం- తెలుగు స్వరాభిషేకం సినిమాలకు పురష్కారాలు లభించాయి. ‘సిరి వెన్నెల’ చిత్రంలో గుడ్డివాడిగా సర్వదమన్ బెనర్జీ , మూగ అమ్మాయిగా సుహాసిని నటన మనం ఇప్పటికీ మరచిపోలేయా చిత్రికరించారు విశ్వనాథ్. ఈ సినిమాతో పాటల రచయత సీతారామశాస్త్రి ఇంటి పేరు ‘సిరివెన్నెల‘ గా మారిపోయింది. అనేక సామాజిక కథాంశాలతో వరకట్న సమస్యపై ‘శుభలేఖ’, కులవ్యవస్థపై ‘సప్తపది’, గంగిరెద్దు వాళ్ల జీవితం ఆధారంగా ‘సూత్రధారులు’, బద్దకస్తుడి కథ ఆధారంగా ‘శుభోదయం’ చిత్రాలు ఆయనలోని సంఘ సంస్కర్తను మేలుకొలిపాయి.

విశ్వనాథ్ కు చలన చిత్రరంగానికి చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించగా.. కేంద్రం ఆయన్ని 2016లో దేశంలో సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1992 లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును బహుకరించింది. దీంతో పాటు పలు నంది అవార్డులు, జాతీయ అవార్డులు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి.

ఆయన జీవితంపై ప్రముఖ దర్శకుడు జనార్దన మహర్షి..‘విశ్వదర్శనం’సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆయన తీసిని సినిమాలు ఇప్పటి దర్శకులకు ఒక ఆదర్శంగా నిలిచాయి. తెలుగు సినిమా ఉన్నంత కాలం కే. విశ్వనాథ్ సినిమాలు నిలిచే వుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..