Bhola Shankar: భోళా శంకర్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఫ్యామిలీ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన భోళా శంకర్ ఆడియన్స్‌ను మెప్పించిందా..? వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి మెగాస్టార్ మెప్పించాడా.. అసలెలా ఉంది సినిమా..? పూర్తి రివ్యూలో చూద్దాం..

Bhola Shankar:  భోళా శంకర్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..
Bhola Shankar
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Aug 11, 2023 | 2:10 PM

మూవీ రివ్యూ: భోళా శంకర్

నటీనటులు: చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా, సుశాంత్, కిల్లా జర్జ్, తరుణ్ అరోరా, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, ఉత్తేజ్ తదితరులు

సంగీతం: మహతి స్వర సాగర్

సినిమాటోగ్రఫీ: డడ్లీ

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

మాటలు, కథనం, దర్శకుడు : మెహర్ రమేష్

నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర, అజయ్ సుంకర

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఫ్యామిలీ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన భోళా శంకర్ ఆడియన్స్‌ను మెప్పించిందా..? వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి మెగాస్టార్ మెప్పించాడా.. అసలెలా ఉంది సినిమా..? పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ: శంకర్ (చిరంజీవి) తన చెల్లి మహాలక్ష్మి (కీర్తి సురేష్)తో కలిసి కలకత్తాకు వస్తాడు. అక్కడే ఉండి టాక్సీ డ్రైవర్‌గా జాబ్ చేస్తుంటాడు. అదే సమయంలో సిటీలో ఓ మాఫియా గ్యాంగ్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంటారు.. అమ్మాయిలతో వ్యాపారం చేస్తుంటారు. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్‌లో ఒకర్ని శంకర్ గుర్తు పడతాడు.. పోలీసులకు చెప్తాడు. అదే సమయంలో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వాళ్లందర్నీ చంపేస్తుంటాడు శంకర్. అసలు టాక్సీ డ్రైవర్‌గా ఉండే శంకర్‌కు ఆ మాఫియాతో గొడవేంటి.. వాళ్లనెందుకు టార్గెట్ చేసాడు..? మధ్యలో లాస్య (తమన్నా) ఎందుకొచ్చింది..? అనేది మిగిలిన కథ..

కథనం: కమర్షియల్ సినిమాకు కావాల్సిన మసాలాలన్నీ బాగానే కలిపినా.. మెయిన్‌గా కింద మంట పెట్టడం మరిచిపోయారు మెహర్ రమేష్. అందుకే ఉడకడం పక్కనపెట్టి పిచ్చిపిచ్చిగా సారీ.. పచ్చిపచ్చిగా అలాగే మిగిలిపోయింది భోళా శంకర్. చిరంజీవి వీరాభిమానులకు కూడా నీరసం తెప్పించేలా ఉంది భోళా శంకర్. ఆయనను స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయడం అనే ఒక్కటి తప్పిస్తే మరో కొత్తదనం లేకుండా ఈ సినిమాను తీసాడు దర్శకుడు మెహర్. వాల్తేరు వీరయ్యలోనూ చిరంజీవి కామెడీ చేశాడు.. డాన్సులు చేశాడు.. అది కూడా రొటీన్ కథ అయినా.. ఒక ఎమోషన్, ఒరిజినాలిటీ ఉంటుంది.. అదే భోళా శంకర్ సినిమాలో మిస్సయింది. చిరంజీవి రేంజ్ కు జబర్దస్త్ గ్యాంగ్ తో వచ్చే కామెడీ సీన్స్ అస్సలు వర్కౌట్ కాలేదు. సెకండాఫ్ శంకర్ దాదాను ఇమిటేట్ చేయాలనుకున్నా.. ఆ టైమింగ్ రమ్మన్నా మళ్ళీ రాదు. ఫస్టాఫ్ అయితే చాలా సన్నివేశాలు కేవలం ఫిల్లింగ్ కోసం తీసినట్టు అనిపించింది. యాక్షన్ ఎపిసోడ్స్ వరకు చిరంజీవి తన వింటేజ్ స్టైల్ చూపించాడు. చిరంజీవి సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్.. ఆ ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఈ సినిమాకు అతిపెద్ద మైనస్. వేదాళం అంత పెద్ద విజయం సాధించిందంటే దానికి కారణం యాక్షన్ పార్ట్.. ముఖ్యంగా క్రూజ్ సీన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటాయి. కానీ భోళా శంకర్‌లో అందులో ఏ ఒక్క సీన్ కూడా వర్కవుట్ అవ్వలేదు. అలాగే పవన్ కళ్యాణ్ ఇమిటేషన్ కూడా ఎందుకో అన్నయ్య చేస్తే చూడ బుద్ధి కాలేదు.. అసలు ఆ సీన్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త బెటర్. అక్కడక్కడ సెంటిమెంట్ సీన్స్ బాగున్నాయి. కామెడీ వేనుమా కామెడీ ఇరుక్కు.. యాక్షన్ వేనుమా యాక్షన్ ఇరుక్కు.. డాన్స్ వేనుమా డాన్స్ ఇరుక్కు.. సెంటిమెంటు వేనుమా సెంటిమెంటు ఇరుక్కు.. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అన్ని ఇరికించినట్లే ఉన్నాయి.

నటీనటులు: చిరంజీవి బాగా నటించాడు.. ఆయన బాగా చేసాడు అని చెప్పడం ఓవర్‌గానే ఉంటుంది. ఎందుకంటే 40 ఏళ్ళుగా ఆయన నటన చూస్తూనే ఉన్నాం కాబట్టి ఆయన బాగానే చేస్తాడు. తన వరకు శక్తి వంచన లేకుండా కాపాడే ప్రయత్నం చేశాడు.. కానీ ఆయన ఒక్కడే నిలబడితే సరిపోదు కదా. కీర్తి సురేష్ తన పాత్ర వరకు న్యాయం చేసింది.. సుశాంత్ ఓకే. తమన్నా ఎందుకు ఉందో తెలియదు మరి. కేవలం పాటల కోసమే తీసుకున్నట్లు అనిపిస్తుంది. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం: భోళా శంకర్ కు మరో మేజర్ మైనస్ మ్యూజిక్. మహతి స్వరసాగర్ అందించిన మ్యూజిక్ ఎక్కడా ఆకట్టుకోలేదు. పాటలు కూడా అస్సలు బాగోలేవు. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా లౌడ్‌గా అనిపించింది. సినిమాటోగ్రీఫీ పర్లేదు. ఎడిటింగ్ దర్శకుడు మెహర్ రమేష్ ఛాయిస్ కాబట్టి ఏం అనలేం. ఇక దర్శకుడు మెహర్ రమేష్ గురించి ఏం చెప్పాలి..? ఉన్నదున్నట్లు తీసినా వర్కవుట్ అయ్యే సినిమాను.. అనవసరంగా లేని పోని కామెడీ సీన్స్, యాక్షన్ అంటూ కలగాపులగం చేసారు. దాంతో ఎటూ కాకుండా పోయాడు భోళా శంకర్.

పంచ్ లైన్: ఓవరాల్‌గా భోళా శంకర్.. ఏమంత బాలా శంకర్..