ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ నేతల షాకింగ్ కామెంట్స్… చంద్రబాబు డబ్బులు ఇచ్చారని ఆరోపణ
ఏపీలో ఓటుకు కోట్ల వ్యవహారం పొలిటికల్ దుమారం రేపుతోంది. ఎమ్మెల్యేలు రాపాక, మద్దాలగిరి ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఓటుకు కోట్లు 2.0 సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ చంద్రబాబేనని ఆరోపించారు
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఏపీలో పెను దుమారమే రేపుతోంది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధాను గెలిపించుకున్న ఆ పార్టీపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఓటుకు కోట్లు కుమ్మరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంఖ్యా బలం లేకుండానే టీడీపీ తన అభ్యర్థిని బరిలోకి దించి, తెలంగాణ ఎమ్మెల్సీ తరహాలోనే కోట్లు ఎరవేసి చంద్రబాబు వ్యూహం రచన చేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జలతోపాటు అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు. ఒక్కో ఎమ్మెల్యేకు పది నుంచి 20 కోట్ల వరకూ వెదజల్లి టీడీపీ అభ్యర్థిని గెలిపించుకున్నారని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి.
రాపాక వరప్రసాదే కాదు…గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలిగిరి కూడా సీన్‌లోకి ఎంటరయ్యారు. టీడీపీ నేతల నుంచి తనకు కూడా కాల్స్ వచ్చాయని, అయితే అమ్ముడుపోవడం ఇష్టంలేక ఫోన్ కూడా ఎత్తలేదని మద్దాలి గిరి తెలిపారు. అంతేకాదు టీడీపీ నాయకుల నుంచి తనకు కాల్స్ వచ్చాయని ఆధారాలు కూడా చూపించారు.
స్వప్రయోజనం కోసం దిగజారి రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబునాయుడని విమర్శించారు దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి. ఓటుకు కోట్లు 2.0 పేరుతో ఓ సినిమా తీయోచ్చన్నారు. చంద్రబాబునాయుడు స్క్రిప్టు అండ్ డైరెక్షన్‌లోనే ఇదంతా జరిగిందన్నారు. ఎమ్మెల్యేలను కొనడం అమ్మడం చంద్రబాబుకు అలవాటేనని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని విమర్శించారు. తెలంగాణలో అడ్డంగా బుక్కైన చంద్రబాబు అర్థరాత్రి పెట్టా బేడా సర్దుకుని వచ్చారని ఆరోపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..