Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన.. ఎన్ని మీటర్ల ఎత్తంటే?
Andhra Pradesh: పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ సమాధానం ఇస్తూ పోలవరం ఎత్తు 45.72 మీటర్లు అని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ జీవనాడి, కీలక ప్రాజెక్ట్ పోలవరం ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రాజెక్ట్ ఎత్తు 45.72 మీటర్లని స్పష్టం చేసింది. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ సమాధానం ఇచ్చారు. 1980 గోదావరి ట్రిబ్యునల్ అవార్డ్ ప్రకారం పోలవరం రిజర్వాయర్ సామర్థ్యం 45.72 మీటర్లు అని వెల్లడించారు. తొలి దశలో పోలవరం ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితమని గతవారం పోలవరంపై కేంద్రం స్పష్టం చేసింది.
తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు పేర్కొంది. 2017-18 ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 47,725 కోట్లు అని స్పష్టం చేశారు. 2019లో జలశక్తి శాఖకు ఇచ్చిన సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 55,548.87 కోట్లు కాగా ఈ అంచనాలను జలశక్తి శాఖ అడ్వైజరీ కమిటీ అంగీకరించింది.
2020లో రివైజ్డ్ కాస్ట్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. అయితే 2013 -14 ధరల ప్రకారం అంచనా వ్యయం రూ. 29,027.95 కోట్లు అని కేంద్రమంత్రి తెలిపారు. ప్రాజెక్టు కోసం భూ సేకరణ, పరిహారం, పునరావాసం ధరలలో పెరుగుదలే ప్రాజెక్టు వ్యయం పెరగడానికి కారణం అని కేంద్రం పేర్కొంది.
అయితే పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.13,463 కోట్లు విడుదల చేసినట్లు సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు మొత్తం 1,13,119 ఎకరాల భూమిని సేకరించారు. పోలవరం నిర్మాణంలో భూసేకరణ వ్యయం ఎక్కువగా వున్నందున రెండు దశల్లో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రెండు దశల్లో కలిపి మొత్తం 45.72 మీటర్ల ఎత్తు పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..