Andhra Pradesh: పాదయాత్రలో కనిపించని కేశినేని నాని, శ్వేత.. పార్టీ దూరం పెట్టిందా? ఆయనే పక్కకు జరిగారా?

లోకేష్‌ పాదయాత్రలో ఎంపీ కేశినేని నాని, ఆయన కుమార్తె శ్వేత కనిపించడం లేదు. నానియే పార్టీకి దూరంగా ఉన్నారా..పార్టీయే ఆయన్ను దూరం పెట్టిందా.. అన్నది పరిస్థితులే తేల్చాలి.. ఎందుకంటే.. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నానికి కాకుండా పాదయాత్ర విజయవంతం చేసే బాధ్యతలను కేశినేని చిన్నికి అప్పగించారు. అధిష్టానమే స్వయంగా చిన్నికి బాధ్యతలు అప్పగించడం పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అది కాస్త రచ్చగా మారి.. పరస్పర విమర్శలకు దారితీసింది. దీంతో.. నానిని సైడ్‌ చేస్తున్నారా అంటూ తెలుగుదేశం క్యాడర్ లో...

Andhra Pradesh: పాదయాత్రలో కనిపించని కేశినేని నాని, శ్వేత.. పార్టీ దూరం పెట్టిందా? ఆయనే పక్కకు జరిగారా?
Kesineni Nani And Swetha
Follow us

|

Updated on: Aug 20, 2023 | 9:02 AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర.. బెజవాడలో రాజకీయ సెగ పుట్టిస్తోంది. 2500 కిలోమీటర్ల మైలు రాయిని దాటిన లోకేష్‌ పాదయాత్ర.. కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది .ప్రకాశం బ్యారేజీ మీదుగా బెజవాడలో లోకేష్‌ అడుగు పెట్టారు. గుంటూరు జిల్లా నేతలు వీడ్కోలు పలకగా.. కృష్ణా జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో భారీ ఏర్పాట్లు చేశారు. మరి భగభగమంటున్న బెజవాడ రాజకీయం నడుమ లోకేష్‌ పాదయాత్ర ఎలా ఉండబోతోంది..

నారా లోకేశ్‌ బెజవాడలో అడుగుపెట్టకముందే రాజకీయ ప్రకంపనలు రేగాయి. సీఎం జగన్ ఉండే తాడేపల్లిలో యువగళం పాదయాత్ర 2500 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడంతో అక్కడే శిలాఫలకం ఆవిష్కరించారు. టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. పాదయాత్రలో లోకేష్‌ను అడుగడుగునా గజమాలలతో స్వాగతించారు.

కృష్ణా జిల్లాలో ఆరు రోజులు సాగనున్న లోకేష్‌ పాదయాత్ర..

ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్ పాదయాత్ర దాదాపుగా ఆరు రోజుల పాటు జరుగుతుంది. ఈ జిల్లాలో 6 నియోజకవర్గాలను కవర్ చేయనున్న లోకేశ్.. విజయవాడ సిటీలో సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారు. బట్‌..అంతా సాఫీగా సాగితే అందులో మజా ఏముంటుంది. అందుకే, యువగళానికి వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందంటూ మండిపడింది టీడీపీ. లోకేశ్ పాదయాత్రలో అలజడికి వైసీపీ ప్లాన్ చేసిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. దేవినేని అవినాశ్ కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించడం వెనుక కుట్ర ఉందని, గన్నవరం సభలో అల్లర్లు సృష్టించడానికే అవినాష్ ఇంటికి సీఎం వెళ్లారని అన్నారు.

ఇవి కూడా చదవండి

పాదయాత్రలో కనిపించని కేశినేని నాని, శ్వేత..

లోకేష్‌ పాదయాత్రలో ఎంపీ కేశినేని నాని, ఆయన కుమార్తె శ్వేత కనిపించడం లేదు. నానియే పార్టీకి దూరంగా ఉన్నారా..పార్టీయే ఆయన్ను దూరం పెట్టిందా.. అన్నది పరిస్థితులే తేల్చాలి.. ఎందుకంటే.. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నానికి కాకుండా పాదయాత్ర విజయవంతం చేసే బాధ్యతలను కేశినేని చిన్నికి అప్పగించారు. అధిష్టానమే స్వయంగా చిన్నికి బాధ్యతలు అప్పగించడం పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అది కాస్త రచ్చగా మారి.. పరస్పర విమర్శలకు దారితీసింది. దీంతో.. నానిని సైడ్‌ చేస్తున్నారా అంటూ తెలుగుదేశం క్యాడర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

వైసీపీ ఎమ్మెల్యేలను పొగడ్తలతో ముంచెత్తిన నాని..

కొంతకాలంగా..ఎంపీ కేశినేని నాని పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న నాని.. డైరెక్ట్ గా పార్టీ అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో లోకేష్‌ పాదయాత్రలో కేశినేని నాని పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న నాని.. వైసీపీ ఎమ్మెల్యేలను పొగడ్తలతో ముంచెత్తారు. సొంత పార్టీ ఇన్‌ఛార్జ్‌లను గొట్టంగాళ్లంటూ కామెంట్‌ చేశారు. ఇండిపెండెంట్‌గాను గెలిచే సత్తా ఉందని కూడా ఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు. చివరకు మహానాడుకు కూడా తనను ఆహ్వానించలేదంటూ ఫైర్ అయ్యారు.

నాని టీడీపీలో ఉన్నట్టా..లేనట్టా..?

కేశినేని నానిపై టీడీపీ అధిష్టానం కూడా కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం వారిపై పొగడ్తలు కురిపించడం పార్టీ నాయకత్వానికి కోపం తెప్పించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం తర్వాత పార్టీ కార్యక్రమాలకు నాని దూరంగా ఉన్నారు. నాని పార్టీలో ఉన్నట్టా? లేనట్టా అన్న చర్చ కూడా సాగింది. సరిగ్గా ఇదే సమయంలో మరోసారి లోకేష్‌ పాదయాత్ర బాధ్యతలు కూడా ఆయనకు ఇవ్వకుండా, సోదరుడు చిన్నికి అప్పగించడంతో అధిష్టానమే ఆయన్ను పక్కన పెడుతున్నట్లుందని పార్టీలో చర్చ మొదలైంది. అయితే.. నాని దీనిపై ఇంకా స్పందించలేదు..

ఏం జరిగినా చూసుకుందామంటున్న చిన్ని..

మరోవైపు, యువగళం పాదయాత్ర సక్సెస్‌ చేయడానికి కేశినేని చిన్ని రంగంలోకి దిగారు. తూర్పు నియోజకవర్గంలో లోకేశ్‌ సభకు స్థలాలు గానీ, ఫంక్షన్ హాల్స్ గానీ ఇవ్వకుండా వైసీపీ బెదిరిస్తోందనేది టీడీపీ ఆరోపణ. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా సరే.. తూర్పు నియోజకవర్గంలో లోకేశ్ బహిరంగసభ జరిగి తీరుతుందని తేల్చిచెప్పారు కేశినేని చిన్ని. ఏం జరిగినా సరే చూసుకుందాం అని చిన్ని హామీ ఇవ్వడంతో బెజవాడ తూర్పు నియోజకవర్గంలోని టీడీపీ నేతలు కూడా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అయితే, నారా లోకేశ్ పాదయాత్రలో ఎంపీ కేశినేని నాని హడావుడి మాత్రం ఎక్కడా కనిపించడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ పాదయాత్రలో పాల్గొనకపోయినా, చివర్లో నామ్‌ కే వాస్తే కనిపించినా… అది పార్టీపై అసంతృప్తిగానే చూడాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి లోకేశ్ పాదయాత్రతో అధికార ప్రతిపక్షాల మధ్య.. ఆరు రోజుల పాటు బెజవాడలో రాజకీయం హాట్‌హాట్‌గానే సాగనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..