Telangana: అయ్యో పాపం.. పురిటి నొప్పులతో నట్టడివిలో నడిరోడ్డుపై గిరిజన మహిళ ప్రసవం
Nirmal News: ప్రపంచం విప్లవాత్మకంగా దూసుకుపోతుంటే.. చందమామపై అడుగు పెట్టి దేశం మురిసిపోతుంటే అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ మాత్రం ఇంకా అవే కష్టాలతో.. తీరని కన్నీళ్లతో సాగిపోతోంది. విశ్వానికి నిచ్చనలేస్తున్న ఈ కాలంలో ఈ జిల్లాలో మాత్రం ఇంకా వైద్యం కోసం వాగులు దాటక తప్పడం లేదు. ఆస్పత్రి చేరే దారి లేక అంబులెన్స్ వచ్చే మార్గం కనిపించక పురిటి నొప్పులతో ఆదివాసీ అడవి తల్లులకు ఇప్పటికింకా అరిగోస పడక తప్పడం లేదు.
నిర్మల్ న్యూస్, ఆగస్టు 25: ప్రపంచం విప్లవాత్మకంగా దూసుకుపోతుంటే.. చందమామపై అడుగు పెట్టి దేశం మురిసిపోతుంటే అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ మాత్రం ఇంకా అవే కష్టాలతో.. తీరని కన్నీళ్లతో సాగిపోతోంది. విశ్వానికి నిచ్చనలేస్తున్న ఈ కాలంలో ఈ జిల్లాలో మాత్రం ఇంకా వైద్యం కోసం వాగులు దాటక తప్పడం లేదు. ఆస్పత్రి చేరే దారి లేక అంబులెన్స్ వచ్చే మార్గం కనిపించక పురిటి నొప్పులతో ఆదివాసీ అడవి తల్లులకు ఇప్పటికింకా అరిగోస పడక తప్పడం లేదు. అలాంటి దారుణ ఘటనే నిర్మల్ జిల్లా పెంబి అటవిప్రాంతంలోని కడెం వాగు సమీపంలోని మారుమూల గిరిజన గ్రామం తులసీపేటలో చోటు చేసుకుంది. పురిటినొప్పులతో తీవ్ర నరకం అనుభవించిన ఓ ఆదివాసీ గర్బిని నట్టడివిలో నడిరోడ్డుపై మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లిబిడ్డా ఇద్దరు క్షేమంగానే ఉన్నా.. పురిటి నొప్పులతో నాలుగు గంటలు వాగు ఒడ్డునే నరకం చూసింది.
నిర్మల్ జిల్లా పెంబి మండలం ఆదివాసీ గూడెం తులసీపేటకు చెందిన గంగామణి అనే ఆదివాసీ మహిళకు గురువారం రాత్రి పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. పక్కనే 15 కి.మీ దూరంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు కుటుంబ సభ్యులు. అయితే గత ఏడాది కురిసిన వర్షాలకు గ్రామ సమీపంలోని పస్పుల వంతెన కడెం వాగు ప్రవాహంలో కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఈ గ్రామంతో పాటు మరో 10 ఆదివాసీ మారుమూల గ్రామాల ప్రజలు వాగులోనే అత్యంత ప్రమాదకరంగా ప్రయాణిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే గురువారం రాత్రి 10 గంటలకు పెంబి మండలంలోని తులసీపేట్ గ్రామానికి చెందిన నిండు గర్భిణి గంగామణికి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు పోన్ చేశారు. రోడ్డుసరిగా లేదని అక్కడి వరకు రాలేమని పస్పుల వంతెన దాటి తీసుకువస్తే ఆస్పత్రికి తరలిస్తామని తెలిపారు. సరేనన్న గర్భిణి కుటుంబ సభ్యులు ఎడ్లబండిలో అతి కష్టం మీద ఆమెను కడెం వాగు దాటించారు. అయితే ఒడ్డుచేరాక కూడా అంబులెన్స్ రాకపోవడం.. కారణం అడిగితే అంబులెన్స్ లో డిజిల్ అయిపోయిందంటూ సమాధానం ఇవ్వడంతో చేసేది లేక అదే ఎండ్ల బండిలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
అయితే అప్పటికే నొప్పులు తీవ్రమై అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో నడిరోడ్డుపై మగబిడ్డకు జన్మనిచ్చింది గంగామణి. ప్రసవం జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది.. హుటాహుటిన ప్రథమ చికిత్స అందించి పెంబి ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. డీజిల్ లేకా అంబులెన్స్ రావడం ఆలస్యమవడంతో పసుపుల వాగు ఒడ్డునే నడిరోడ్డుపై నాలుగు గంటల పాటు రోడ్డుపైనే నరకయాతన అనుభవించింది మహిళ. ప్రపంచమంతా అభివృద్ది పేరిట కుగ్రామం మారుతుంటే.. కుగ్రామాలైన ఆదివాసీ పల్లెలు మాత్రం ఇదిగో ఇలా నడిరోడ్డు పై ప్రసవాలతో గిరిజన ఆడబిడ్డల ప్రాణాలకు భరోసా కల్పించలేక.. పుట్టెడు పురిటి కష్టాలను బహుమతిగా ఇస్తోంది. ఇంకెప్పుడు మారుతుందో ఈ గూడాల బతుకులు.. ఎప్పుడు ఆగుతాయో నడిరోడ్డుపై ప్రసవాలు. వాగు దాటి ప్రాణం నిలుపుకునే అందే ద్రాక్షగా మారే వైద్యం ఆదివాసీలకు ఇంకెత దూరమో పాలకులే చెప్పాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..