Mera Bill Mera Adhikar: కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.. షాపింగ్ బిల్ అప్‌లోడ్ చేస్తే రూ.1 కోటి..! పూర్తి వివరాలివే..

Mera Bill Mera Adhikar: కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు మీరు ఎక్కడ షాపింగ్ చేసినా ఫరవాలేదు,  ఏ వస్తువు కొన్నా ఫరవాలేదు, కాకపోతే బిల్లు తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ బిల్లును అప్‌లోడ్ చేస్తే చాలు.. లక్కీ డ్రాలో మీరు బహుమతి గెలుచుకోవచ్చు. అది ఒకరికో, ఇద్దరికో పరిమితం చేసే బహుమతి కాదు. వందల మంది ఈ బహుమతులు గెలుచుకోవచ్చు. పది మంది తలో రూ. 10 లక్షలు గెలుచుకోవచ్చు. ఇద్దరు అదృష్టవంతులు చెరో రూ. 1 కోటి గెలుచుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన..

Mera Bill Mera Adhikar: కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.. షాపింగ్ బిల్ అప్‌లోడ్ చేస్తే రూ.1 కోటి..! పూర్తి వివరాలివే..
Mera Bill Mera Adhikar
Follow us

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Aug 25, 2023 | 7:01 AM

Mera Bill Mera Adhikar: ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. లక్కీ డ్రాలో కారు బహుమతి గెలుచుకోండి.. రూ. 5,000 షాపింగ్‌పై రూ. 1,000 విలువైన కూపన్లు.. ఇలాంటి ఆఫర్లు షాపింగ్ మాల్స్‌లో సర్వ సాధారణం. ఈ ఆఫర్ అందుకోవాలంటే వాళ్లు చెప్పిన చోట షాపింగ్ చేయాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వమే ప్రజలందరికీ బంపర్ ఆఫర్ ప్రకటించింది.ఈ మేరకు మీరు ఎక్కడ షాపింగ్ చేసినా ఫరవాలేదు,  ఏ వస్తువు కొన్నా ఫరవాలేదు, కాకపోతే బిల్లు తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ బిల్లును అప్‌లోడ్ చేస్తే చాలు.. లక్కీ డ్రాలో మీరు బహుమతి గెలుచుకోవచ్చు. అది ఒకరికో, ఇద్దరికో పరిమితం చేసే బహుమతి కాదు. వందల మంది ఈ బహుమతులు గెలుచుకోవచ్చు. పది మంది తలో రూ. 10 లక్షలు గెలుచుకోవచ్చు. ఇద్దరు అదృష్టవంతులు చెరో రూ. 1 కోటి గెలుచుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని రాష్ట్రాల్లో ఏడాది కాలం వర్తించేలా అమలు చేస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ పథకానికి ‘మేరా బిల్.. మేరా అధికార్’ అంటూ కేంద్ర ప్రభుత్వం నామకరణం చేసింది. వినియోగదారులు తాము కొనే ప్రతి వస్తువుకు బిల్లు తీసుకునే సంస్కృతిని ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.

ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద అస్సాం, గుజరాత్, హర్యానా రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్ఛేరి, దాద్రా నగర్ హవేలి, డమన్ & డయ్యులో సెప్టెంబర్ 1 నుంచి ఏడాది పాటు అమలు చేయనుంది. ఈ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జీఎస్టీ రిజిస్టర్డ్ సరఫరాదారులు, వ్యాపారులు ఇచ్చే బిల్లులు, వాటిని తీసుకునే కస్టమర్లు అర్హులు. అయితే బిల్లు కనీస విలువ రూ. 200 వరకు ఉండాలి. అంతకంటే తక్కువ విలువ కల్గిన బిల్లులకు స్కీమ్‌లో అర్హత లేదు. కేంద్ర ప్రభుత్వం ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ (యాపిల్)లో అందుబాటులో ఉంచిన “మేరా బిల్.. మేరా అధికార్” యాప్‌లో లేదంటే web.merabill.gst.gov.in సైట్‌లో వినియోగదారులు తమ బిల్లులను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పథకం అమలయ్యేది కొన్ని రాష్ట్రాల్లోనే అయినప్పటికీ.. దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన వినియోగదారుడైనా ఈ రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన బిల్లులను అప్‌లోడ్ చేసి బహుమతులు గెలుచుకోవచ్చు. ఒక వ్యక్తి గరిష్టంగా 25 బిల్లులను అప్‌లోడ్ చేయవచ్చు. వాటిని లక్కీ డ్రా కోసం పరిగణలోకి తీసుకుంటారు. అప్‌లోడ్ చేసే ప్రతి బిల్లుకు ఒక Acknowledgement Reference Number (ARN) ను కంప్యూటర్ జెనరేట్ చేసి వినియోగదారుడికి అందజేస్తుంది. దాని ఆధారంగానే కంప్యూటరైజ్డ్ లక్కీ డ్రా తీయడం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ లక్కీ డ్రా ఒక్కసారికే పరిమితం కాదు. ప్రతి నెలా లక్కీ డ్రా ఉంటుంది. నెలవారీ డ్రాలో 10 మంది విజేతలకు తలా రూ. 10 లక్షలు బహుమతిగా అందజేస్తారు. 800 మంది విజేతలకు రూ. 10 వేలు ఇస్తారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి బంపర్ డ్రా ఉంటుంది. అందులో ఇద్దరు విజేతలను ఎంపిక చేసి వారికి తలా రూ. 1 కోటి అందజేస్తారు. విజేతల మొబైల్ నెంబర్లకు అలర్ట్ మెసేజులు, పుష్ నోటిఫికేషన్ల ద్వారా వారు బహుమతి గెలుచుకున్న విషయాన్ని తెలియజేస్తారు. బహుమతి గెలుచుకున్న వినియోగదారులు పాన్ కార్డ్, ఆధార్, బ్యాంక్ ఖాతా వంటి అదనపు వివరాలను నెల రోజుల్లోగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రైజ్ మనీ నేరుగా వారి ఖాతాల్లోకే జమవుతుంది.

జీరో దందాకు చెక్ పడేనా?

ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొట్టేందుకు బిల్లులు లేకుండా నిర్వహించే వ్యాపార లావాదేవీలనే ‘జీరో దందా’ అంటారు. బిల్లుతో జరిగే లావాదేవీలు రికార్డుల్లో నమోదవుతాయి. వాటికి తగిన పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. పన్ను ఎగ్గొట్టి నల్లధనాన్ని పోగుచేయడం కోసం వ్యాపారులు మార్గాలు వెతుకుతూనే ఉంటారు. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. నల్లధనాన్ని, జీరో దందాను అరికట్టేందుకు, వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు నోట్ల రద్దుతో పాటు సరికొత్త పన్ను విధానం జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చింది. డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం కల్పిస్తోంది. ఇన్ని చర్యలు చేపట్టినా సరే.. ఇప్పటికీ వ్యాపారుల వీలైనంత మేర జీరో దందా నిర్వహిస్తూనే ఉన్నారు. అందులో వినియోగదారుల పాత్ర, సహకారం కూడా చాలా ఉంటుంది. సాధారణంగా ఏదైనా వస్తువును అమ్మే సమయంలో బిల్లు కావాలంటే ఒక రేటు, బిల్లు లేకుండా తగ్గించిన రేటు చెబుతుంటారు. కస్టమర్లు సైతం వారంటీ అవసరం లేదనుకున్న వస్తువుల విషయంలో బిల్లు లేకుండా కొనడానికే మొగ్గుచూపుతూ ఉంటారు. ఆ సంస్కృతికి చెక్ పెట్టడం కోసమే కేంద్ర ప్రభుత్వం ‘మేరా బిల్.. మేరా అధికార్’ తీసుకొచ్చింది. అయితే ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రజల భాగస్వామ్యం, సహకారం లేకుంటే ఏ చర్యా పూర్తి ఫలితం తీసుకురాదు.