Andhra Pradesh: ఒకే వేదికపైకి వచ్చిన మిత్రపక్షాలు.. ధర్నాలో కాషాయం, జనసేన కండువా రెపరెపలు..
స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్న ఒంగోలు ధర్నా తో పాటు విజయవాడ, భీమవరం, ఏలూరు వంటి చాలా ప్రాంతాల్లో జనసేన నాయకులు హాజరయ్యారు. అయితే సమస్య ఒక్కటే అయినా గతంలో ఎప్పుడూ రెండు పార్టీలు కలిసి ఆందోళనలు చేయలేదు. పురంధేశ్వరి వచ్చిన తర్వాత మాత్రమే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. మరోవైపు ఇటీవల సర్పంచ్ లు కొందరు తమ సమస్యలపై పవన్ కళ్యాణ్ తో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాతదైన కొత్త దృశ్యం కనపడింది. అవును..ఆ రెండు పార్టీలు కలిసాయి. పైకి మాత్రం మిత్రపక్షాలు అని చెప్పుకునే ఆ రెండు పార్టీలు ఎప్పుడూ కలిసిన దాఖలాలు లేవు. అదేమని ఎవరైనా అడిగితే ఎవరికి వారు సొంతంగా బలపడాలి కదా అని చెప్పుకొచ్చేవారు. ఇదంతా ఒకప్పుడు..కానీ ఇప్పుడు సీన్ మరిందంటున్నారు ఆ రెండు పార్టీల నేతలు. ఆ రెండు పార్టీలు బీజేపీ, జనసేన.. ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు పార్టీలు 2019 ఎన్నికల తర్వాత నుంచి మిత్రపక్షాలుగా ఉన్నాయి. కానీ ఒక్క తిరుపతి ఉపఎన్నికలో తప్ప మరెప్పుడూ ఈ రెండు పార్టీలు కలవలేదు. ఎన్నికలైనా, ఉద్యమాలైనా గానీ ఎవరికి వారే అన్నట్లు ఉండేది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఈ రెండు పార్టీలు కలిసి ఒకే ఆందోళనలో పాల్గొన్నాయి. కేంద్ర నిధులు రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందంటూ బీజేపీ ఇచ్చిన కలెక్టరేట్ల ముట్టడిలో జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు. అంతేకాదు వారి పార్టీ కండువాలు కప్పుకుని మరీ ధర్నాలో పాల్గొన్నారు జనసేన నేతలు. ఒకే ధర్నాలో కాషాయం కండువాలు, జనసేన కండువాలు కలవడం కొత్త చర్చకు దారితీసింది.
పురంధేశ్వరి వచ్చిన తరువాత సీన్ చేంజ్ అయిందా
రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ లకు మద్దతుగా బీజేపీ ధర్నాలకు పిలుపునిచ్చింది. ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలో స్వయంగా పురంధేశ్వరి ప్లాన్ చేసి ఆదేశాలిచ్చారు. నాయకులకు ఇచ్చిన సూచనల్లో ఎక్కడా జనసేన ప్రస్తావన మాత్రం రాలేదు. అలాంటిది బీజేపీ చేసిన ధర్నాల్లో జనసేన శ్రేణులు కలవడం చర్చగా మారింది. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్న ఒంగోలు ధర్నా తో పాటు విజయవాడ, భీమవరం, ఏలూరు వంటి చాలా ప్రాంతాల్లో జనసేన నాయకులు హాజరయ్యారు. అయితే సమస్య ఒక్కటే అయినా గతంలో ఎప్పుడూ రెండు పార్టీలు కలిసి ఆందోళనలు చేయలేదు. పురంధేశ్వరి వచ్చిన తర్వాత మాత్రమే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. మరోవైపు ఇటీవల సర్పంచ్ లు కొందరు తమ సమస్యలపై పవన్ కళ్యాణ్ తో చర్చించారు. వారికి అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు. అయితే బీజేపీ తో కలిసి ధర్నాలకు హాజరవ్వాలని మాత్రం ఎక్కడా నేరుగా ప్రకటన చేయలేదు. కానీ జనసేన నేతలు కొంతమంది మాత్రం తమకు పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలున్నాయని చెప్తున్నారు.
ఇలాగే కంటిన్యూ చేస్తారా?అధినేతలు కలిసేది లేదా?
సర్పంచ్ ల సమస్యలపై రెండు పార్టీలు కలిసి ఆందోళనల్లో పాల్గొవడం మంచి పరిణామం అంటున్నారు బీజేపీ నేతలు. తాము జనసేన తోనే పొత్తులో ఉన్నామని.. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పురంధేశ్వరి పదే పదే చెప్తున్నారు. త్వరలో పవన్ రో కూడా భేటీ అవుతానని చెప్పారు. రెండు పార్టీల చీఫ్ లు కలవకుండానే ఉద్యమంలో పాల్గొనడం ఆయా పార్టీలకు కొత్త ఊపు తెచ్చిందని నేతలు చెబుతున్నారు. అయితే ఇదే పరిస్థితి వచ్చే రోజుల్లో కంటిన్యూ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..