Collector Bungalow: 137 ఏళ్ల చెక్కు చెదరని చారిత్రక నిర్మాణం కలెక్టర్ బంగ్లా.. రాజసం నిండిన ఆ బంగ్లాను నిర్మించిన రాజు ఎవరో తెలుసా..!

నిజాం పాలన జరిగిన ప్రాంతాల్లో ఉన్న ముఖ్య పట్టణాల్లో వారు పెద్ద పెద్ద భవనాలను నిర్మించుకుంటూ వచ్చారు. ఆ కాలంలో జరిగిన నిర్మాణాల అన్నింటిలో "సుబేదార్ బంగ్లా " అతి పెద్దది. ప్రధాన ప్రవేశ ద్వారానికి అతిపెద్ద గడియారాన్ని ఏర్పాటు చేశారు. ఇందులోని విశాల ప్రాంగణంలో పచ్చిక బయళ్లు, నీటి కొలను, అందులో అతిపెద్ద ఫౌంటెయిన్ కనిపిస్తాయి.

Collector Bungalow: 137 ఏళ్ల చెక్కు చెదరని చారిత్రక నిర్మాణం కలెక్టర్ బంగ్లా.. రాజసం నిండిన ఆ బంగ్లాను నిర్మించిన రాజు ఎవరో తెలుసా..!
Warangal Collector
Follow us
G Peddeesh Kumar

| Edited By: Surya Kala

Updated on: Aug 10, 2023 | 7:56 AM

వరంగల్ పేరు చెప్పగానే కాకతీయుల కాలంనాటి నిర్మాణాలు గుర్తుకువస్తాయి. అలాగే నిజాం పరిపాలనా సమయంలో నిర్మించిన ఎన్నో భవనాలు ఇప్పటికీ కళ్లముందు సాక్షాత్కరిస్తుంటాయి. ఎన్నో భవంతులు ఉన్నా సుబేదారిలో కొలువుదీరిన కలెక్టర్ బంగ్లా హంగు, ఆర్భాటాలు ప్రత్యేకం. మాటల్లో చెప్పేకంటే మన కళ్ళతో చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. నాటి ఘన చరిత్రకు సాక్ష్యాలుగా, కళాకారుల అద్భుత పనితనానికి నిదర్శనంగా, గత వైభవానికి సాక్ష్యంగా నేటికి నిలిచి ఉన్న కలెక్టర్ బంగ్లాకు శంకుస్థాపన 137 ఏళ్లు పూర్తయింది. ఈ ఆగస్టు 10 వ తేదీతో 137 సంవత్సరాల మైలురాయి దాటి 138వ సంవత్సరంలోకి హనుమకొండ కలెక్టర్ బంగ్లా అడుగు పెడుతున్న సందర్భంగా ఈ బంగ్లా గురించి తెలుసుకుందాం..

కుతుబ్‌షాహీల పాలన తరువాత దక్కన్ ప్రాంతాన్ని చేజిక్కించుకున్న అసఫ్‌జాహీల పాలన సుమారు ఒకటిన్నర శతాబ్దంకు పైగా అప్రతిహాతంగా కొనసాగింది. అసఫ్‌జాహీల పాలనాకాలంలో నాటి పూర్వ వైభవాన్ని చాటి చెప్పేలా ఆశ్చర్యం కలిగించే పలు భవన సముదాయాల నిర్మాణం జరిగింది. పరిపాలనా సౌలభ్యం కోసం తమ రాజ్యాన్ని సుభాలుగా విభజించారు. ఒక్కో సుభాకు తరఫ్ దార్ లేదా సుబేదార్ అధికారి ఉండేవారు. సుబేదార్ ని సర్ లష్కర్ అనే పేరుతో కూడా పిలిచేవారు. తానిషా కాలంలో గోల్కొండ రాజ్యం 6 సుభాలుగా ఉండేది. అందులో వరంగల్ ఒకటి. వరంగల్ సుభాలో ఎలగందుల (కరీంనగర్), స్తంభగిరి (ఖమ్మం), దేవరకొండ (నల్గొండ), వరంగల్ అనే సర్కార్లు ఉండేవి. వీటన్నింటికి వరంగల్ కేంద్రంగా ఉండేది..

1853 లో సాలార్ జంగ్ నిజాం రాజ్యాన్ని ఐదు సుభాలుగా , 17 జిల్లాలుగా, ప్రతి జిల్లాను కొన్ని తాలుకాలుగా విభజించాడు. 1875 వ సంవత్సరంలో వరంగల్ లో భూమి సర్వే శాఖను స్థాపించారు. అప్పుడే రెవెన్యూ బోర్డు ఏర్పడింది. 10-8-1886 నాడు బ్రిటీష్ అధికారి జార్జ్ పాల్మార్ భార్య ఈ బంగ్లా నిర్మాణం కోసం శంఖుస్థాపన చేశారు. ఈ నిర్మాణం ఇప్పటికే 137 సంవత్సరాలు పూర్తిచేసుకుని 138 సంవత్సరంలోకి అడుగిడుతోంది. ఆ తర్వాత కాలంలో సుబేదార్ నివాసంగా ఉపయోగపడిన ఈ బంగ్లాను ఇప్పుడు జిల్లా కలెక్టర్ అధికారిక నివాసంగా ఉపయోగిస్తున్నారు .

ఇవి కూడా చదవండి

నిజాం పాలన జరిగిన ప్రాంతాల్లో ఉన్న ముఖ్య పట్టణాల్లో వారు పెద్ద పెద్ద భవనాలను నిర్మించుకుంటూ వచ్చారు. ఆ కాలంలో జరిగిన నిర్మాణాల అన్నింటిలో “సుబేదార్ బంగ్లా ” అతి పెద్దది. ప్రధాన ప్రవేశ ద్వారానికి అతిపెద్ద గడియారాన్ని ఏర్పాటు చేశారు. ఇందులోని విశాల ప్రాంగణంలో పచ్చిక బయళ్లు, నీటి కొలను, అందులో అతిపెద్ద ఫౌంటెయిన్ కనిపిస్తాయి.

అతిధులతో కూర్చుని మాట్లాడడానికి వీలుగా విశాలమైన హాలు నిర్మాణం చేశారు. ఆనాటి రాచరికపు హోదాకు తీపిగుర్తుగా శాండిలియర్‌ లు నేటికీ చెక్కు చెదరక కనిపిస్తున్నాయి. ఆ రోజుల్లో కరెంటు సౌకర్యం లేదు. కరెంటు లేని రోజుల్లో శాండిలియర్‌ లను ఏం చేసుకోవాలి అనే సందేహం రావడం సహజం.. వీటిల్లో పొగరాని కొవ్వొత్తులను వాడారు. మసిపట్టని ఆ కొవ్వొత్తులను లండన్ నుంచి దిగుమతి చేసుకొనేవారట.

ఈ భవనాన్ని అత్యంత పటిష్టంగా నిర్మించారు. ఒక కట్టడానికి మరొక దానితో పోలిక వుండదు. మొత్తం నిర్మాణాన్ని డంగు సున్నంతో చేపట్టారు. ఇలాంటి నిర్మాణాలు ఏవి చేపట్టాలన్నా ముందుగా డంగుతో సున్నం తయారు చేయాలి. డంగు సున్నాన్ని తయారుచేసే ప్రక్రియలో వారు ఎడ్లతో మట్టిని రోజుల తరబడి త్రొక్కించేవారు.

బంగ్లాలోకి వెళ్ళే ముందుగానే మనకు ఒక పెద్ద కమాను కనిపిస్తుంది. భవన నిర్మాణ క్రమంలో అణువణువునా వారు తీసుకున్న శ్రద్ధ, ఆసక్తి కనిపిస్తాయి. విశాలమైన ప్రాంగణంలో వున్న ఈ భవంతి లోపలికి వెళ్ళటానికి ఒక వైపు మాత్రమే మార్గం ఉంది. మొదటి అంతస్తులో ఒక విశాలమైన టెర్రస్‌ వంటి నిర్మాణముంటుంది. భవన నిర్మాణం ఒక అద్భుత నిర్మాణంలా వుంటుంది. ప్రతి అంతస్తులోపల చెక్క మెట్ల నిర్మాణం వుంటుంది.. అవి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మొదటి అంతస్తు నుండి చూస్తే మొత్తం బంగ్లా ప్రాంతం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. లోపలి ప్రాంతమంతా అబ్బురపరుస్తూ చాలా అందంగా కనిపిస్తుంది.. గాలి, వెలుతురుకి ఏమాత్రం ఇబ్బంది వుండకుండా తలుపులను వరుసగా అమర్చుతూ వాటికి తగ్గట్టుగా గదుల నిర్మాణాలు చేపట్టారు.

ఆ నిర్మాణ చాతుర్యం మనకు నేటికీ కనిపిస్తుంది. బయటికి భవనం ఎంత అందంగా వుంటుందో, లోపల కూడా అంతే రాజసంగా కనిపిస్తుంది.. అణువణువునా ఆనాటి భవననిర్మాణ కార్మికుల నేర్పరితనం మనకు ఆ నిర్మాణ తీరుల్లోనే కనిపిస్తాయి. భవన ప్రాంగణంలో ఒక అశ్వశాలతో పాటు ఇతర నిర్మాణాలు సహితం మనకు కనిపిస్తాయి. మంచి నీటి అవసరాలకుగాను ఒక దిగుడు బావిని సైతం తవ్వించారు. మొత్తం దాదాపు 13 ఎకరాల్లో భవన నిర్మాణం జరిగింది. బంగ్లా కమాను కింది భాగంలో రెండు వైపులా కాపలా సిబ్బంది కోసం విశ్రాంతి గదులు నిర్మాణం చేశారు. భవనం మొత్తం ప్రాంగణంలో సుమారు 10 గదులకు పైగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అతిథుల కోసం, కలెక్టర్ కార్యాలయ నిర్వహణకు, సమావేశాల ఏర్పాటుకు కేటాయించారు.. నగరం నడి బొడ్డున పచ్చని చెట్ల నీడలో ఆనాటి తీపి గుర్తుగా ఈ భవనం నిలుస్తుంది.

భవనం ప్రాంగణంలో వందల సంఖ్యలో చెట్లు ఉన్నాయి. పూలు, పండ్లు, శ్రీ గంధం, నల్లతుమ్మ, రాగి, వేప, అల్లనేరేడు వంటి వందల రకాల సంప్రదాయ మొక్కలున్నాయి. స్వాతంత్యం రాక మునుపు సుబేదార్ నివాసంగా వాడిన ఈ భవనాన్ని స్వాతంత్య్రం సిద్దించిన అనంతరం 1950 వ సంవత్సరం నుండి జిల్లా కలెక్టర్ నివాసంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో 1950 సంవత్సరం నుండి వరంగల్ మొదటి కలెక్టర్ MV . రాజ్వేద నుండి మొదలుకుని ప్రస్తుత కలెక్టర్ స్నిక్తా పట్నాయక్ వరకు 42 మంది కలెక్టర్లు నివాసం ఉన్నారు.

వరంగల్ కు ఎన్నిసార్లు వరదలు వచ్చినా.. ఎన్ని ఉపద్రవాలు ముంచుకు వచ్చినా.. ఇంచు మందం కూడా చెక్కుచెదరని చారిత్రక సంపద ఈ నిర్మాణం. నగరంలో అతి ఎత్తయిన ప్రాంతంలో వుంటుంది. 1982లో జవహార్ కలెక్టర్ గా ఉన్న సమయంలో బావి పూడికతీత తీశారు. ఆ సమయంలో బావిలో నిజాం కాలం నాటి కత్తులు, ఇతర సామాగ్రి లభించాయి . వాటిని రాష్ట్ర పురావస్తు శాఖ వారికి అప్పగించారు. 137 ఏళ్లు గడిచినా చెక్కు చెదరని ఈ బంగ్లా వరంగల్ కు ఒక ఐకాన్ గా నిలిచింది.. ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కొని సజీవ సాక్ష్యంగా నిలబడింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..