Rahul Gandhi: ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ?.. గ్రాఫ్ పెంచిన అనర్హత వ్యవహారం

రాజకీయాల్లో ఏ పరిణామం ఎవరికి ఎలా కలిసొస్తుందో చెప్పలేం. రాత్రికి రాత్రే తలరాతలు మారిపోతూ ఉంటాయి. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతుంటాయి. ఇదంతా ఎందుకంటే.. పరువు నష్టం వంటి అతి సాదాసీదా కేసులో అనర్హత వేటుకు గురైన రాహుల్ గాంధీ.. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో మళ్లీ తిరిగి తన లోక్‌సభ సభ్యత్వాన్ని పొందడం న్యాయపోరాటంలో సాధించిన విజయం మాత్రమే కాదు, అంతకు మించి నైతికంగా, రాజకీయంగా ఆయుధంగా మారింది.

Rahul Gandhi: ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ?.. గ్రాఫ్ పెంచిన అనర్హత వ్యవహారం
Rahul Gandhi
Follow us

| Edited By: Vimal Kumar

Updated on: Nov 03, 2023 | 2:24 PM

రాజకీయాల్లో ఏ పరిణామం ఎవరికి ఎలా కలిసొస్తుందో చెప్పలేం. రాత్రికి రాత్రే తలరాతలు మారిపోతూ ఉంటాయి. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతుంటాయి. ఇదంతా ఎందుకంటే.. పరువు నష్టం వంటి అతి సాదాసీదా కేసులో అనర్హత వేటుకు గురైన రాహుల్ గాంధీ.. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో మళ్లీ తిరిగి తన లోక్‌సభ సభ్యత్వాన్ని పొందడం న్యాయపోరాటంలో సాధించిన విజయం మాత్రమే కాదు, అంతకు మించి నైతికంగా, రాజకీయంగా ఆయుధంగా మారింది. హత్యలు, అత్యాచారాల ఆరోపణలు కల్గిన నేతలు చట్టసభల్లో తిష్టవేస్తున్న సమయంలో కేవలం ఓ ఎన్నికల సభలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ఆధారంగా జైలు శిక్ష విధించడం రాహుల్‌కు శాపంలాంటి వరంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యల కంటే.. ఆయనకు విధించిన శిక్ష గురించే దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆ మేరకు సానుభూతి కూడా పెరిగింది. పరువు నష్టం కేసులో గరిష్ట శిక్షాకాలం రెండేళ్లు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో కొన్ని నెలలు శిక్షతోనే సరిపెడుతుంటారు. కానీ రాహుల్ విషయంలో న్యాయస్థానం చట్టం ప్రకారం విధించదగ్గ గరిష్ట శిక్షాకాలాన్ని విధించడాన్ని ప్రజలు న్యాయప్రక్రియలో భాగంగా చూడలేదు. కక్షసాధింపు రాజకీయంగానే పరిగణించారు. చివరకు అధికార పార్టీలోనే నేతలు సైతం ఇలా చేయకుండా ఉండాల్సింది అనుకున్నారు.

ఏంటా కేసు?

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019 ఏప్రిల్ 13న ‘మోడీ’ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులకు టోకరా వేసిన ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోడీ, లలిత్ మోడీలను ప్రస్తావిస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లింకు చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలపై గుజరాత్‌కు చెందిన బీజేపీ నేత, శాసనసభ్యులు పూర్ణేష్ మోడీ సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసు విచారణకు రాహుల్ గాంధీ జులై 7న తొలిసారి స్వయంగా హాజరయ్యారు. ఆ తర్వాత కూడా హాజరైన సందర్భాలు ఉన్నాయి. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పేందుకు రాహుల్ గాంధీ ససేమిరా అన్నారు. మొత్తంగా న్యాయస్థానం రాహుల్ గాంధీని ఈ కేసులో దోషిగా తేల్చింది. ఇంతవరకు బాగానే ఉంది. 2023 మార్చి 23న న్యాయస్థానం ఆయనకు శిక్షను ఖరారు చేస్తూ.. పరువు నష్టం అభియోగంపై గరిష్టంగా విధించదగిన శిక్షాకాలం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఇది యావద్దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. సూరత్ కోర్టు శిక్ష విధించిన మర్నాడే, అంటే మార్చి 24న లోక్‌సభ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది. అంతటితో ఊరుకోకుండా సభ్యత్వం కోల్పోయిన వెంటనే పార్లమెంట్ సభ్యుడి హోదాలో ఆయనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా నోటీసులిచ్చి మరీ ఖాళీ చేయించింది. ప్రజాప్రాతినిథ్య చట్టం ప్రకారం కనీసం రెండేళ్లు లేదా ఆపైన జైలు శిక్ష పడితే చట్ట సభల ప్రజాప్రతినిధులు తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. అంతేకాదు, శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీచేయడానికి కూడా అనర్హులు అవుతారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ రాహుల్ గాంధీ విషయంలో ఆఘమేఘాలపై చోటుచేసుకున్న పరిణామాలు మాత్రం జనబాహుళ్యంలో చాలామందికి రుచించలేదు. ఇదంతా అధికార పార్టీ కక్షసాధింపు చర్యగానే కనిపించింది.

ఇవి కూడా చదవండి

ప్రధాని అభ్యర్థిత్వానికి ఊతం

A blessing in disguise అనే ఆంగ్ల సామెత రాహుల్ విషయంలో సరిగ్గా సరిపోతుంది. సాదాసీదా పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షకు గురికావడం, ఆ వెంటనే పార్లమెంట్ సభ్యత్వం కోల్పోవడం, ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాల్సి రావడం.. ఇవన్నీ చూస్తుంటే ఆయన్ను దురదృష్టం వెంటాడినట్టే కనిపించినా.. అన్నింటినీ రాహుల్ ఎదుర్కొన్న తీరు ఆయన పట్ల పార్టీలో, మిత్రపక్షాల్లో, ప్రజల్లో సానుకూలత తీసుకొచ్చింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగించిన భారత్ జోడో యాత్ర ద్వారా తనపై ఉన్న పాత ముద్రలు తొలగించుకుని, పరిణితిని ప్రదర్శిస్తూ వచ్చిన రాహుల్ గాంధీకి.. తాజా అనర్హత ఎపిసోడ్ మరింత బలాన్ని ఇచ్చింది. వ్యక్తి కేంద్రంగా సాగుతున్న నేటి రాజకీయాల్లో ప్రధాని మోదీని ఢీకొట్టే స్థాయిలో ప్రస్తుతం రాహుల్ గాంధీ తప్ప మరెవరూ కనిపించడం లేదు. ప్రధాని పదవి రేసులో బెంగాల్ సీఎం మమత బెనర్జీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా తమ ప్రయత్నాలు సాగించినప్పటికీ.. దేశం నలుమూలల నుంచి ఆమోదం పొందగలిగే పరిస్థితి లేదని వారు గ్రహించారు. ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి మూలనా ఉనికి ఉంది. రాహుల్‌లో అంత పరిణితి లేదంటూ విమర్శించిన సొంత పార్టీ నేతలే ఇప్పుడు ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నారు. ఇక కార్యకర్తల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

జనంలోనూ పెరిగిన మద్దతు

జనంలోనూ రాహుల్ గాంధీకి మద్దతు రోజురోజుకూ పెరుగుతోందని కొన్ని ప్రైవేట్ సంస్థల సర్వేలు చెబుతున్నాయి. NDTV-CSDS నిర్వహించిన ఓ సర్వే ప్రకారం 27 శాతం మంది రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే రాహుల్ బలం 4 పాయింట్లు పెరిగింది. 2014తో పోల్చితే ఏకంగా 13 పాయింట్లు పెరిగింది. ఈ సర్వేల్లో ప్రధాని మోదీపై ఆదరణ ఎక్కడా తగ్గినట్టు కనిపించలేదు. కాకపోతే బీజేపీయేతర ఓటర్లలో రాహుల్ ఆదరణ పెరిగిందని దీన్నిబట్టి అర్థమవుతోంది. ఒకప్పుడు మోదీకి ఏమాత్రం పోటీయే కాదన్న స్థాయిలో ఉన్న రాహుల్ గాంధీ, ఇప్పుడు సమవుజ్జీ స్థాయికి సమీపంలో ఉన్నారు. ఈ సర్వేలో తమ ప్రధానిగా మోదీయే ఉండాలని కోరుకుంటున్నవారిని.. మోదీకి ప్రత్యర్థి ఎవరు అని ప్రశ్నిస్తే.. 34 శాతం మంది రాహుల్ గాంధీ పేరు చెప్పగా, 11 శాతం మంది అరవింద్ కేజ్రీవాల్ పేరును, 5 శాతం మంది అఖిలేశ్ యాదవ్ పేరును, 4 శాతం మంది మమత బెనర్జీ పేరును ప్రస్తావించారు.

ఇండియా కూటమి సైతం సానుకూలం

మొదట్లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని ససేమిరా అంగీకరించని ప్రతిపక్ష కూటమిలోని కొందరు నేతలు, ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు కనిపిస్తోంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సైతం రాహుల్ ప్రధాని అభ్యర్థిగా తనకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. మరికొందరు నేతలు మాత్రం ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడు అప్రస్తుతమని, ఎన్నికల్లో సమష్ఠిగా పనిచేసి గెలిచిన తర్వాత నిర్ణయించుకోవచ్చని అంటున్నారు. మిత్రపక్షంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. గతంతో రాహుల్‌ గ్రాఫ్‌ పెరిగిందన్నది నిర్వివాదాంశం

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..