కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం.. ఆ నియోజకవర్గంలో అభ్యర్థులు వారే.. పార్టీలే మారాయి..!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హోరీహోరీ పోరు నెలకొంటోంది. 43 మంది సభ్యులతో మూడో విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో నిన్న (ఆదివారం) కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది చోటు దక్కించుకున్నారు.
Karnataka Election News: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హోరీహోరీ పోరు నెలకొంటోంది. 43 మంది సభ్యులతో మూడో విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో నిన్న (ఆదివారం) కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది చోటు దక్కించుకున్నారు. అథని నియోజకవర్గం నుంచి ఆయన్ను కాంగ్రెస్ పార్టీ బరిలోకి నిలిపింది. కర్ణాటక రాజకీయాల్లో ఇది ఆసక్తికరంగా మారింది. బుధవారం బీజేపీ విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలో తనకు చోటు దక్కకపోవడంతో ఆ పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు సవాది ప్రకటించారు. తనకు పార్టీ ద్రోహం చేసిందని ఆరోపించారు. ఆదివారం ఉదయం మాజీ సీఎం సిద్ధరామయ్య నివాసంలో ఆయనతో పాటు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలాతో సవాది సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ తీర్థంపుచ్చుకున్నారు.
మాజీ సీఎం యడియూరప్ప తర్వాత బీజేపీలోని బలమైన లింగాయత్ నాయకుల్లో లక్ష్మణ్ సదాని ఒకరు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అథని నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ కుమతహళ్లీ చేతిలో ఓడిపోయారు. 2019లో కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి యడియూరప్ప ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు జరిగిన పార్టీ ఫిరాయింపుల్లో మహేష్ కీలకంగా ఉన్నారు. వచ్చే ఎన్నిక్లలో అథని టిక్కెట్‌ను బీజేపీ సదానీని కాదని మహేష్‌కు కేటాయించింది. దీంతో సదాని కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ టిక్కెట్ దక్కించుకున్నారు. అంటే..2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసిన మహేష్ ఈ సారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండగా.. నాడు బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసిన సదాని ఈ సారి హస్తం గుర్తుపై పోటీకి దిగనుండటం కర్ణాటక రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
కర్ణాటక కాంగ్రెస్ అభ్యర్థుల 3 జాబితా..
Congress release 3rd list of candidates for Karnataka Assembly Election 2023. Laxam Savadi to contest from Athani. Shivalinge Gowda from Arsikere#KarnatakaElections2023 #KarnatakaElection2023 #KarnatakaAssemblyElections2023 pic.twitter.com/9j2rkl25Fg
— Priyarag Verma (@priyarag) April 15, 2023
అలాగే కోలార్ సీటును కొత్తూరు జి.మంజునాథ్‌కు కాంగ్రెస్ హైకమాండ్ కేటాయించింది. రెండో సీటుగా ఇక్కడి నుంచి పోటీ చేయాలనుకున్న సిద్ధరామయ్య ఆశలపై కాంగ్రెస్ అధిష్టానం నీళ్లు చల్లింది. దీంతో వరుణ నియోజకవర్గం నుంచి మాత్రమే సిద్ధరామయ్య బరిలో ఉంటారు. రెండు స్థానాల్లోనూ పోటీ చేస్తే పార్టీ అభ్యర్థుల తరఫున పోటీ చేయడం కష్టంగా మారుతుందంటూ.. కోలార్ నియోజకవర్గ టిక్కెట్‌ను ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం నిరాకరించినట్లు తెలుస్తోంది.
224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి ఒకే విడతలో మే 10న పోలింగ్ నిర్వహించనున్నారు. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..