INDIAvsNDA: సెంటిమెంటు రగిలించేలా కూటమి పేరు.. పెద్దన్న పాత్ర వహించేందుకే కాంగ్రెస్ మొగ్గు!

అనుకున్నట్లుగానే విపక్షాల కూటమికి బెంగళూరు భేటీ ఓ రూపునిచ్చింది. బెంగళూరులో రెండ్రోజులు సమావేశమైన 26 రాజకీయ పార్టీలు తమ కూటమికి

INDIAvsNDA: సెంటిమెంటు రగిలించేలా కూటమి పేరు.. పెద్దన్న పాత్ర వహించేందుకే కాంగ్రెస్ మొగ్గు!
Sonia Gamdhi, rahul Gandhi, Mallikarjun Kharge
Follow us
Rajesh Sharma

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 18, 2023 | 7:43 PM

పాట్నాలో విపక్షాల భేటీ తర్వాత అందరి దృష్టి బెంగళూరులో ఏం జరగబోతోందన్న అంశంపైకి మళ్ళింది. అనుకున్నట్లుగానే విపక్షాల కూటమికి బెంగళూరు భేటీ ఓ రూపునిచ్చింది. బెంగళూరులో రెండ్రోజులు సమావేశమైన 26 రాజకీయ పార్టీలు తమ కూటమికి ఇండియా (I-N-D-I-A)గా నామకరణం చేసుకున్నాయి. పదకొండు మంది సభ్యులతో ఓ కోర్ కమిటీని ఎంచుకుని, ఆ కమిటీ సారథ్యంలో తదుపరి కార్యాచరణ ఖరారు చేయబోతున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. తదుపరి భేటీ ముంబైలో జరగబోతుందని కూడా ప్రకటించారు. ఇదంతా బాగానే వుంది కానీ బెంగళూరు భేటీ తర్వాత కాంగ్రెస్ వ్యూహాత్మక ధోరణి తాజాగా పలు విశ్లేషణలకు తావిస్తోంది. కూటమికి ఎవరు సారథ్యం వహిస్తారు? మోదీకి ధీటుగా ఎవరిని ప్రధాన మంత్రిగా ప్రతిపాదిస్తారు? అన్న అంశాలు మాత్రం పలు ఊహాగానాలకు తెరలేపాయి. కూటమికి నాయకుడు ఎవరనే అంశంపై ఖర్గేని ప్రశ్నిస్తే ఆయన బంతిని ప్రస్తుత కన్వీనర్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ కోర్టులోకి నెట్టారు. కొత్త కూటమికి సారథి ఎవరనేది నితీశ్ ముంబై సమావేశంలో వెల్లడిస్తారని ఖర్గే చెప్పారు. అయితే బెంగళూరు భేటీలో వామపక్షాల ప్రతిపాదనకు ఎవరూ పెద్దగా స్పందించట్టు కనిపించింది. ముఖ్యంగా కూటమి పేరు ఖరారులో అలయెన్స్ అనే పదం వద్దని సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రతిపాదించినా పట్టించుకోకుండా చివరికి అలయెన్స్ అనే తగిలించారు. 90 శాతం పార్టీ ప్రజాప్రతినిధులు అన్న కొడుకు అజిత్ పవార్ వెంట వెళ్ళిపోగా చిన్న దుకాణం మాత్రమే మిగిలిన శరద్ పవార్ బెంగళూరు భేటీకి రారేమో అనుకున్నా నెగెటివ్ సంకేతాలు వెళతాయన్న కాంగ్రెస్ అభ్యర్థనతో ఆయన మనసు మార్చుకుని బెంగళూరు ఫ్లైటెక్కినట్లు తెలుస్తోంది.

బెంగళూరు భేటీలో పలు కీలక అంశాలను చర్చించారు. పలు రాష్ట్రాల్లో పార్టీల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ చాలా అంశాలలో, చాలా రాష్ట్రాలలో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో తమను చావు దెబ్బ కొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్‌ను మారు మాటెత్తకుండా కాంగ్రెస్ నేతలు ఓకే చేశారు. ఢిల్లీ ఆర్డినెన్సుపై కాంగ్రెస్ వైఖరి తేల్చాలన్న డిమాండ్‌ నెరవేరితేగాని కేజ్రీవాల్ బెంగళూరు విమానమెక్కలేదు. ఢిల్లీలో తమకు ఉనికే లేకుండా చేసిన అరవింద్ కేజ్రీవాల్‌తో కాంప్రమైజ్ అవడమే కాంగ్రెస్ ఎన్నో మెట్లు దిగబోతున్నదన్న సంకేతాల్నిస్తోంది. జాతీయ స్థాయిలో అధికారం సాధించాలనే ఉద్దేశంతో విపక్షాలన్నీ కూటమి కట్టాయి. మొన్నీమధ్యే బీజేపీ మీద ఘన విజయం సాధించిన కన్నడ భూమిలో ఐక్యతను చాటే ప్రయత్నం చేశాయి. బీజేపీకి ఆల్టర్నేట్ తామేనంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాయి. బీజేపీ ఎదుర్కోవాలంటే తమ తమ సొంత ఎజెండాలను పక్కన పెట్టాలని పార్టీలు నిర్ణయించినా ఆచరణలో కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ త్యాగాలను చేసి రావాల్సి వుంటుంది. అయితే, ఆ పార్టీ చిన్న నెంబర్‌కే పరిమితమైనా కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే గతంలో అనుసరించిన వ్యూహాన్నే అనుసరించడం ద్వారా పెద్దన్న పాత్ర కోసం ప్రయత్నించక మానదు. చరణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఇందిరా గాంధీ, చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని రాజీవ్ గాంధీ, ఐకే గుజ్రాల్ ప్రభుత్వాన్ని సోనియా గాంధీ కూల్చిన విధంగా కూల్చరన్న గ్యారెంటీ ఏమీ లేదు.

ప్రాంతీయ పార్టీల కోరికలు, ఆయా పార్టీల అధినేతల ఎత్తుగడలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. కర్నాటక ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ పెద్దన్న పాత్రకు తానే కరెక్టు అన్న ఇండికేషన్స్ ఇవ్వడం మొదలు పెట్టింది. కర్నాటక ఎన్నికలకు ముందు కూటమి సారథ్యాన్ని వదులుకునేందుకు, చివరికి ప్రధాన మంత్రి అభ్యర్థిగా రాహుల్ కాకుండా ఇంకెవరినైనా ప్రతిపాదించేందుకు కూడా కాంగ్రెస్ అధిష్టానం సిద్దపడింది. కానీ, కర్నాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. బీజేపీయేతర కూటమి ఏర్పడితే తామే పెద్దన్న అన్న సంకేతాల్నిస్తోంది. దానికి అనుగుణంగానే బెంగళూరు భేటీలో వ్యవహరించింది. తాము అధికారంలో వున్న రాష్ట్రంలో భేటీ ఏర్పాటు చేయడం, సమావేశాలను తమ ధోరణిలో నిర్వహించడం, మిత్రపక్షాలకు లావిష్ విందు ఏర్పాటు చేయడం వంటివి కాంగ్రెస్ పార్టీలో వ్యూహంలో భాగమేనని భావించాలి. ఇచ్చింది. కాంగ్రెస్ అధినాయకత్వం తమ వ్యూహానికి అనుకూలంగా ఎవరికి కావాల్సింది వారికి చేస్తూ కూటమికి అంకురార్పణ చేసింది. పాట్నా భేటీకి దూరంగా వున్న సోనియా గాంధీ ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా బెంగళూరు భేటీలో ప్రత్యక్షమయ్యారు. రెండు, మూడేళ్ళుగా అనారోగ్యం పేరిట తరచూ అమెరికా వెళ్ళి వస్తున్న సోనియా గాంధీ తాజాగా ఎంతో ఉత్సాహంతో కనిపిస్తున్నారు. హర్యానా రైతులతో డాన్సులు చేయడం, బెంగళూరు భేటీలో మమత లాంటి వారితో ఉత్సాహంగా, ఉల్లాసంతో మాట్లాడుతూ కనిపించడం ఆకట్టుకుంది. ఓరకంగా చెప్పాలంటే కొత్త కూటమికి సోనియానే అధ్యక్షత వహించవచ్చన్న ఇండికేషన్స్ కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తున్నాయి. పాట్నా, బెంగళూరు భేటీ తర్వాత ఇపుడు అందరి దృష్టి ముంబైలో జరగనున్న మూడో సమావేశంపై పడింది. ఇందులో కూటమి సారథిని, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌ని, ఉమ్మడి కార్యాచరణని ఖరారు చేయడం ఇపుడు ఐ.ఎన్.డి.ఐ.ఏ. నేతల ముందున్న అతి పెద్ద సవాలుగా భావించాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం