సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ (175 సీట్లు), ఒడిశా (147 సీట్లు), అరుణాచల్ ప్రదేశ్ (60 సీట్లు), సిక్కిం (32 సీట్లు) రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో జమిలి ఎన్నికలు ఏప్రిల్-మే నెలల్లో జరగనున్నాయి. ఈ రాష్ట్రాల అసెంబ్లీల గడువు జూన్ 2 – జూన్ 24 మధ్య ముగియనుంది. అంతకంటే ముందే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి, కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఈ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, లోక్‌సభ ఎన్నికలతో పాటు మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు జూన్ 04 తేదీన చేపట్టనున్నారు. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఏప్రిల్ 19న పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 02న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఒడిశా అసెంబ్లీకి నాలుగు విడతల్లో పోలింగ్ జరగనుంది. మే 13, మే 20, మే 25, జూన్ 01 తేదీల్లో నిర్వహించి.. జూన్ 04న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సిక్కిం అసెంబ్లీకి ఏప్రిల్ 19న పోలింగ్ నిర్వహించి జూన్ 02న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.