Board exams: విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తున్న "న్యూ ఎడ్యుకేషన్ పాలసీ (NEP)"లో భాగంగా సరికొత్త విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. పరీక్షల నిర్వహణ విధానాల్లోనూ సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర విద్యాశాఖ ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు అమలవుతున్న పరీక్షా విధానంలో విద్యార్థులు పాఠ్యాంశాల్లోని అంశాలను ఎంతవరకు అర్థం చేసుకున్నారు అన్నది తేల్చలేం.

Board exams: విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం
Board Examinations
Follow us

| Edited By: Basha Shek

Updated on: Aug 23, 2023 | 5:42 PM

విద్యార్థులకు ఇది శుభవార్త. ఏడాది నష్టపోకుండా ఒకే ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షలు రాసి స్కోర్ పెంచుకోవచ్చు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. బాగా చదివే విద్యార్థులు సైతం బోర్డు పరీక్షలు అనేసరికి గాభరా పడుతూ, భయాందోళనకు గురవుతుంటారు. అలాంటివారికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు రెండు సార్లు పరీక్ష రాసి, రెండింటిలో ఎందులో ఎక్కువ మార్కులు సాధిస్తే వాటినే సర్టిఫికెట్లలోకి తెచ్చుకోవచ్చు. ఈ తరహా విధానం రాష్ట్రాల ఇంటర్మీటియట్ బోర్డులు, వివిధ యూనివర్సిటీల్లో డిగ్రీ విద్యలో ఇప్పటికే అందుబాటులో ఉంది. పాసైన విద్యార్థులు కూడా సప్లిమెంటరీ పరీక్షలు రాసి స్కోర్ పెంచుకోడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తున్న “న్యూ ఎడ్యుకేషన్ పాలసీ (NEP)”లో భాగంగా సరికొత్త విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. పరీక్షల నిర్వహణ విధానాల్లోనూ సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర విద్యాశాఖ ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు అమలవుతున్న పరీక్షా విధానంలో విద్యార్థులు పాఠ్యాంశాల్లోని అంశాలను ఎంతవరకు అర్థం చేసుకున్నారు అన్నది తేల్చలేం. బట్టీ పట్టేసి పరీక్షల్లో రాసి పాసైపోతున్నారు. కానీ ఆ విషయం వారి బుర్రకు ఎంతవరకు ఎక్కిందనేది తెలుసుకునే అవకాశం లేకుండా పోతోంది. అయితే కేంద్రం తీసుకొచ్చే సరికొత్త విధానంలో విద్యార్థులు కంఠస్థం చేసింది పేపర్‌ మీద రాసే విధానానికి బదులు వారి అవగాహన సామర్థ్యాన్ని పరీక్షించేలా పరీక్షలను సులభతరం చేయనుంది. అంతేకాదు, విద్యార్థులు తాము పరీక్షలకు సిద్ధంగా ఉన్నామని భావించి సందర్భాల్లో ‘ఆన్ డిమాండ్ పరీక్ష’లు కూడా నిర్వహించే వెసులుబాటు కల్పించేందుకు కసరత్తు జరుగుతోంది.

నచ్చిన సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు

మనం ఇంటర్మీడియట్‌గా వ్యవహరించే చదువును ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (CBSE)’లో 11, 12 తరగతులుగా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ (MPC), బయోలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ (BiPC), కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ (CEC), హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ (HEC) వంటి గ్రూపులే సాధారణంగా మనం చూస్తుంటాం. ఇంజనీరింగ్ చదవాలి అనుకునేవారు MPC, వైద్య విద్య అభ్యసించాలనుకునేవారు BiPC, మిగతా వారు కామర్స్ లేదా ఇతర గ్రూపులు తీసుకుంటూ ఉంటారు. కొన్ని చోట్ల M-BiPC వంటి గ్రూపుల ద్వారా అటు ఇంజనీరింగ్ లేదా ఇటు మెడిసిన్ చేయడానికి వీలుగా చదువుకునే వెసులుబాటు కూడా ఉంది. CBSE లో కూడా దాదాపు గ్రూపులు ఇలాగే ఉంటాయి. ఈ రకంగా విద్యార్థులు అయితే ఆర్ట్స్, కామర్స్, లేదా సైన్స్ గ్రూపులకే పరిమితం కావాల్సి ఉంటుంది. కానీ కొత్త విధానంలో విద్యార్థులు ఆర్ట్స్, కామర్స్, సైన్స్ అన్న విభజన లేకుండా తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. అంటే ‘బీకాంలో ఫిజిక్స్’ చదువుకున్నా అని ఎవరైనా అంటే ఇకపై హేళన చేయడానికి ఆస్కారం లేదన్నమాట.

11, 12 తరగతుల్లో 2 భాషలు

10వ తరగతి బోర్డు పరీక్షలు పాసైన విద్యార్థులు తదుపరి తాము ఏ గ్రూపు ఎంచుకున్నా సరే.. రెండు భాషలు సిలబస్‌లో తప్పనిసరిగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. గతంలో పాఠశాల విద్యలో త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ.. దక్షిణాది రాష్ట్రాలు మినహా ఉత్తరాదిన ఆ విధానాన్ని ఎవరూ పాటించలేదు. ఇంటర్మీడియట్‌లోనూ దక్షిణాదిన రెండు భాషలు సిలబస్‌లో భాగంగా ఉన్నాయి. ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తెలుగు లేదా సంస్కృత భాషల్లో ఏదైనా ఒకటి విద్యార్థులు ఎంచుకుంటూ ఉంటారు. అందుకే దక్షిణాదిన మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలపై కనీస అవగాహన, ప్రవేశం ఉంటాయి. కానీ ఉత్తరాదిన హిందీ మాతృభాషగా కలిగిన ప్రాంతాల్లో ఆ భాష తప్ప కనీస ఆంగ్ల పరిజ్ఞానం కూడా కొరవడిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఈ తేడాలను సరిచేసేందుకు కొత్త విద్యా విధానంలో 11, 12 తరగతుల్లో 2 భాషలను తప్పనిసరి చేయనుంది. అందులో ఒకటి కచ్చితంగా భారతీయ భాషై ఉండాలన్న నిబంధన కూడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మొత్తంగా చూస్తే దక్షిణాది ఇప్పటికే అమలైన విధానాలకు కాస్త మెరుగులు దిద్ది దేశవ్యాప్తంగా CBSE ద్వారా అమలు చేయాలన్న ప్రయత్నం కేంద్రం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.