Visakhapatnam: గుజరాత్ నుంచి విశాఖ జూకి ఆడ సింహం.. సక్కర్‌బాగ్‌కి 2 అడవి కుక్కలు.. ఎందుకంటే..?
Visakhapatnam: విశాఖ జూలో సింహాల సంఖ్యను పెంచడానికి బ్రీడింగ్ కోసం ఒక ఆడసింహం అత్యావశ్యకం అయింది. ఈ కారణంగానే గుజరాత్‌లోని సక్కర్‌బాగ్ జూ నుంచి ఓ ఆట సింహాన్ని విశాఖకు తీసుకొచ్చారు. అలాగే విశాఖ జూలో వయసు మీరిన 2 పులులు, ఒక జీబ్రా, ఒక జిరాఫీ వరుసగా మృతి చెందడంతో కొంత ఆందోళన నెలకొంది. అన్నీ వయసు మళ్ళి, అనారోగ్యంతో వచ్చిన సమస్యల వల్ల మృతి చెందినప్పటికీ జూలో ఏం జరుగుతోందంటూ పలు ఆరోపణలు వినిపించాయి. అదే సమయంలో జూలో ముఖ్యమైన జంతువులు..
విశాఖపట్నం, ఆగస్టు 19: విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు గుజరాత్ నుంచి ఓ ఆడ సింహం వచ్చింది. ఇటీవల కాలంలో విశాఖ జూలో సింహాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఒక మగ, ఒక ఆడ సింహం మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఆ ఆడ సింహానికి ఇక పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదని జూ అధికారులు చెబుతున్నారు. దీంతో విశాఖ జూలో సింహాల సంఖ్యను పెంచడానికి బ్రీడింగ్ కోసం ఒక ఆడసింహం అత్యావశ్యకం అయింది. ఈ కారణంగానే గుజరాత్‌లోని సక్కర్‌బాగ్ జూ నుంచి ఓ ఆట సింహాన్ని విశాఖకు తీసుకొచ్చారు. అలాగే విశాఖ జూలో వయసు మీరిన 2 పులులు, ఒక జీబ్రా, ఒక జిరాఫీ వరుసగా మృతి చెందడంతో కొంత ఆందోళన నెలకొంది. అన్నీ వయసు మళ్ళి, అనారోగ్యంతో వచ్చిన సమస్యల వల్ల మృతి చెందినప్పటికీ జూలో ఏం జరుగుతోందంటూ పలు ఆరోపణలు వినిపించాయి. అదే సమయంలో జూలో ముఖ్యమైన జంతువులు లేకపోవడంతో పర్యాటకుల సంఖ్యపై ప్రభావితం చూపుతుందేమోనన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా సింహం రావడం అందరికీ సంతోషాన్ని పంచుతోంది.
విశాఖకు గుజరాత్ నుంచి సింహం వచ్చినట్లే.. గుజరాత్ సక్కర్‌బాగ్ జూలాజికల్ గార్డెన్‌కి విశాఖ నుంచి రెండు అడవి కుక్కలు వెళ్లాయి. ఈ రెండు జూల మధ్య జంతు మార్పిడి విధానంలో ఒక ఆడ సింహాన్ని తీసుకొచ్చినట్టు క్యూరేటర్ డా. నందని సలారియా తెలిపారు. ఆగస్టు 18న అర్ధరాత్రి సమయంలో దాదాపు 2.5 సంవత్సరాల వయస్సు గల ఆడ సింహం సక్కర్బాగ్ జూ నుండి విశాఖ జూకు చేరుకుంది. ప్రతిగా సక్కర్‌బాగ్ జూకి ఒక జత అడవి కుక్కలు పంపామని సలారియా తెలిపారు. ఈ కొత్త ఆడ సింహం సందర్శకులకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని జూ అధికారులు ఆశిస్తున్నారు. విశాఖ జూలో ప్రస్తుతం ఉన్న ఒక జత సింహాలతో పాటు సింహాల గుంపు (ప్రైడ్ )ను తయారు చేయడానికి ఈ ఆడ సింహం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు అధికారులు.
ప్రొటోకాల్ ప్రకారం క్వారంటైన్లో సింహం
సక్కర్ బాగ్ జూ నుండి తీసుకువచ్చిన ఈ కొత్త సింహాన్ని సాధారణ ప్రొటోకాల్ ప్రకారం క్వారంటైన్లో ఉంచుతారు. క్వారంటైన్ వ్యవధి మూడు నెలల పాటు ఉంటుంది. వైల్డ్ యానిమల్ కావడంతో దాని మూమెంట్స్‌ను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఆవాస ప్రాంతం మారింది కనుక అది కుదుట పడాలి అంటే కనీసం మూడు నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి మూడు నెలల సమయం ముగిసిన తర్వాత సంబంధిత ఎన్‌క్లోజర్లో సందర్శకుల కోసం విడిచిపెట్టడం జరుగుతుంది.
జన్యు శక్తి పెరుగుదలకు దోహదం
తాజా పరిణామంతో సింహాల బ్రీడింగ్ కార్యక్రమం సులభతరం చేయడమే ఈ జంతు మార్పిడి ముఖ్య లక్ష్యంగా పేర్కొంటున్నారు అధికారులు. జూ క్యురేటర్ డాక్టర్ నందనీ సలారియా మాట్లాడుతూ సంతానోత్పత్తి ప్రయోజనాల కోసం జంతువులను మార్పిడి చేయడం ద్వారా, జన్యు శక్తిని పెంపొందించడమే మాత్రమే కాకుండా జంతు సంరక్షణ, నిర్వహణలో నైపుణ్యాన్ని కూడా పంచుకుంటామని అన్నారు. గుజరాత్లోని సక్కర్ బాగ్ జంతు ప్రదర్శన శాల వెటర్నరీ డాక్టర్ ప్రశాంత్ మారు, సిబ్బంది.. విశాఖ జూ వెటర్నరీ డాక్టర్ ఫణీంద్ర, డాక్టర్ పురుషోత్తం, జూనియర్ వెటర్నరీ డాక్టర్‌ల బృందం గుజరాత్ నుంచి విశాఖపట్నం జూకు సింహాన్ని తీసుకురావడంలో కష్టపడి కృషి చేసి విజయం సాధించినట్లు తెలిపారు నందనీ సలారియా.