Visakhapatnam: లోయలోకి బోల్తా పడిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి..! ప్రమాదానికి కారణమిదే..!
Alluri District: బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 20 మంది వరకు గాయపడ్డారు. పాడేరు ఘాట్ రోడ్డులోని వంజంగి కాంతమ్మ వ్యూ పాయింట్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 100 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కుదుపుతో బోల్తా పడే సరికి.. అందులో ఉన్న ప్రయాణికులు భీతిల్లీపోయారు. ఘాట్ రోడ్డుపై అటుగా వెళ్తున్న ప్రయాణికులు.. హుటాహుటిన సహాయక చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అల్లూరి జిల్లా, ఆగస్టు 21: అల్లూరి జిల్లాలో ఘాట్ రోడ్ ఎక్కుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 20 మంది వరకు గాయపడ్డారు. పాడేరు ఘాట్ రోడ్డులోని వంజంగి కాంతమ్మ వ్యూ పాయింట్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 100 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కుదుపుతో బోల్తా పడే సరికి.. అందులో ఉన్న ప్రయాణికులు భీతిల్లీపోయారు. ఘాట్ రోడ్డుపై అటుగా వెళ్తున్న ప్రయాణికులు.. హుటాహుటిన సహాయక చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పాడేరు ఆర్టీసీ డిపోకు ఓ బస్సు విశాఖ నుంచి పాడేరు వెళ్తున్న క్రమంలో.. ఘాట్ రోడ్డులోని వంజంగి వ్యూ పాయింట్ వద్ద లోయలో పడింది. రోడ్డు మీదగా వెళ్తున్నప్పుడు ఓ చెట్టు కొమ్మ దారికి అడ్డంగా పడి ఉండడంతో.. పక్కనే ఉన్న చిన్న మార్గం నుంచి బస్సును నెమ్మదిగా డ్రైవర్ పోనిచ్చాడు. ఈ సమయంలో ఎదురుగా స్పీడుగా వచ్చిన బైకు ఆర్టీసీ బస్సు పక్కన ఉంచి వెళ్ళింది. దీంతో ఆ బైక్ ప్రమాదానికి గురవుతుందేమోనని.. బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దాని కారణంగా వచ్చిన భారీ కుదుపుతో పక్కకు ఒరిగిన బస్సు లోయలోకి పడిపోయింది.
100 అడుగుల లోయలోకి.. హాహాకారాలు..
ఘాట్ రోడ్డుపై నుంచి అదుపుతప్పి బస్సు వంద అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోయింది. ఆరు, ఏడు సార్లు బోల్తా పడింది బస్సు. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా చెల్లాచెదురై పోయారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే కొందరు స్పృహ తప్పారు. మరికొందరి శరీరం నుంచి రక్తం కారుతూ ఉంది. దీంతో భారీగా కేకలు పెట్టి సహాయం కోసం అడిగారు.
అటుగా వెళుతున్న ప్రయాణికులే సహాయం చేసి..
బస్సు లోయలో పడిన స్పాట్‌లో సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగా అందవు. దాదాపుగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బస్సు పడినప్పటికీ.. అరగంట వరకు ఈ విషయం బయట ప్రపంచానికి తెలియలేదు. అయితే ఘాట్ రోడ్డులో వెళ్తున్న కొందరు ప్రయాణికులు దాన్ని చూసి మరికొందరి సహకారంతో.. క్షతగాత్రులను పైకి తీసుకొచ్చారు. ఈ లోగా అటువైపుగా అంబులెన్స్ వెళ్తుండడంతో దానిలో కొంతమందిని ఎక్కించారు. మరి కొంతమందిని అక్కడే కూర్చోబెట్టి.. తువాళ్లు రుమాళ్లతో గాయాలకు చుట్టి సపర్యలు చేశారు. ఈ లోగా మరో ఆర్టీసీ బస్సు రావడంతో.. ఆ బస్సులో క్షతగాత్రులు అందర్నీ హుటాహుటిన పాడేరు ఆసుపత్రికి తరలించారు.
పిల్లలు పెద్దలు వృద్ధులు కూడా..
బస్సులో దాదాపుగా 25 నుంచి 30 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో మహిళలు, చిన్నారులు వృద్ధులు కూడా ఉన్నారు. బస్సు బోల్తా పడిన తర్వాత స్థానికుల సహకారంతో లోయ పైకి వచ్చిన వాళ్లంతా.. ఆసుపత్రులకు చేరుకున్నారు. కొంతమందిని స్ట్రెచ్చర్లపై తరలించారు. జరిగిన ఘటనను ఊహించుకుంటూ ఉలిక్కిపడుతున్నారు ప్రయాణికులు.
అందువల్లే ప్రమాదం..: డ్రైవర్ సత్తిబాబు
బస్సు ప్రమాదంలో డ్రైవర్ సత్తిబాబు తలకు గాయమైంది. చెట్టు కొమ్మను తప్పించబోయే సమయంలో.. స్పీడుగా ఓ బైకు వచ్చేసిందని.. బైకు ప్రమాదం గురవుతుందేమోనని బ్రేకు వేసేసరికి బస్సు ఒరిగిపోయి లోయలోకి వెళ్లిపోయిందని అంటున్నాడు డ్రైవర్ సత్తిబాబు. ఒక్కసారిగా లోయలో బస్సు పట్టిన కొట్టిందని.. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు గుర్తు లేదని చెబుతున్నాడు సదరు డ్రైవర్. ప్రస్తుతం పాడేరు ఆసుపత్రిలో డ్రైవర్ సత్తిబాబు చికిత్స పొందుతున్నాడు.
ఇద్దరు మృతి.. ఇద్దరు కేజీహెచ్‌కు తరలింపు..
సమాచారం అందుకున్న పాడేరు పోలీసులు హుటాహుటిన సిఐ సుధాకర్ నేతృత్వంలో ఘటనస్థలికి చేరుకున్నారు. సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. మృతుల్లో ఒకరిని చూడవలసిన నారాయణమ్మగా, మరొకరిని జి మాడుగుల కొత్తూరుకు చెందిన కొండన్నగా గుర్తించారు. చెట్టుకొమ్మ బైక్‌ను తప్పించబోయి ఒరిగి లోయలోకి బస్సు పడిపోయిందని అన్నారు సీఐ సుధాకర్. అలాగే బస్సు ప్రమాదంలో గాయపడిన వారంతా పాడేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. మరోవైపు గాయపడిన వారిలో ఇద్దరు పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వాళ్లను మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్ కు తరలించారు.
సీఎం దిగ్భ్రాంతి..
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారులకు సీఎం ఆదేసాలు జారీ చేశారు. ఘటనకు దారితీసిన కారణాలపై అధికారులు దృష్టిసారించాలని సీఎం సూచించారు. మరోవైపు ఘటన స్థలానికి చేరుకున్న మంత్రి అమర్నాథ్.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. 1 లక్ష పరిహారం ఇస్తామని ఆయన ప్రకటించారు.ఇంకా ఘాట్‌రోడ్‌లో జరిగిన ఈ దుర్ఘటనపై బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.