Andhra Pradesh: భర్త శాడిజం.. తల్లి, తమ్ముడి మాట విని భార్యను 11 ఏళ్లు ఇంట్లో బంధించిన న్యాయవాది..

తాళి కట్టిన భార్యను ఏకంగా 11 సంవత్సరాల పాటు ఇంట్లో బంధించాడు. ఆమెను బయట ప్రపంచానికి దూరం చేశాడు. చీకటి గదిలో బక్క చిక్కిన శరీరంతో 11 సంవత్సరాల పాటు కఠినమైన జీవితాన్ని అనుభవించింది ఆ మహిళ. తన న్యాయవాద వృత్తిని అడ్డం పెట్టుకొని బయట ప్రపంచానికి, తల్లిదండ్రులకు దూరం చేసిన ప్రబుద్ధుడు విజయనగరం మధుసూదన్ పై సర్వత్రా విమర్శలు

Andhra Pradesh: భర్త శాడిజం.. తల్లి, తమ్ముడి మాట విని భార్యను 11 ఏళ్లు ఇంట్లో బంధించిన న్యాయవాది..
Lawyer Locked His Wife
Follow us
Surya Kala

|

Updated on: Mar 02, 2023 | 6:33 AM

అత్తవారింటి ఆంక్షలతో పన్నెండేళ్ల గృహ నిర్భంధం తరువాత భాహ్యప్రపంచంలోకి వచ్చింది ఓ మహిళ. నివాసం ఉంటున్న ఇల్లు తప్పా మరో లోకం తెలియని ఆ మహిళ పరిస్థితి అందరినీ కలచివేసింది. ఇంట్లో పనిమనిషి అవతారం ఎత్తి ధీనంగా గడిపిన ఆ అభాగ్యురాలు కోర్టు ఆదేశాలతో తల్లిదండ్రుల చెంతకు చేరింది.. అజ్ఞాతవాసం తరువాత కూతురు ను చూసిన తల్లి కన్నీటి భాష్పాలు అందరికీ కంటతడి పెట్టించాయి..

తాళి కట్టిన భార్యను ఇంట్లో నిర్బంధించి బాహ్య ప్రపంచానికి దూరం చేశాడు విజయనగరం జిల్లాకు చెందిన గోదావరి మధుసూదన్ అనే అడ్వకేట్ .. బయట ప్రపంచంతో పాటు కన్న తల్లిదండ్రులకు కూడా దూరం చేశాడు ఆ ప్రబుద్ధుడు.. అత్తారింటి వేధింపులతో పన్నెండు ఏళ్ల పాటు దుర్భరమైన జీవితాన్ని అనుభవించి చిక్కి శల్యమైంది సుప్రియ అనే మహిళ.. శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన సాయి సుప్రియ ను విజయనగరం టౌన్ బాలాజీ మార్కెట్ సమీపంలో ఉంటున్న గోదావరి మధుసూదన్ తో 2008లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.. మధుసూదన్ తన తల్లి గోదావరి ఉమామహేశ్వరి, తమ్ముడు దుర్గాప్రసాద్ తో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే పెళ్ళైన తరువాత మూడు ఏళ్లు బాగానే ఉన్న భర్త, అత్తలు ఆ తరువాత ఆంక్షలు పెట్టి సుప్రియ కు నరకం చూపించడం ప్రారంభించారు. సూటిపోటి మాటలతో వేధించేవారు..

ఎమ్ ఎ లిటరేచర్ వంటి ఉన్నత విద్య అభ్యసించిన సుప్రియను ఇంటికే పరిమితo చేసి అష్టకష్టాలు పెట్టారు.. సుప్రియ ను ఇంట్లో నుండి బయటకు వెళ్ళకుండా బంధించారు.. ఫోన్ కూడా ఇవ్వకుండా ఎవరితో మాట్లాడే అవకాశం లేకుండా చేశారు.. సుప్రియ తన కుటుంబ సభ్యులతో మాట్లాడాలని ప్రాధేయపడ్డ ఫలితం ఉండేది కాదు. అలా ఇంట్లో మనుషులు తప్పా మరో లోకం తెలియకుండా పన్నెండు ఏళ్లు గడిచాయి.. చివరికి తల్లిదండ్రుల చూపుకు కానీ, నోటి మాటకు కానీ నోచుకోకుండా భాధలు అనుభవించింది.. ఇంట్లో ఇంటి పనులు చేసుకొనే పనిమనిషి అవతారమెత్తింది.. అత్త పెట్టిందే తింటూ కాలం గడిపింది.. అత్త పెట్టే చాలీ చాలని భోజనంతో ఆకలితో అవస్థలు పడేది..

ఇవి కూడా చదవండి

అనేకసార్లు తల్లిదండ్రులు వచ్చి తన కుమార్తె తో మాట్లాడాలని కోరినా సుప్రియ ను కలవనిచ్చేవారు కాదు.. కనీసం ఇంట్లోకి కూడా రానిచ్చేవారు కాదు.. అంతేకాకుండా సుప్రియ కుటుంబ సభ్యులను దుర్భాషలు ఆడి వెనక్కి పంపించేవారు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో తమ కుమార్తె ఏమైందో తెలియక, అసలు ఉందో లేదో కూడా తెలియక తల్లిదండ్రులు యాతన అనుభవించారు.

సహనం కోల్పోయిన బాధితురాలి తల్లిదండ్రులు చివరికి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఒకటవ పట్టణ పోలీసులు ఫిబ్రవరి 28వ తేదీన సుప్రియ ఆచూకీ కోసం గోదావరి మధుసూదన్ ఇంటికి వెళ్ళారు.. అయితే గోదావరి మధుసూధన్, తమ్ముడు దుర్గాప్రసాద్ లు అడ్వకేట్ కావడంతో ఇంటిని తనిఖీ చేసే అధికారం మీకు లేదు, తనిఖీ చేసేందుకు కోర్టు ఆదేశాలు ఏమైనా ఉంటే చూపించాలని వాగ్వాదానికి దిగారు.. దీంతో చేసేదిలేక బాధితురాలి తల్లిదండ్రులు న్యాయస్థానం ఆశ్రయించి సెర్చ్ వారెంట్ తీసుకువచ్చారు. అలా సెర్చ్ వారెంట్ తో బుధవారం పోలీసులు మధుసూదన్ ఇంటి వద్దకు వెళ్లినా ఇంట్లోకి పోలీసులను రానీయకుండా అడ్డుపడ్డారు..

చివరికి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి ఇంటిని తనిఖీ చేయగా సాయి ప్రియ బక్క చిక్కిన శరీరంతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ కనిపించింది. దీంతో పోలీసులు ఆమెను బయటకు తీసుకువచ్చి న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు సుప్రియ ను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.. పోలీసులు గోదావరి మధుసూదన్, దుర్గాప్రసాద్, ఉమామహేశ్వరి పై అక్రమ నిర్భంధం తో పాటు అదనపు కట్న వేధింపుల క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Reporter: Koteswara Rao: మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..