Andhra Pradesh: ఆ నలుగురి దారెటు..? వేరే పార్టీలో టిక్కెట్ కన్ఫామ్ అయ్యిందా..? ఏపీలో హాట్ పాలిటిక్స్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు అనూహ్య పరిణామాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓట్ వేశారనే అనుమానంతో నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. దీంతో వీళ్ల ఫ్యూచర్ ఏంటన్నదే ఇప్పుడు లేటెస్ట్ పొలిటికల్ క్వశ్చన్.. వేరే పార్టీలో టిక్కెట్ కన్ఫామ్ అయ్యిందా..లేదంటే మరేదైనా హామీ వచ్చిందా.. అసలు ఆ నలుగురు ఎమ్మెల్యేల దారెటు.. ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.
ఆ నలుగురి దారెటు..? వేరే పార్టీలో టిక్కెట్ కన్ఫామ్ అయ్యిందా..? మరేదైనా హామీ వచ్చిందా..? ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ విషయాలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ రెబెల్స్‌తో పాటు..ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలే టీడీపీకి అనుకూలంగా ఓటేశారు. దీంతో..ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ లైన్ ను క్రాస్ చేసి ఓటు వేసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. దీనిని జీర్ణించుకులేని వైసీపీ శ్రేణులు.. నలుగురిపై భగ్గుమంటున్నాయి. ఈ తరుణంలో ఎప్పుడు ఏం జరగుుతుందోనని టెన్షన్ నెలకొంది.
ఇంతవరకు ఓకే..మరి..ఇప్పుడు ఆ నలుగురు ఎమ్మెల్యేల దారెటు..?ఇదే క్యూరియాసిటీ ఏపీ మొత్తం కనిపిస్తోంది. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి.. ఏ హామీతో వాళ్లు క్రాస్ ఓటింగ్‌కు తెగించారు. ఇదే ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలో డిస్కస్ జరుగుతున్న పాయింట్.
ప్రస్తుతం ఉండవల్లి శ్రీదేవి మాత్రం హైదరాబాద్‌కు మకాం మార్చారు. తనకు ప్రాణహాని ఉందని, అందుకే హైదరాబాద్ వచ్చినట్లు చెబుతున్నారు. ఒక్క శ్రీదేవే కాదు.. మిగతా ఎమ్మెల్యేలు కూడా వైసీపీపై మనసులో మాట బయటపెడుతున్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అయితే..సస్పెండ్ చేసినందుకు చాలా రిలాక్స్‌గా ఉంటున్నానన్నారు.
స్థానికంగా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు..?
ఆనం రామనారాయణ రెడ్డి కూడా వైసీపీకి దూరంగా..టీడీపీకి దగ్గరగా వెళ్లారు. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా కాకమీదున్నారు. అయితే..వీళ్లంతా ప్రస్తుతం తమతమ నియోజకవర్గాల్లో ముందుమాదిరిగా తిరగ్గలరా.. ప్రజలతో మమేకం కాగలరా.. అధిష్టానాన్ని ఎదిరించి..సొంత అడ్డాల్లో రాణించగలరా..మళ్లీ పాత ఛరిష్మాతో కొత్త ఖలేజా చూపించగలరా.. స్థానికంగా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనబోతున్నారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో వీళ్లకు స్థానిక వైసీపీ నేతల నుంచి తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి.
ఉదయగిరిలో మేకపాటి చిత్రపటానికి పాడగట్టి శవయాత్ర చేశారు. తుళ్లూరులో శ్రీదేవి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అటు ఆనం.. ఇటు కోటం రెడ్డికీ నిరసనల సెగలు తప్పడం లేదు.
ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీతో ఢీ కొని..సొంతంగా ఇమేజ్ పెంచుకోగలరా.. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎన్నికల ముందు లేదా ఒకటి రెండు నెలల తరువాత.. టీడీపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానంపై చాలా అసంతృప్తితో ఉన్నారు. సమయం దొరికినప్పుడల్లా పార్టీపై ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ విమర్శలు చేస్తున్నారు. సెటైర్లు వేస్తూ వచ్చారు..కొన్నిసార్టు సొంత పార్టీ నాయకులపై విమర్శలు కూడా చేశారు. వీటన్నింటినీ గమనిస్తూ వచ్చిన అధిష్టానం అవకాశం కోసం ఎదురుచూసింది. ఇప్పుడు క్రాస్ ఓటింగ్ పేరుతో వారిపై చర్యలు తీసుకుంది.
అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేసినా వారు ఎమ్మెల్యేలుగానే కొసాగుతారు కాబట్టి.. ఇప్పట్లో ఉప ఎన్నిక లేనట్టే.. కానీ ఒకవేళ వారిలో ఎవరైనా అధికారికంగా టీడీపీలో చేరితే.. వైసీపీకి రాజీనామా చేయాల్సి వస్తుంది.. లేదా అలాంటి ఆధారాలేవైనా వైసీపీకి దొరికితే వారి పై అనర్హత వేటు వేయొచ్చు.. అప్పుడు మాత్రం ఉప ఎన్నిక తప్పని సరి.. అయితే వారు అధిష్టానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ప్రస్తుతానికి ఏ పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉండదని అంటున్నారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజులా.. రెబల్ ఎమ్మెల్యేలుగానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఎన్నికల ముందు మాత్రం.. టీడీపీలో జాయిన్ అవుతారని.. ఇప్పటికే అందులో ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలకు టికెట్ హమీ కూడా వచ్చినట్టు సమాచారం. వారి సొంత నియోజకవర్గాల్లోనే మళ్లీ టీడీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి కూడా సీటుపై భరోసా లభించినట్టు టాక్.. అయితే ఎక్కడ అన్నది ఇంకా ఫైనల్ కావాల్సి ఉందని ఉదయగిరిలో చెప్పుకుంటున్నారు. మరో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేదని.. పార్టీలో మాత్రం సమున్నత స్థానం ఇస్తామని మాత్రమే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..