Andhra Pradesh: విద్యార్థుల ఆరోగ్యంపై జగన్ సర్కార్ ఫోకస్.. గోరుముద్ద పథకంలో చేరిన మరో హెల్తీ ఫుడ్.. ఇక మూడు రోజులు..
ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కార్ పాఠశాలల్లోని పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. పౌష్టికాహార లోపంతో పిల్లల్లో ఎదుగుదల తగ్గడమే కాకుండా రక్తహీనత పెరుగుతున్న నేపథ్యంలో..
ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కార్ పాఠశాలల్లోని పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. పౌష్టికాహార లోపంతో పిల్లల్లో ఎదుగుదల తగ్గడమే కాకుండా రక్తహీనత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు అదనంగా పోషకాహారం అందించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ఫిబ్రవరి 1 నుంచి వారానికి మూడు రోజుల చొప్పున గ్లాస్ రాగి జావ అందించాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు ఉదయం అల్పాహారంగా బెల్లం కలిపిన రాగి జావ అందించాలని సూచించారు. ఐరన్, కాల్షియం లోపం నివారణకు బెల్లంతో కూడిన రాగి జావ ఉపయోగపడుతుందని సీఎం జగన్ ఆదేశించారు. విద్యార్థులకు అందించే గోరుముద్ద నాణ్యతను నిరంతరం పరిశీలించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అన్ని స్కూళ్లు, అంగన్ వాడీలకు సార్టెక్స్ ఫ్లోరిఫైడ్ బియ్యాన్ని మాత్రమే సరఫరా చేయాలని ఆదేశాలిచ్చారు.
జగనన్న గోరుముద్ద, విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. పాఠశాల నిర్వహణ నిధి, మరుగుదొడ్ల నిర్వహణ నిధిని ఉపయోగించుకుని పాఠశాలల్లో ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ పూర్తిచేశామని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. డేటా అనలటిక్స్ ద్వారా విద్యార్థులు నేర్చుకుంటున్న తీరుపై నిరంతర పరిశీలన చేయాలని సీఎం సూచించారు.
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి తరగతి గదుల్లో ఐఎఫ్సీ ప్యానెల్స్ ఏర్పాటుచేయాలని.. డిజిటల్ స్రీన్ల ద్వారా విద్యార్థులకు ఉత్తమ బోధన అందాలని ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండాలని.. 1998 డీఎస్సీ అభ్యర్థులకు త్వరగా పోస్టింగులు ఇవ్వాలని జగన్ ఈ సందర్భంగా ఆదేశించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..