Andhra Politics: ఏపీలో పేలుతున్న మాటల తూటాలు.. రంగంలోకి జగన్.. ఇక చూస్కో మునుముందు మరింత హీట్ ఖాయం

నువ్వొకటంటే నే రెండంటా అన్న రీతిలో మూడు ప్రధాన పార్టీలకు చెందిన అగ్ర నేతలు ఎడాపెడా ప్రత్యర్థులను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. తాజాగా ఈ రేసులోకి ఏకంగా...

Andhra Politics: ఏపీలో పేలుతున్న మాటల తూటాలు.. రంగంలోకి జగన్.. ఇక చూస్కో మునుముందు మరింత హీట్ ఖాయం
Andhra Politics
Follow us
Rajesh Sharma

|

Updated on: Jul 21, 2023 | 8:20 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వొకటంటే నే రెండంటా అన్న రీతిలో మూడు ప్రధాన పార్టీలకు చెందిన అగ్ర నేతలు ఎడాపెడా ప్రత్యర్థులను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. తాజాగా ఈ రేసులోకి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఎంటరవడంతో మాటల మంటలు పీక్ లెవెల్‌కి చేరినట్లయ్యింది. ఇదివరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ చేసే విమర్శలు, ఆరోపణలకు వైసీపీ తరపున మంత్రులు, మాజీ మంత్రులు, మరికొన్ని సార్లు ప్రభుత్వ సలహాదారులు, ఇంకొన్ని సందర్భాలలో ఎమ్మెల్యేలు స్పందించేవారు. కానీ తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్వయంగా స్పందించడం ప్రారంభించారు. దాంతో ఏపీలో పొలిటికల్ గేమ్ మరింత హీటెక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా 9 నెలల గడువుంది. ఏదైనా అనూహ్య నిర్ణయం జరిగితే తప్ప 2024 ఏప్రిల్ నెలలోగానీ ఎన్నికలు జరగవు. కానీ ఏపీలో రాజకీయ వాతావరణం రేపో ఎల్లుండో ఎన్నికలు అన్న చందంగా వుంది. దానికి కారణం ఓవైపు ప్రభుత్వాధినేత వైఎస్ జగన్ వారానికో సంక్షేమ పథకానికి సంబంధించిన కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందులో రాజకీయ ప్రసంగాలు చేయడం కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు వారాహి విజయ యాత్ర పేరిట పది నెలల ముందుగానే ఎన్నికల ప్రచార పర్వాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్.. తన ప్రసంగాలను పదునెక్కిస్తున్నారు. తొలివిడత యాత్రకు కొనసాగింపుగా ప్రారంభమైన మలివిడతో ముఖ్యమంత్రి జగన్‌ను జగ్గూ భాయ్ అని.. జగ్గూ అని సంబోధించడం ప్రారంభించారు. ఇంకోవైపు చంద్రబాబునాయుడు ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయనా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో అస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. మరోవైపు జనవరి నెలాఖరు నుంచి పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జిల్లాల వారీగా ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెడుతున్నారు. ఇలా పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడు, లోకేశ్ నాయుడుల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు, ఆరోపణలకు వైసీపీ నేతలు ఎక్కడికక్కడ కౌంటర్లిస్తున్నారు. ఎదురు దాడి చేస్తున్నారు. ఇదంతా కొనసాగుతుండగానే జగన్ మోహన్ రెడ్డి తన మాటల్లో పదును పెంచారు. ప్రసంగాలలో వేడి పెంచారు.

చిచ్చురేపిన కామెంట్స్ ఇవే

ఒకరకంగా చెప్పాలంటే పవన్ కల్యాణ్ ఏపీలో కొనసాగుతున్న వాలంటీర్ల వ్యవస్థనుద్దేశించి చేసిన కామెంట్లు ఏపీలో రాజకీయ కాకను పెంచాయని చెప్పాలి. ఏపీలో లక్షలాది మంది మహిళలు కనిపించకుండా పోయారని, వారి అంతర్థానం వెనుక వైసీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న వాలంటీర్లున్నారన్న తీవ్ర ఆరోపణలు చేశారు పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ప్రభుత్వాధినేతలు, వాలంటీర్లు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఆయన కామెంట్లు చేసిన నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే వున్నారు. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూనే వున్నారు. అయితే, ఎంతో దూరాలోచనతో ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ వ్యవస్థపై రాజకీయ ప్రత్యర్థులు కామెంట్ చేయడాన్ని జగన్ మోహన్ రెడ్డి సహించనట్లు కనిపిస్తోంది. దాంతో జులై 21న తిరుపతి జిల్లా వెంకటగిరి వేదికగా జగన్ మోహన్ రెడ్డి స్వరం పెంచారు. క్యారెక్టర్ లేనోళ్ళంగా చక్కగా పని చేస్తున్న వాలెంటీర్లపై కామెంట్స్ చేస్తున్నారంటూ రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. ఏ నాయకుని పేరు ప్రస్తావించకుండా వారు గతంలో చేసిన వ్యాఖ్యలు, వారి వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాలను ఉదహరించారు వైఎస్ జగన్. జగన్ తాజాగా కామెంట్లతో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్ లెవెల్‌కి చేరినట్లయ్యింది.

దూకుడు పెంచిన పవన్

నిజానికి జూన్ 14న పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర ప్రారంభ సమయంలోనే పొలిటికల్ హీట్ ప్రారంభమైంది. పద్నాలుగో తేదీన యాత్ర ప్రారంభిస్తారని తెలిసిన వెంటనే ఆ ప్రాంతా జిల్లా పోలీసు యంత్రాంగం అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, వీథి సమావేశాలు నిర్వహించరాదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అసలు యాత్ర ప్రారంభమవుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎట్టిపరిస్థితుల్లో యాత్ర ప్రారంభమవుతుందని జనసేన రాష్ట్ర నాయకులు ప్రకటించడంతో పార్టీ వర్సెస్ పోలీసులుగా ఉద్రిక్తత ఏర్పడుతుందని అంతా భావించారు. కానీ జూన్ 14న ఎలాంటి ఇబ్బంది లేకుండానే వారాహి విజయయాత్ర ప్రారంభమైంది. యాత్ర ప్రారంభమైన నాలుగైదు రోజులు పవన్ కల్యాణ్ ప్రసంగాలు సాదాసీదాగానే సాగాయి. ఆ తర్వాతే తన ప్రసంగాలను పదునెక్కించడం మొదలుపెట్టారు పవన్ కల్యాణ్.  జగన్ మోహన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేయడం ప్రారంభించారు. జగన్ కుటుంబానికి బైరటీస్ గనులు ఎలా వచ్చాయో చెప్పాలనడంతో ఆరోపణల పర్వంలో వేడి రగులుకుంది. బెంగళూరు నుంచి వచ్చిన ఓ సైంటిస్టు నుంచి బైరటీస్ గనులను లాక్కున్నారంటూ ఆ భూములన్నీ అక్కడి పేద శెట్టి బలిజలవే అన్నారు. ఈక్రమంలోనే పవన్ కల్యాణ్‌పై ఎదురు దాడి ప్రారంభించారు వైసీపీ నేతలు.

రంగంలోకి ఇక సీఎం జగన్

ఆ తర్వాత జగన్ నుద్దేశించి ఏకవచన ప్రయోగం వైసీపీ నేతలకు మంట పుట్టించింది. అయినా తగ్గని పవన్ కల్యాణ్.. జగన్ ని జగ్గూ భాయ్ అన్నారు. ఇంకా రెచ్చగొడితే జగ్గూ అని పిలుస్తాననన్నారు. ఈక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశంలో పవన్ కల్యాణ్‌నుద్దేశించి రెండు చెప్పులను చూపించారు. గతంలో ఓ సభలో పవన్ కల్యాన్ ఒక చెప్పు చూపిస్తే.. పేర్ని నాని మీడియా మీట్‌లో ఏకంగా రెండు చెప్పులు చూపిస్తూ జనసేనానికి వార్నింగ్ ఇచ్చారు. చెప్పుల వ్యవహారంపై వెటకారంగా స్పందించిన పవన్ కల్యాణ్.. తన రెండు చెప్పులను అన్నవరం టెంపుల్ దగ్గర ఎవరో కొట్టేశారంటూ వ్యంగ్యోక్తులు విసిరారు. ఇలా కొనసాగిన వారాహి తొలి విడత తర్వాత రెండో విడతలోను పవన్ కల్యాణ్ ఎక్కడా తగ్గలేదు. దాంతో వైసీపీ తరపున మంత్రులు ఆళ్ళ నాని, అంబటి రాంబాబు, రోజా తదితరులు ఎదురు దాడి ప్రారంభించారు. ఈ వేడి సరిపోదన్నట్లు తాజాగా ముఖ్యమంత్రి స్వయంగా పవన్ కల్యాణ్, లోకేశ్, నందమూరి బాలకృష్ణ, చంద్రబాబులపై వారి పేర్లు ప్రస్తావించకుండా వ్యంగ్యంతో కూడిన విమర్శలు చేశారు. జగన్ తాజా కామెంట్లు ఏపీలో మరోసారి కాకరేపుతున్నాయి. వీటి ఆధారంగా ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎలా స్పందిస్తారనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది. మొత్తమ్మీద ఏపీలో రాజకీయ నాయకుల మధ్య మాటల మంటలు ఇంటరెస్టింగ్‌గా కొనసాగుతున్నాయి.