China Economic Crisis: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు చైనా కీలక నిర్ణయాలు.. అక్కడ మందు వేస్తే..

China Interest Rates: ప్రపంచీకరణ యుగంలో ఒక చోట తుమ్మితే.. యావత్ ప్రపంచానికి జలుబు చేస్తుంది. ఇది కోవిడ్-19 వంటి మహమ్మారి వంటి వైద్యారోగ్య రంగానికి సంబంధించిన విషయంలోనే కాదు, ఆర్థిక రంగంలో కూడా ప్రభావాలు అలాగే ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న అంశం చైనా ఆర్థిక మందగమనం.

China Economic Crisis: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు చైనా కీలక నిర్ణయాలు.. అక్కడ మందు వేస్తే..
China Economy
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 21, 2023 | 2:45 PM

China Interest Rates: ప్రపంచీకరణ యుగంలో ఒక చోట తుమ్మితే.. యావత్ ప్రపంచానికి జలుబు చేస్తుంది. ఇది కోవిడ్-19 వంటి మహమ్మారి వంటి వైద్యారోగ్య రంగానికి సంబంధించిన విషయంలోనే కాదు, ఆర్థిక రంగంలో కూడా ప్రభావాలు అలాగే ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న అంశం చైనా ఆర్థిక మందగమనం. ఎందుకంటే.. ఆ ప్రభావం యావత్ ప్రపంచంపై ప్రతికూలంగా ఉంటుంది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా.. ప్రపంచంలోనే అతి పెద్ద ఎగుమతిదారు, అదే సమయంలో రెండవ అతిపెద్ద దిగుమతిదారు కావడమే ఇందుకు కారణం. ప్రపంచంపై ప్రేమతో కాకపోయినా తమ దేశాన్ని ఈ గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించడం కోసం ఆ దేశం ఆర్థిక మందగమనానికి చికిత్స మొదలుపెట్టింది. ఈ క్రమంలో చైనా సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

కోవిడ్-19తో మొదలై..

చైనా ఆర్థిక మందగమనం కోవిడ్-19 మహమ్మారి సమయం నుంచే మొదలైంది. ఆ తర్వాత రష్యా – చైనా యుద్ధం వంటి గ్లోబల్ అంశాలతో పాటు చైనా అనుసరించిన ‘జీరో కోవిడ్’ పాలసీ, ప్రాపర్టీ మార్కెట్ సంక్షోభం, వాతావరణ మార్పుల ప్రభావం వంటివి ఈ మందగమనాన్ని మరింత ముందుకు నెట్టాయి. దాంతో చైనా నిర్దేశించుకున్న వార్షిక వృద్ధి రేటు లక్ష్యం 5.5 శాతాన్ని అందుకోవడం దాదాపు అసాధ్యం అని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా, బ్రిటన్ తరహాలో ఇక్కడ ద్రవ్యోల్బణం లేకపోయినా… దేశీయంగా, అంతర్జాతీయంగా వస్తువుల డిమాండ్ తగ్గిపోవడం చైనాను వేధిస్తున్న పెద్ద సమస్యగా మారింది. డాలర్‌తో పోల్చితే యువాన్ విలువ దారుణంగా పడిపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

కోవిడ్-19కు ముందు వరకు ప్రపంచ దేశాల మార్కెట్లను చైనా శాసిస్తూ వచ్చింది. గుండు సూది నుంచి భారీ పారిశ్రామిక యంత్రాల వరకు చైనా ఉత్పత్తి చేయని వస్తువంటూ లేదు. భారత్‌లో పండుగల వేళ ఉపయోగించే వస్తువులైన రాఖీలు, వెలుగు జిలుగుల విద్యుత్ దీపాలు, టపాసులు సహా అనేక వస్తువులు చైనా తయారు చేసి ఎగుమతి చేస్తూ వచ్చింది. కోవిడ్-19 యావత్ ప్రపంచంపై విరుచుకుపడే సమయానికి భారత్ తన అవసరాలకు తగినన్ని N-95 మాస్కులు, PPE కిట్లను కూడా తయారుచేసుకునే సామర్థ్యం కలిగి లేదు. కానీ కోవిడ్-19 వంటి విపత్కర పరిస్థితులను భారత్ వంటి దేశాలు ఒక అవకాశంగా మలచుకుని ‘స్వయం సమృద్ధి’ లక్ష్యంగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ప్రపంచంలోని అతిపెద్ద వినిమయ మార్కెట్లలో ఒకటైనా భారత్, పూర్తిగా చైనా దిగుమతులపైనే ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడింది. మిగతా ప్రపంచ దేశాలు సైతం వీలైనంత మేర దిగుమతి భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలే చేశాయి. ఇవన్నీ ‘చైనా’ వృద్ధికి అవరోధాలుగా మారాయి. వాటన్నింటికీ తోడు చైనా అనుసరించిన కొన్ని విధానాలు, వ్యూహాలు ఆ దేశంలో అంతర్గతంగానూ సమస్యలకు కారణమయ్యాయి.

వాటిలో ‘జీరో కోవిడ్’ స్ట్రాటజీ ఒకటి. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు చైనా చాలా కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఆ కారణంగా పారిశ్రామిక నగరాలుగా పేరొందిన షెంజెన్, తియాంజిన్ వంటి నగరాల్లో ఉత్పాదకత దారుణంగా పడిపోయింది. కోవిడ్-19 గుణపాఠాల నేపథ్యంలో ప్రజలు సైతం ఆహారం, పానీయాలు, రిటెయిల్ రంగం, పర్యాటకంపై పెద్దగా ఖర్చు పెట్టడం లేదు. ఫలితంగా ఆ రంగాలు సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నాయి.

చైనా మందగమనంలో కీలకమైన మరో అంశం స్థిరాస్థి రంగం. దేశంలో రియల్ ఎస్టేట్ కార్యాకలాపాలు నెమ్మదించాయి. ఆ దేశ జీడీపీలో స్థిరాస్తి రంగం మూడో వంతు వాటా కలిగి ఉంది. పైగా స్థిరాస్తి రంగం ప్రత్యక్షంగా అనుబంధ రంగాలకు, పరోక్షంగా అనేక ఇతర రంగాలకు ఊతమిస్తుంది. ఈ రంగంపై నీలినీడలు కమ్ముకున్నప్పుడు ఆ ప్రభావం పూర్తి ఆర్థిక వ్యవస్థపై ప్రతిబింబిస్తుంది. స్థిరాస్తి రంగంలో వినియోగించే ఇనుము, ఉక్కు, గ్రానైట్ వంటి వస్తువుల దిగుమతులు తగ్గిపోవడంతో.. ఆ దేశానికి వీటిని ఎగుమతి చేస్తున్న దేశాలు సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

వీటికి తోడు వాతావరణ మార్పుల కారణంగా తీవ్రమైన వేడిగాలులు, వాయువ్య సిచువాన్ ప్రావిన్స్‌‌తో పాటు సెంట్రల్ చైనాలోని చాంగ్‌కింగ్ నగరం నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాయి. వేడిగాలుల నేపథ్యంలో ఏసీల వాడకం పెరిగి, విద్యుత్ డిమాండ్ పెరిగింది. జలవిద్యుత్‌పై ఎక్కువగా ఆధారపడ్డ ఈ ప్రాంతాల్లో నీటి ఎద్దడి కారణంగా విద్యుదుత్పత్తి తగ్గింది. ఫలితంగా ఐఫోన్లు తయారుచేసే ఫాక్స్‌కాన్, ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా వంటి పారిశ్రామిక సంస్థలు విద్యుత్ కోతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని పరిశ్రమలు పనివేళలు తగ్గించగా, మరికొన్ని పూర్తిగా మూతపడ్డాయి. ఇలాంటి దేశీయ సమస్యలతో పాటు అమెరికా వంటి అగ్రరాజ్యంతో చైనాకు ఉన్న విబేధాలు అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా ప్రభావాన్ని చూపుతున్నాయి.

చికిత్స ఇలా..

ఈ మందగమనాన్ని ఎదుర్కొనే క్రమంలో చైనా సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కార్పొరేట్ రుణాలకు బెంచ్‌మార్క్‌గా పనిచేసే ఏడాది రుణ ప్రైమ్ రేటును 3.55 శాతం నుండి 3.45 శాతానికి తగ్గించినట్లు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBoC) ఒక ప్రకటనలో పేర్కొంది. తనఖా రుణాల వడ్డీరేటును 4.2కు పరిమితం చేసింది. ఇంత తక్కువ వడ్డీ రేట్లు చరిత్రలోనే తొలిసారి అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా వాణిజ్య బ్యాంకులు మరిన్ని రుణాలు ఇచ్చేందుకు వీలు కలుగుతుందని చైనా భావిస్తోంది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోల్బణాన్ని అరికట్టే క్రమంలో వడ్డీ రేట్లను పెంచుతుంటే.. చైనా వడ్డీ రేట్లు తగ్గించడం ఆ దేశ వృద్ధికి దోహదపడుతుందని ఆర్థిక రంగ నిఫుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడం కోసం సెంట్రల్ బ్యాంక్ గత మంగళవారం ఆర్థిక సంస్థలకు మధ్యకాలిక రుణాల (MLF) వడ్డీ రేటును తగ్గించిన విషయం తెలిసిందే. మరోవైపు కఠినమైన కోవిడ్-19 ఆంక్షల నుంచి కూడా ఆ దేశం ప్రజలను విముక్తులను చేసింది. ఈ చర్యలు చైనా ఆర్థిక పురోగతికి తోడ్పడితే మిగతా ప్రపంచ దేశాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆ దేశంతో బలమైన వాణిజ్య సంబంధాలు కలిగిన దేశాలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..