Telangana Congress: ఐక్యతారాగం.. ఉమ్మడిగా బస్సుయాత్ర.. తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహరచన వేగవంతం

ఎన్నికల దిశగా మరింత వేగంగా అడుగులు వేసేవిధంగా నిర్ణయాలు తీసుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ కోర్ టీమ్ సభ్యులు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి నివాసంలో...

Telangana Congress: ఐక్యతారాగం.. ఉమ్మడిగా బస్సుయాత్ర.. తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహరచన వేగవంతం
Bhatti Vikramarka, Komatireddy Venkat Reddy, Revanth Reddy
Follow us

|

Updated on: Jul 19, 2023 | 6:16 PM

తెలంగాణ కాంగ్రెస్ జోష్ మీదుంది. అదే జోష్‌తో మరింతగా దూకుడు పెంచుతోంది. తాజాగా ఎన్నికల దిశగా మరింత వేగంగా అడుగులు వేసేవిధంగా నిర్ణయాలు తీసుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ కోర్ టీమ్ సభ్యులు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి నివాసంలో సమావేశమైన టీ.కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్ళే నిర్ణయాలను తీసుకున్నారు. అయితే, ఇంత జోష్ మీదున్నా అగ్రనేతల పర్యటనల విషయంలో మాత్రం కొంచెం గందరగోళం కొనసాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నెలల తరబడి మంతనాల తర్వాత ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరిలో ఒకరు (పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి) ఖమ్మం సభలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ వెంటనే రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మెన్‌ పదవినందుకున్నారు. తరచూ గాంధీ భవన్‌ను సందర్శిస్తూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే పొంగులేటితోపాటు పార్టీ కండువా కప్పుకుంటారని అంతా భావించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మేటర్ మాత్రం ఎప్పుడో తేలకుండా ఎడతెగకుండా వాయిదా పడుతూ వుంది. జులై 20న కొల్లాపూర్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ పార్టీలో చేరాలని, ఆ సభకు ప్రియాంక గాంధీని రప్పించాలని జూపల్లి భావించారు. కానీ ప్రియాంక ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు సమయమిస్తుందో రాష్ట్ర నాయకత్వానికే క్లారిటీ లేదు. రాష్ట్ర నాయకత్వం కాదు.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రేకి కూడా క్లారిటీ లేనట్లు తాజాగా వెల్లడైంది. కోమటిరెడ్డి ఇంట్లో జరిగిన సమావేశం తర్వాత జులై 20న ఢిల్లీ వెళ్ళనున్న ఠాక్రే.. ప్రియాంక గాంధీ టూర్‌పై ఓ క్లారిటీ తెచ్చుకుంటారని, ఆమె ఇచ్చే తేదీకి అనుగుణంగా జూపల్లి కృష్ణారావు చేరిక తేదీ ఖరారవుతుందని తాజాగా తెలుస్తోంది.

భేటీలో కీలక నిర్ణయాలు

ఇక కోమటిరెడ్డి ఇంట్లో సమావేశమైన టీ.కాంగ్రెస్ నేతలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రస్థాయిలో నేతలంతా ఐక్యంగా వుండాలన్న మెసేజ్‌ ప్రజల్లోకి బలంగా పంపాలని తలపెట్టారు. పదేళ్ళ తర్వాతైనా అధికారంలోకి రాకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకంలో పడుతుందని భేటీలో పలువురు అభిప్రాయపడడంతో ఐక్యతారాగం అందుకున్నట్లు బోధపడుతోంది. అదేసమయంలో జరగబోయే ఎన్నికలను ఓ యుద్దంలా భావించి పోరాడాలని టీ.కాంగ్రెస్ నేతలు ఏకాభిప్రాయానికి రావడం విశేషం. ఇటు కీలక నేతలు కోమటిరెడ్డి ఇంట్లో భేటీ అయిన తరుణంలోనే అటు సంగారెడ్డిలో కాంగ్రెస్ బీసీ నేతలు భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయాలని నిర్ణయించారు. 2004 ఎన్నికల్లో ఆనాటి విపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసినట్లుగా ఈ ఎన్నికలకు ముందు టీ.కాంగ్రెస్ కీలక నేతలంతా కలిసి బస్సు యాత్ర నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే, దీనికి సంబంధింని రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటామని కోమటిరెడ్డి వెంకట రెడ్డి వెల్లడించారు. అయితే, ఇటీవల కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనేక ఉచితాలను ప్రకటించి ఓటర్లను మచ్చిక చేసుకున్న దానికి భిన్నంగా ఇష్టమొచ్చిన హామీలను ఇవ్వబోమని ఆయన చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ఓవైపు ఉచితాలను ప్రకటిస్తూనే ఇంకోవైపు అలాంటి హామీలుండవనడం విచిత్రంగానూ వుంది. బెంగళూరు వేదికగా రెండ్రోజుల పాటు జరిగిన 26 విపక్షాల భేటీలో రాహుల్ గాంధీ ఉచితాలను భారీగా ప్రకటించడం ద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిద్దామని ప్రకటించడం కూడా ఇక్కడ ప్రస్తావనార్హంగా కనిపిస్తోంది.

బస్సుయాత్రపై కసరత్తు

ప్రియాంకా గాంధీపై గత రెండు నెలలుగా రకరకాల తేదీల ప్రస్తావన జరుగుతోంది. జులై 20న కొల్లాపూర్ సభకు ఆమె హాజరవుతారని భావించినా అదిప్పుడు నెలాఖరుకు మారినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలను బట్టి చూస్తే ప్రియాంక గాంధీ జులై నెలాఖరులో తెలంగాణకు రావడం, మహిళా డిక్లరేషన్ ప్రకటించడం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో జరిగిన టీ.కాంగ్రెస్ మీటింగ్‌లో మరిన్ని కీలక అంశాలు చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కనీసం 50 సీట్లను పార్టీ ఎందుకు గెలవలేకపోయిందో సమీక్ష జరగాలని కొందరు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టిన బస్సు యాత్ర విధివిధానాలను త్వరలో ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతలతోపాటు మరో ఇద్దరు, ముగ్గురు నేతలు బస్సు యాత్ర చేస్తే బావుంటుందన్నది ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. మొత్తమ్మీద ఐక్యతారాగాన్ని ఆలపిస్తూ ఎన్నికలను ఎదుర్కొంటేనే సానుకూల ఫలితాలను రాబట్టుకుంటామన్న అభిప్రాయం తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో వినిపించడం సానుకూల పరిణామంగా భావించవచ్చు.