IND Vs SL: ఐపీఎల్‌లో తుస్సుమనిపించాడు.. కట్ చేస్తే.. టీమిండియాపై 15 బంతుల్లో 50 పరుగులు బాదేశాడు
ధర్మశాల, దుబాయ్, ముంబై, పుణె.. ఇలా వేదిక ఏదైనా గత ఏడాది టీమిండియాతో జరిగిన అన్ని టీ20 మ్యాచ్‌లలోనూ..
ధర్మశాల, దుబాయ్, ముంబై, పుణె.. ఇలా వేదిక ఏదైనా గత ఏడాది టీమిండియాతో జరిగిన అన్ని టీ20 మ్యాచ్‌లలోనూ శ్రీలంకకు చెందిన ఓ ఆటగాడు మెరుపు బ్యాటింగ్‌తో తన సత్తాను చాటాడు. అయితేనేం ఐపీఎల్ మినీ వేలంలో మాత్రం తుస్సుమనిపించాడు. ఏ ఫ్రాంచైజీ కూడా అతడ్ని కొనుగోలు చేసే ఆసక్తిని కనబరచలేదు. అతడు మరెవరో కాదు శ్రీలంక టీ20 కెప్టెన్ దసున్ షనక. జనవరి 5న టీమిండియాతో జరిగిన రెండో టీ20తో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అతడు తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
పూణె వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ షనక కేవలం 22 బంతుల్లోనే 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 సిక్స్‌లు, 2 ఫోర్లు ఉన్నాయి. ఈ మెరుపు బ్యాటింగ్‌తో తన జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే బంతితోనూ అదరగొట్టాడు. కీలకమైన 2 వికెట్లు పడగొట్టి శ్రీలంకకు విజయాన్ని అందించాడు. మరోవైపు షనక బరిలోకి దిగినప్పుడు మొదటి 7 బంతులకు కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఆ తర్వాత గేర్ మార్చి 15 బంతుల్లో 50 పరుగులు రాబట్టాడు. ఈ తరుణంలోనే తన అర్ధ సెంచరీని కేవలం 20 బంతుల్లో పూర్తి చేశాడు. ఈ ఫార్మాట్‌లో శ్రీలంక తరపున వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.
ఇదిలా ఉంటే.. టీమిండియాపై షనక ఆదరగొట్టడం ఇదేం మొదటిసారి కాదు. గత 5 ఇన్నింగ్స్‌లలో షనక భారత్‌పై 255 పరుగులు బాదేశాడు. ఈ సమయంలో అతడి స్ట్రైక్ రేట్ 205 కాగా.. ఔట్ అయింది ఒక్కసారి మాత్రమే. టీ20ల్లో ఇంతలా అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ షనకకు ఐపీఎల్ మినీ వేలంలో షాక్ తగిలింది. ఏ ఫ్రాంచైజీ కూడా అతడ్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు.