Tirupati: తిరుమలలో దళారులకు చెక్ పెట్టేందుకు టీటీడీ మరో ముందగుడు ..ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అందుబాటులోకి
గదులు అధిక మొత్తంలో విక్రయించడం, భక్తులు దగ్గర నుంచి రీఫండ్ డబ్బులను కాజేయడం వంటి ఘటనలు బయటపడుతుండటంతో... టీటీడీ దళారీ వ్యవస్థను పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకు నూతన టెక్నాలజీని వినియోగించేందుకు ముందడుగు వేసింది.
కలియుగ ప్రత్యక్షదైవంగా వెంకటేశ్వరస్వామిని కొలుస్తారు భక్తులు.. ఆ స్వామివారి సన్నిధిలో అడుగుపెడితే.. ఆధ్యాత్మికత పరిమళిస్తుంది.. దేవ దేవుని లిప్తపాటు దర్శనం కోసం.. నిత్యం భక్త కోటి తరలివచ్చి తరిస్తారు. గోవింద నామ స్మరణతో.. కాలినడకన ఏడు కోండలు ఎక్కి.. స్వామివారిని దర్శించుకుంటే.. కోటిజన్మల పుణ్యఫలమని భావిస్తారు. ఆ ఆపద మొక్కుల వాడికి.. మొక్కుకుంటే సమస్తం మంచే జరుగుతుందని భావిస్తారు భక్తులు. అందుకే.. తిరుమలకు రోజూ.. వేలల్లో, లక్షల్లో భక్తులు వస్తారు. ఇదేక్రమంలో.. తిరుమలలో దళారులకు చెక్ పెట్టేందుకు మరో ముందడుగు వేసింది. అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి వచ్చింది.
తిరుమలలో శ్రీవారి దర్శనాలకు, గదులకు ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు దళారులు నక్కి ఉంటారు. శ్రీవారిపై ఉన్న భక్తిని క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లను గుర్తించి… ఇప్పటికే దళారీ వ్యవస్థను టీటీడీ అరికట్టింది. కానీ.. అప్పుడప్పుడూ దళారులు పట్టుబడుతునే ఉన్నారు. గదులు అధిక మొత్తంలో విక్రయించడం, భక్తులు దగ్గర నుంచి రీఫండ్ డబ్బులను కాజేయడం వంటి ఘటనలు బయటపడుతుండటంతో… టీటీడీ దళారీ వ్యవస్థను పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకు నూతన టెక్నాలజీని వినియోగించేందుకు ముందడుగు వేసింది. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా దళారుల ప్రమేయం లేకుండా… పూర్తిస్థాయిలో భక్తులకు పారదర్శకంగా సేవలందించేందుకు మరో అడుగు ముందుకు వేసింది.
గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా బుధవారం నుంచి తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు కౌంటర్లు, కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల దగ్గర.. ఈ పరిజ్ఞానం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి లడ్డూలు జారీ చేస్తున్నారు. ఈ విధానంతో తిరుమలలో దళారీ వ్యవస్థను పూర్తిస్థాయిలో అరికట్టవచ్చని టీటీడీ భావిస్తోంది. టోకెన్లు లేకుండా సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా లడ్డూ టోకెన్లు జారీ చేస్తారు. దీని ద్వారా లడ్డూ టోకెన్లు దుర్వినియోగం కాకుండా నియంత్రించవచ్చని అధికారులు చెబుతున్నారు. గదుల కేటాయింపులో ఈ విధానం ద్వారా రీఫండ్ లో అవకతవకలు లేకుండా చేయవచ్చని భావిస్తోంది టీటీడీ.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నాలజీ ద్వారా… భక్తులను మోసం చేసే దళారులను నియంత్రించవచ్చని టీటీడీ అధికారులు చెబుతున్నారు. గదుల కేటాయింపులో ఎవరైతే డబ్బులు చెల్లిస్తారో వారే రీఫండ్ పొందే ఏర్పాటు చేయడంతో…. మధ్యలో దళారులు మోసం చేసేందుకు ఆస్కారం ఉండదు.
గతంలో OTP ద్వారా భక్తులు కాషన్ డిపాజిట్ రీఫండ్ పొందేవారు. ఆ విధానం ద్వారా గదుల కోసం దళారులను ఆశ్రయించిన భక్తులు మోసపోయే వారు. భక్తులకు వచ్చిన OTP ని దళారులు తీసుకుని గదులు ఖాళీ చేసి రీఫండ్ డబ్బులను కాజేసేవారు. నూతన విధానం ద్వారా దళారులు భక్తులను మోసం చేసి రీఫండ్ డబ్బులు తీసుకునేందుకు ఆస్కారం ఉండదు. టోకెన్లు లేకుండా సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని ద్వారా ఉచిత లడ్డూ టోకెన్లు దుర్వినియోగంగా కాకుండా అరికట్టవచ్చు. అంతే కాకుండా రీపీటెడ్ గా దర్శనానికి వచ్చేవారిని నియంత్రించవచ్చు. భక్తులు నుండి కళ్లు, ముక్కు, నుదిటి భాగాన్ని ఈ టెక్నాలజీ ద్వారా కాప్చర్ చేస్తారు. దీనివల్ల గదులు పొందిన భక్తులు గుండు చేసుకున్నప్పటికీ ఎలాంటి సమస్యలు తలెత్తవని అధికారులు చెబుతున్నారు. ఈ నూతన విధానంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దళారులకు చెక్ పెట్టేందుకు టీటీడీ టెక్నాలజీని ఉపయోగించుకుని మోసాలను అరికట్టేందుకు ముందుకు రావడం అభినందనీయమని చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..