Srikalahasti Temple: మహాశివరాత్రి పర్వదినం.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన శ్రీకాళహస్తీశ్వరాలయం.. భారీగా తరలివస్తున్న భక్తులు..

Srikalahasti Temple: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయం శోభాయమానంగా ముస్తాబవుతోంది.

Srikalahasti Temple: మహాశివరాత్రి పర్వదినం.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన శ్రీకాళహస్తీశ్వరాలయం.. భారీగా తరలివస్తున్న భక్తులు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 10, 2021 | 7:25 PM

Srikalahasti Temple: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయం శోభాయమానంగా ముస్తాబవుతోంది. ఆలయ అధికారులు వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని సుందరీకరించారు. మిరుమిట్లు గొలిపే దీపకాంతులతో శ్రీకాళహస్తీశ్వరుని ఆలయం తళుక్కుమంటోంది. ఎటువైపు చూసినా విద్యుత్ కాంతుల వెలుగు మధ్య రంగు రంగుల పులు కలకలలాడుతున్నాయి. ఆలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అధికారు. ఇక మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో ఈ పుణ్యక్షేత్రానికి తరలి వస్తున్నారు. దాంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

ఇదిలాఉంటే.. శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అఖండమైన జ్ఞానానికి ప్రతీకైన హంసను వాహనంగా చేసుకుని సకల కళలకు అధిపతి అయిన పరమేశ్వరుడు భక్తులకు దర్శనం ఇవ్వగా, జ్ఞానశక్తి అయిన అమ్మవారు చిలుక వాహనంపై కొలువుదీరి భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. దీనికి ముందు ఆలయంలోని అలంకార మండపములో స్వామి అమ్మవార్లకు ఆశీనులుగావించి ఆలయ వేదపండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ధూపదీప కర్పూర హారతులతో నీరాజనాలు పట్టారు. మంగళవాయిద్యాలు నడుమ క్షేత్ర వీధుల్లో ఊరేగించారు. చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, విన్యాసాల నడుమ ఊరేగింపు కొనసాగింది. హంసలోని సద్గుణమైన పాలను స్వీకరించి నీళ్లను విడిచిపెట్టినట్లు.. హంసవాహనాధీశుడిని దర్శించుకున్న వారు కష్టాల నుంచి విముక్తి పొంది శాంతికలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. దీంతో భక్తులు చతుర్ముఖ మాడవీధుల్లో స్వామివారిని దర్శించుకుని, కర్పూర నీరాజనాలు భక్తిపూర్వకంగా సమర్పించుకుని, స్వామి అమ్మవార్ల దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని పునీతులయ్యారు.

ఇక ఈ కార్యక్రమానికి ముందు.. శ్రీకాళహస్తి క్షేత్రంలో గంధర్వరాత్రి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ అలంకార మండపంలో అర్చక, వేద పండితులు.. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించి.. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ మహామంగళహారతి ఇచ్చి స్వామి, అమ్మ వార్లను చతుర్ముఖ మాడవీధుల్లో ఊరేగింపుగా రావణ, మయూర వాహనాల సేవ నిర్వహించారు. భక్తాగ్రేసరుడైన రావణ వాహనంపై, శ్రీకాళహస్తీశ్వర స్వామి, మయూర వాహనంపై జ్ఞానప్రసూనాంబ పుర విహారం చేశారు. విద్యుత్ దీపాల కాంతిలో జరిగిన ఊరేగింపులో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్ల దివ్య మంగళ రూపాన్ని దర్శించకున్నారు.

Also read:

Mamata Banerjee Injured: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై దాడి.. గాయాలు.. నందిగ్రామ్‌లో ఉద్రిక్తత

MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో వింత ధోరణి.. ఒకటి కాకపోతే రెండివ్వాలంటున్న అభ్యర్థులు