Namibian Cheetah: నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో ఒకటి మృతి.. మిగతా ఏడింటికీ..!
స్థానిక వైద్యులతోపాటు నమీబియా, దక్షిణాఫ్రికాలకు చెందిన నిపుణులు నిత్యం వైద్యసేవలు అందించారు. కానీ, ఫలితం లేకపోయింది. చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి సోమవారం మరణించినట్టుగా అధికారులు ప్రకటించారు.
గతేడాది సెప్టెంబర్ నెలలో నమీబియా నుంచి భారత్‌కు తరలించిన ఎనిమిది చిరుతల్లో ఒకటి మృత్యువాతపడింది. జనవరిలో కిడ్నీ ఇన్ఫెక్షన్ బారినపడ్డ సాశా అనే చిరుత అప్పటి నుంచి అస్వస్థతతో బాధపడుతూ సోమవారం మరణించింది. జనవరి 22న సాశా అస్వస్థతతో కనిపించింది. దీంతో ఆరోగ్య పరీక్షల నిమిత్తం క్వారంటైన్లోకి తరలించారు అధికారులు. రక్తపరీక్షలతోపాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో ఆ చీతాకు మూత్రపిండాల సమస్య ఉన్నట్లు తేలింది. దాని ఆరోగ్య చరిత్రను పూర్తిస్థాయిలో విశ్లేషించగా.. భారత్‌కు తీసుకొచ్చే ముందే ఈ సమస్య ఉన్నట్లు తేలింది. స్థానిక వైద్యులతోపాటు నమీబియా, దక్షిణాఫ్రికాలకు చెందిన నిపుణులు నిత్యం వైద్యసేవలు అందించారు. కానీ, ఫలితం లేకపోయింది. చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి సోమవారం మరణించినట్టుగా అధికారులు ప్రకటించారు.
నమీబియా నుంచి 4- 6 ఏళ్ల వయసున్న ఐదు ఆడ, మూడు మగ.. మొత్తం ఎనిమిది చీతాలను భారత్‌కు తీసుకువచ్చారు. మిగతా ఏడు చీతాల్లో .. మూడు మగ, ఒక ఆడ చీత ప్రస్తుతం కునో జాతీయ పార్కులో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. మిగతా ఏడు చీతాలు ఆరోగ్యంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.. వేట కొనసాగిస్తున్నాయని చెప్పారు. దీంతోపాటు ఇటీవల దక్షిణాఫ్రికానుంచి తీసుకొచ్చిన 12 చీతాలు ప్రస్తుతం క్వారంటైన్లో ఆరోగ్యంగా ఉన్నాయని కునో జాతీయ పార్కు అధికారులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..