9 Years of Modi Government: నవశకానికి ‘నవ’ వసంతాలు.. దేశ సేవలో 9 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు కృతజ్ఞతతో..

నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ తర్వాత సుదీర్ఘకాలం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాయకుడిగా నరేంద్ర మోదీ పేరు చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ప్రధానిగా మోదీ తొమ్మిదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. సేవా, సుపరిపాలన, సంక్షేమం అజెండాగా సాగింది ఈ తొమ్మిది సంవత్సరాల పరిపాలన అంటోంది బీజేపీ.

9 Years of Modi Government: నవశకానికి 'నవ' వసంతాలు.. దేశ సేవలో 9 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు కృతజ్ఞతతో..
9 Years Of Modi Government
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 01, 2023 | 4:21 PM

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. దేశ సేవలో 9 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు కృతజ్ఞతతో తన మనస్సు నిండిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. తీసుకున్న ప్రతీ నిర్ణయం, చేపట్టిన ప్రతీ చర్య ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ఉద్దేశించినవేనని ట్వీట్‌లో పేర్కొన్నారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు మరింత శ్రమిస్తామని ఈ సందర్భంగా ప్రధాని ప్రకటించారు. 2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పేదలు, సామాన్యులకు పాలనను మరింత చేరువ చేశారు.

పట్టణ ప్రాంతాల్లోని అల్పాదాయ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి గడిచిన తొమ్మిదేళ్లుగా మోదీ సర్కారు అనేక చర్యలు చేపట్టింది. నగర్లాల్లో ఆ వర్గాలు సౌకర్యవంతంగా జీవించేందుకు 2015లో ప్రధాన్‌ మంత్రి అవాస్‌ యోజనను ప్రారంభించింది. గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 2004 నుంచి 2014 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 8 లక్షల 4 వేల ఇళ్ల నిర్మాణం పూర్తికాగా, 2015 నుంచి మే 24, 2023 నాటికి 74 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తైంది. అంతే కాదు కేంద్రం అందించే సాయాన్ని కూడా మోదీ సర్కారు గణనీయంగా పెంచింది.

అత్యంత పేదల కోసం..

ఏ ఒక్కరూ ఆకలితో నిద్రపోకూడదనే సదాశయంతో పనిచేస్తున్న మోదీ సర్కారు ప్రజలకు ఆహార ధాన్యాలతో పాటు పోషకాలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆహార భద్రతా చట్టం, ఇతర సంక్షేమ పథకాలతో పాటు అత్యంత పేదల కోసం ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం కింద రాష్ట్రాలకు కేంద్ర సబ్సిడీ ఆహార ధాన్యాలు సరఫరా చేస్తోంది. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో ఆహార సబ్సిడీ కింద రాష్ట్రాలకు 4.04 లక్షలు కోట్లు, FCIకి 14.48 లక్షల కోట్లు విడుదల చేసింది. అంతే కాదు ఆహార భద్రతా చట్టం కింద ఈ ఏడాది మొత్తం సుమారు 80 కోట్ల మందికి రేషన్‌ ద్వారా ఉచితంగా ఆహారధాన్యాలు సరఫరా చేస్తోంది.

గత తొమ్మిది సంవత్సరాల్లో కొత్తగా..

ఎల్‌పీజీ వినియోగంలో విప్లవం సృష్టించిన ఉజ్వల యోజన. గడిచిన తొమ్మిదేళ్లలో LPG వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మోదీ పాలనలో గత తొమ్మిది సంవత్సరాల్లో కొత్తగా 17 కోట్ల మంది LPG వినియోగదారులు చేర్చారు. ఏప్రిల్‌ 2014లో దేశంలో LPG వినియోగిస్తున్న వారి సంఖ్య 14.52 కోట్లు కాగా ఈ మార్చి నాటికి ఈ సంఖ్య 31.36 కోట్లకు పెరిగింది. ప్రధాన మంత్రి ఉజ్వల్‌ యోజన కారణంగా భారీ పెరుగుదల నమోదైంది.

బాలింతల విషయంలో మోదీ సర్కారు..

మహిళల ఆరోగ్యం ముఖ్యంగా బాలింతల విషయంలో మోదీ సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. మహిళా సాధికారతలో భాగంగా చేపట్టిన చర్యలతో గర్భిణుల మరణ నిష్పత్తి గణనీయంగా తగ్గింది. అన్ని వర్గాలు ముఖ్యంగా పేదలకు నాణ్యమైన ఔషధాలు సరసరమైన ధరల్లో అందుబాటులో ఉండేలా చూసేందుకు కేంద్ర సర్కారు ఎన్నో చర్యలు చేపట్టింది. ఆయుష్మాన్‌ భారత్‌ యోజనను ఈ దిశగా చేపట్టిన కీలక చర్యల్లో అగ్రగామిగా చెప్పుకోవచ్చు.

దేశవ్యాప్తంగా కొత్తగా అనేక IITలు, IIMలు..

విద్యా రంగంలోనూ ఈ తొమ్మిదేళ్ల కాలంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. యువతకు విద్యా మార్గాలు విస్తృతం చేసేందుకు దేశవ్యాప్తంగా కొత్తగా అనేక IITలు, IIMలు, విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. 2014లో 723 విశ్వవిద్యాలయాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 1113 కి పెరిగింది. అంతే కాదు కాలేజీలు కూడా బాగా విస్తరించాయి. 2014లో దేశంలో 38498 కాలేజీలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 43796కు పెరిగింది. మొత్తం విశ్వవిద్యాలయాల్లో 43 శాతం, కాలేజీల్లో 61.4 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయడం విశేషం. విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో మోదీ సర్కారు దేశవ్యాప్తంగా కొత్తగా 7 ఐఐటీలు, 7 ఐఐఎంలు ఏర్పాటు చేసింది.

అన్ని దారులు కలుపుతూ..

ప్రపంచంలోనే రెండో అతి పెద్ద రోడ్‌ నెట్‌వర్క్‌ ఇండియాలో ఉంది. దేశంలో మొత్తం 63.73 లక్షల కిలోమీటర్ల రోడ్‌ నెట్‌వర్క్‌ ఉంది. దేశ ప్రగతిలో జాతీయ రహదారులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల సామర్ధ్యం పెంచేందుకు మోదీ ప్రభుత్వం గడిచిన 9 ఏళ్లుగా అనేక చర్యలు చేపట్టింది. 2014లో రోజుకు సగటున 12 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరగగా, 2022 నాటికి ఇది 29 కిలోమీటర్ల మేరకు పెరిగింది.

డిజిటల్‌ ఇండియా పేరుతో..

మోదీ సర్కారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయాల్లో ఒకటి డిజిటైజేషన్‌. డిజిటల్‌ ఇండియా పేరుతో బృహత్‌ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో దేశంలో డిజిటల్‌, యూపీఐ లావాదేవీలు గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో విపరీతంగా పెరిగాయి.

ప్రపంచంలో మూడో స్థానంలోకి భారత్..

సంక్షేమ పథంలోనే కాదు టెక్నాలజీ వినియోగంలోనూ మోదీ సర్కారు అగ్రగామిగా నిలుస్తోంది. ఆలోచన నుంచి ఆవిష్కరణ వరకు అన్ని విధాలా చేయూత లభిస్తుండటంతో దేశంలో స్టార్టప్‌ వాతావరణం పరిఢవిల్లుతోంది. స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌పరంగా ప్రపంచంలో మూడో స్థానంలో భారత్‌ నిలుస్తోంది. స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు చేపట్టిన స్టార్టప్‌ ఇండియా ప్రోగ్రామ్‌తో దేశంలో స్టార్టప్‌ యూనిట్స్‌లో 225 శాతం పెరుగుదల నమోదైంది.

9 కోట్ల ఉద్యోగ కల్పన..

2016లో దేశంలో 442 స్టార్టప్స్‌ మాత్రమే ఉండేవి. మే 14, 2023 నాటికి ఈ సంఖ్య 99,371 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలోని ప్రతీ రాష్ట్రం, ప్రతీ కేంద్ర పాలిత ప్రాంతంలో కనీసం ఒక్క స్టార్టప్‌ అయినా పనిచేస్తుందంటే అతిశయోక్తి కాదు. భారత్‌లో ప్రస్తుతం 100కు పైగా యూనికార్న్స్‌ పనిచేస్తున్నాయి. వీటి ద్వారా దాదాపు 9 కోట్ల ఉద్యోగ కల్పన జరిగింది.

ఇప్పుడు భారత్ మాట వింటున్నాయి..

తొమ్మిదేళ్ల పాలన పూర్తైన సందర్భంగా కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా మోదీ పాలనపై మాట్లాడారు. సంక్షేమంతో అభివృద్ధి అన్నది మోదీ మార్క్‌ పాలిటిక్స్‌ అని BJP ఎంపీ GVL నరసింహారావు అన్నారు. ప్రధాని మోదీలాంటి నాయకులు నభూతో, నభవిష్యత్‌ అని బీజేపీ నేత TG వెంకటేశ్‌ అన్నారు. ప్రధాని మోదీ ఈ తొమ్మిదేళ్ల పాలనకు అంతకు ముందు పాలనకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని తెలిపారు. ప్రపంచాన్ని శాసించే ఐదు అగ్రదేశాలు ఇప్పుడు భారత్‌ మాట వింటున్నాయంటే దానికి కారణం ప్రధాని మోదీ అని వెంకటేశ్‌ అన్నారు.

మోదీ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయలు, కొవిడ్‌ నిర్వహణ, ఉచిత ఇల్లు, టాయిలెట్ల నుంచి అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ ప్రతిష్ఠ పెరిగేలా చేపట్టిన ప్రతీ చర్య, ప్రతీ నిర్ణయాన్ని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ప్రస్తావించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం