అమృత్‌పాల్‌ ఎక్కడ?.. ఇండియాలోనే ఉన్నాడా? విదేశాలకు పారిపోయాడా?.. వెలుగులోకి సంచలనాలు!

Amritpal Singh: ఒకే ఒక్కడిని పట్టుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది పంజాబ్‌ పోలీస్ డిపార్ట్‌మెంట్. చివరికి బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ని ఆశ్రయించాల్సి వచ్చింది.

అమృత్‌పాల్‌ ఎక్కడ?.. ఇండియాలోనే ఉన్నాడా? విదేశాలకు పారిపోయాడా?.. వెలుగులోకి సంచలనాలు!
Amritpal Singh
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 24, 2023 | 11:30 AM

ఒకే ఒక్కడిని పట్టుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది పంజాబ్‌ పోలీస్ డిపార్ట్‌మెంట్. చివరికి బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ని ఆశ్రయించాల్సి వచ్చింది. అయినా కూడా అమృత్‌పాల్‌ జాడ కనిపెట్టలేకపోయారు పోలీసులు. ఇంతకీ, అమృత్‌పాల్‌ ఇండియాలోనే ఉన్నాడా? లేక విదేశాలకు చెక్కేశాడా?. క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీని తలపిస్తోంది ఆపరేషన్‌ అమృత్‌పాల్‌.

అమృత్‌పాల్‌సింగ్‌, ఈ పేరు ఇప్పుడు దేశంలో మారుమోగిపోతోంది. ఏడ్రోజులుగా పంజాబ్‌ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు అమృత్‌పాల్‌. సినీ స్టైల్లో తప్పించుకుంటూ ఖాకీలకే సవాలు విసురుతున్నాడు. ఎప్పటికప్పుడు వేషాలు మారుస్తూ పోలీసులకే చుక్కలు చూపిస్తున్నాడు. ఒకే ఒక్కడిని పట్టుకునేందుకు 8 రాష్ట్రాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు పోలీసులు. అమృత్‌పాల్‌ మాత్రం పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు. దాంతో, అతడ్ని పట్టుకోవడం పోలీసులకు పెద్దసవాలుగా మారింది.

ఈనెల 19నుంచి 21వరకు అమృత్‌పాల్‌ ఎక్కడున్నాడో, ఎవరి దగ్గర ఆశ్రయం పొందాడో కనిపెట్టారు పోలీసులు. హర్యానా కురుక్షేత్రలో ఓ మహిళ… అతనికి షెల్టర్‌ ఇచ్చినట్టు గుర్తించి ఆమెను అరెస్ట్‌ చేశారు. అలాగే, అమృత్‌పాల్‌ బాడీగార్డ్స్‌ తేజిందర్‌సింగ్‌, గోర్కా బాబాను అదుపులోకి తీసుకున్నారు. అమృత్‌పాల్‌కు సహకరించిన ప్రతి ఒక్కర్నీ అరెస్ట్‌ చేస్తోన్న పోలీసులు… అతని భార్య కిరణ్‌దీప్‌కౌర్‌, ఆమె కుటుంబసభ్యులపైనా నిఘా పెట్టారు.

అమృత్‌పాల్‌ పంజాబ్‌ నుంచి హర్యానాలోకి ఎంటరైనట్లు గుర్తించారు పోలీసులు. ఎక్కడికక్కడ సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించిన పోలీసులు… అమృత్‌పాల్‌ మార్చిన వేషాలు, ప్రయాణించిన కార్లు, బైక్ ఫొటోలు, వీడియోలను రిలీజ్‌ చేశారు. ఇదిలావుంటే అమృత్‌పాల్‌ తన ముఖం కనిపించకుండా గొడుగు అడ్డంపెట్టుకుని పారిపోతున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విదేశీ నిధులు, ఫండింగ్‌పై సమాచారం సేకరించారు పోలీసులు. అయితే, అమృత్‌పాల్‌కు కరుడుగట్టిన నేరగాళ్లతో సంబంధాలున్నట్టు తేలింది. డ్రగ్‌ మాఫియాతోపాటు పాకిస్తాన్‌ ఐఎస్‌ఐతోనూ లింకులున్నట్లు తెలిసింది. ఐఎస్‌ఐ సహకారంతోనే పెద్దఎత్తున ఆయుధాలు, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు సమకూర్చుకున్నట్లు గుర్తించారు. వీటితోపాటు మరో కోణం కూడా బయటపడింది. చాలామంది అమ్మాయిలను అమృత్‌పాల్‌ ట్రాప్‌ చేసినట్టు దర్యాప్తులో తేలింది.

ఏడు రోజులుగా గాలిస్తున్నా అమృత్‌పాల్‌ను పట్టుకోలేకపోయారు పోలీసులు. దాంతో, అమృత్‌పాల్‌ అసలు ఇండియాలోనే ఉన్నాడా? లేక విదేశాలకు పారిపోయాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. పాకిస్తాన్‌ లేదా నేపాల్‌ పారిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. అమృత్‌పాల్‌ ఎక్కడున్నాడో తెలియకపోవడంతో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ను అప్రమత్తం చేసింది కేంద్రం. ముఖ్యంగా నేపాల్‌ సరిహద్దుల్లో నిఘా పెంచింది భద్రతా సిబ్బంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..