Electric Trains: ఇకపై సికింద్రాబాద్ టూ బెంగళూరు విద్యుత్ రైళ్లే.! ఆ మార్గంలో జెట్ స్పీడ్‌తో రయ్.. రయ్..
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై సికింద్రాబాద్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరు వరకు విద్యుత్ రైళ్లు నడిచే అవకాశం ఉంది..
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై సికింద్రాబాద్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరు వరకు విద్యుత్ రైళ్లు నడిచే అవకాశం ఉంది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న గద్వాల్ – కర్నూలు సిటీ మధ్య 54 రూట్ కిమీ మార్గం విద్యుదీకరణ పనులు పూర్తయి.. ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ నుంచి ధర్మవరం వరకు.. అలాగే నైరుతి రైల్వే పరిధిలోని ధర్మవరం నుంచి బెంగళూరు వరకు అంతరాయం లేకుండా విద్యుత్ ట్రాక్షన్ ద్వారా రైళ్లను నడిపేందుకు వీలు కలిగింది.
గద్వాల్ – కర్నూలు సిటీ స్టేషన్ల మధ్య విద్యుదీకరణ, డోన్ – కర్నూలు సిటీ – మహబూబ్‌నగర్ విద్యుదీకరణ, సికింద్రాబాద్ – ముద్ఖేడ్ – మన్మాడ్ విద్యుదీకరణ పనులు గ్రాండ్ ప్రాజెక్ట్‌లో భాగంగా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌ను 2018-19 సంవత్సరంలో రూ. 916.07 కోట్ల సవరించిన అంచనా వ్యయంతో చేపట్టింది. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని డోన్ – గుత్తి – ధర్మవరం, నైరుతి రైల్వే పరిధిలోని ధర్మవరం – బెంగళూరు సిటీ విభాగాల మధ్య విద్యుదీకరణ కూడా పూర్తయింది. దీంతో, ప్యాసింజర్, సరకు రవాణా రైళ్లు రెండూ సికింద్రాబాద్ నుంచి ధర్మవరం.. ధర్మవరం నుంచి బెంగళూరు మీదుగా సజావుగా ప్రయాణించేందుకు వీలుంటుంది.
ఈ ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌తో రైళ్ల రాకపోకల నిర్వహణ వల్ల కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది, తద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది. ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌తో ఇంజిన్ మార్చడం లాంటివి ఇకపై ఉండదు కాబట్టి.. రైళ్లను మార్గం మధ్యలో నిలిపే సమయం తగ్గుతుంది, అలాగే రైళ్ల సగటు వేగం పెరుగుతుంది. విద్యుదీరణ వల్ల రైల్వేలకు ఇంధన ఖర్చులు కూడా పెద్ద ఎత్తున ఆదా అవుతాయి. కాగా, ‘విద్యుద్దీకరణ పనులను పూర్తి చేయడంలో అద్భుతమైన పనితీరును కనబరిచిన ఎలక్ట్రికల్ వింగ్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. గద్వాల్-కర్నూలు మధ్య మార్గంలో విద్యుదీకరణ పూర్తవడంతో, సికింద్రాబాద్-బెంగళూరు మధ్య మొత్తం సెక్షన్‌లో ఎలక్ట్రిక్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.