Andhra Pradesh: పాపం.. అదే లాస్ట్ ఫొటో.. స్నేహితులతో కేరింతలు కొడుతుండగా చుట్టేసిన రాకాసి అల.. క్షణాల్లోనే
వాళ్లంతా దగ్గర బంధువులు.. వివిధ ప్రాంతాల్లోని నివాసం ఉంటున్నారు. చిన్నప్పటినుంచి అంతా కలిసిమెలిసి తిరిగారు. కాస్త పెద్దయ్యాక వేరు వేరు చోట్ల ఉన్నప్పటికీ.. అవకాశం ఉన్నప్పుడల్లా కలిసి సరదాగా వేరే ప్రాంతాలకు వెళ్లి అక్కడ గడుపుతుంటారు. ఇలాగే సెలవు రోజు కావడంతో ఏడుగురు యువతీ యువకులు అందరూ ఒక చోట చేరారు. విశాఖ నుంచి అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సీతపాలెం
అనకాపల్లి, ఆగస్టు 21: వాళ్లంతా దగ్గర బంధువులు.. వివిధ ప్రాంతాల్లోని నివాసం ఉంటున్నారు. చిన్నప్పటినుంచి అంతా కలిసిమెలిసి తిరిగారు. కాస్త పెద్దయ్యాక వేరు వేరు చోట్ల ఉన్నప్పటికీ.. అవకాశం ఉన్నప్పుడల్లా కలిసి సరదాగా వేరే ప్రాంతాలకు వెళ్లి అక్కడ గడుపుతుంటారు. ఇలాగే సెలవు రోజు కావడంతో ఏడుగురు యువతీ యువకులు అందరూ ఒక చోట చేరారు. విశాఖ నుంచి అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సీతపాలెం బీచ్‌కు వెళ్లారు. సరదాగా గడిపారు. ఫోటోలు తీసుకున్నారు. గ్రూప్ ఫోటోలతో సందడి చేశారు. కెరటాల్లో జలకాలాడారు. ఆనందంలో మునిగిదేలారు. ఒకవైపు గ్రూప్ ఫోటోలు.. అవకాశం ఉన్నప్పుడు ఎవరికి వారు సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇంతలో ఓ బలమైన కెరటం లేచి ఒక్కసారిగా ఎగసిపడింది. అందరూ నీట మునిగారు. ఐదుగురు క్షేమంగా బయటపడ్డారు. ఓ యువతీ యువకుడు లోతుగా ఉన్న నీటిలో పడిపోయారు. అందులో ఓ యువతని మిగతా ఐదుగురు కాపాడగలిగారు. కానీ మరో యువకుడు మరింత లోతులోకి వెళ్లిపోయాడు.. దీంతో అందరూ కళ్ళముందే కొట్టుకుపోయిన స్నేహితుడిని కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. సముద్ర ఒడ్డున జరిగిన ఈ విషాదం ఆనందంగా ఉండే క్షణాల్లో ఆ స్నేహితుల మధ్య తీరని శోకాన్ని మిగిల్చింది.
విశాఖకు చెందిన బంధువుల కుటుంబాలకు చెందిన వారంతా వేరువేరు చోట్ల స్థిరపడ్డారు. వారిలో సాయికుమార్, వెంకట సాయి ప్రియాంక, సాయికిరణ్, ఫణీంద్ర, రవిశంకర్, కావ్య, చైతన్య యువతి యువకులంతా ఒక్కచోట చేరారు. ఆదివారం సెలవు దినం కావడంతో విహారానికి బయలుదేరారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీత పాలెం బీచ్ కు బయలుదేరారు. అక్కడకు చేరుకున్న తర్వాత సరదాగా మునిగితేలారు. అందరూ ఒకే కుటుంబానికి చెందిన ఒక వారు కావడం.. ఒకే చోట చేరడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సరదాగా బీచ్ అందాలను ఆస్వాదిస్తూ కెరటాలలో జలకాలాడుతూ ఫోటోలు తీసుకుంటూ గడిపారు. రాక్స్ పై నిల్చుని గ్రూప్ ఫోటోలో కూడా దిగారు.
రెప్పపాటులో కబళించిన కెరటం..
ఏడుగురు యువతీ యువకులు.. సరదాల్లో మునిగి తెలుతున్న సమయంలో ఓ భారీ కెరటం ఎగసి పడింది. దీంతో వేరువేరుగా సెల్ఫీలు తీసుకుంటున్న వారంతా.. ఆ కెరటం ధాటికి నీటిలో మునిగిపోయారు. ఐదుగురు ఒకవైపు మరో ఇద్దరూ మరోవైపు నీటిలో మునిగిపోయారు. వెంటనే కోలుకున్న ఐదుగురు సేఫ్ గా బయటపడ్డారు. అదే సమయంలో మునిగిపోతున్న ప్రియాంక అనే యువతిని రక్షించారు. అయితే, అప్పటికే సాయిరాం కనిపించకుండా పోయాడు. అలల్లో కొట్టుకుపోయాడు. తీవ్ర అస్వస్థతకు గురైన సాయి ప్రియాంకను హుటాహుటిన అనకాపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
కొంత దూరానికి సాయిరాం మృతదేహం..
కెరటాల్లో మునిగి కొట్టుకుపోయిన సాయిరాం.. కొంతసేపటి తర్వాత ఒడ్డుకు కొట్టుకొచ్చాడు. విగత జీవిగా మారాడు. ఘటన స్థలానికి కొంత దూరంలో సాయిరాం మృతదేహం కొట్టుకొచ్చింది. దీంతో స్నేహితులు అంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సాయిరాం గీతం యూనివర్సిటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా ప్రాణాలకు కోల్పోవడంతో.. ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
అదొక ప్రమాదకర ప్రాంతం..
అందమైన బీచ్.. కవ్వించే కెరటాలు.. ఫోటోలు తీసుకునేందుకు అనువైన ప్రాంతం.. దీంతో చాలామంది ఈ ప్రాంతానికి విహారానికి వెళుతుంటారు. ఆ బీచ్ కోసం స్నేహితుల ద్వారా తెలుసుకొని మరి ప్రత్యేకంగా ట్రిప్స్ వేసుకుంటారు. సాధారణంగా అందంగా ఉండే ప్రాంతం కావడంతో పర్యాటకులు కూడా సీతాఫలం కు వస్తూ ఉంటారు. కానీ ఎంత ఆహ్లాదంగా కనిపిస్తుందో.. అంతే ప్రమాదకరమని అంటున్నారు స్థానికులు. ఎందుకంటే అక్కడ ఉన్న రాళ్లకు.. ఒక్కసారిగా భారీగా కెరటాలు కొడుతూ ఉంటాయి. దీంతో సముద్రపు నీరు ఎగసే పడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆ దృశ్యాలు ఫొటోలల్లో బంధించేందుకు అందంగా ఉన్నప్పటికీ.. అవే కెరటాలు కాస్త పెద్దగా మారి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తోడేస్తున్నాయి. సరదాల్లో ఫోటోలతో మునిగిపోయే సందర్శకులు.. ఆ విషయాన్ని గుర్తించేలోపే సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలోనూ అక్కడ అనేక ప్రమాదాలు జరిగాయని అంటున్నారు స్థానికులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..