YS Jagan: అమరావతిలో ఇవాళే ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ.. సీఎం జగన్ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు..
అమరావతిలో పట్టాల జాతరకు అంతా రెడీ అయింది. ఏపీలోని దారులన్నీ ఛలో అమరావతి అంటున్నాయి. రాజధాని ప్రాంతంలో తొలి సారి జరుగుతున్న సీఎం జగన్ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు వైసీపీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. ఈ సభ వైసీపీ వర్సెస్ టీడీపీగా మారడంతో.. ముందస్తు అరెస్టులు.. నిషేధాజ్ఞలతో తుళ్లూరు హైటెన్షన్‌గా మారింది.
YS Jagan Public Meeting: అమరావతిలో ఒక వైపు పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేయగా.. మరో వైపు ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇలా.. ఇవాళ R-5 జోన్‌లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి కౌంట్‌డౌన్ మొదలయింది. ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావించి నిర్వహిస్తున్న కీలక ఘట్టం ఇది. వెంకటపాలెంలో సీఎం జగన్ భారీ బహిరంగసభ కూడా ఉంది. జగన్ చేతుల మీదుగా 50వేలమందికి పైగా లబ్దిదారులు పట్టాలు అందుకుంటారు. అమరావతిలో సీఎం హోదాలో జగన్ పాల్గొంటున్న తొలి సభ కూడా ఇదే కావడం.. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. లబ్దిదారుల కుటుంబాలతో పాటు వాళ్ల బంధువులు కూడా సభకు తరలించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే ఛాన్స్ ఉంది. దాదాపు 14వందల ఎకరాల్లో.. 51 వేల 392 మంది కోసం మొత్తం 25 లేఔట్లు సిద్ధమయ్యాయి. పట్టాల పంపిణీ పూర్తి కాగానే.. ఇళ్ల నిర్మాణం జరిగేలా సీఆర్‌డీఏ ఏర్పాట్లు పూర్తి చేసింది.
ప్రభుత్వం ప్రకటించిన ఈ స్కీమ్‌ని మొదటి నుంచి రాజధాని రైతులు వ్యతిరేకిస్తున్నారు. కోర్టు కేసులు సైతం నడుస్తున్నాయి. ఫైనల్‌గా కోర్టు అనుమతితో ఈ కార్యక్రమం పట్టాలెక్కుతుంది. రైతులు చేస్తున్న గొడవలను టీడీపీ చేయిస్తుందని మంత్రులు ఆరోపిస్తున్నారు. ఇది పేదలకు, పెత్తందార్లకు మధ్య క్లాస్ వార్ అని జగన్ చెప్పడంతో.. వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది వ్యవహారం. మహిళా పెత్తందార్లను పెట్టి పట్టాల పంపిణీని అడ్డుకోడానికి చంద్రబాబు ప్లాన్ చేశారని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు.
చంద్రబాబు అమరావతిలో డబ్బులు ఇచ్చి ఉద్యమాలు చేస్తున్నాడని మండిపడ్డారు మంత్రి మెరుగు నాగార్జున. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం బాబుకు ఇష్టం లేదన్నారు. అటు.. ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకొని తీరుతామని రైతులు ప్రకటించారు. ముందస్తు అరెస్టులు కూడా మొదలయ్యాయి. ఇలా అరెస్టులు, నిరసనల పిలుపుతో తుళ్లూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..