Caravan Tourism: విహారం మరింత ఆహ్లాదం.. అరకులో కారవాన్ టూరిజం.. మీరూ రెడీనా..
Caravan tourism in AP: సెగ్మెంట్ టూరిస్టులు ఇక్కడకు రావడానికి ఆసక్తి ప్రదర్శించడం లేదని పర్యాటక శాఖ గుర్తించింది. కేరళ, కర్ణాటక వెళ్ళేందుకు ఎందుకు మొగ్గు చూపుతున్నారో అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా కొత్త ప్యాకేజ్ లు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా విదేశాల్లో బాగా పాపులర్ అయిన కారవాన్ టూరిజం అమలుకు సన్నాహాలు చేస్తోంది. కేరళలో ఇటీవల దీనిని ప్రారంభించారు.ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో కారవాన్‌లోనే వంట చేసుకుని, అందులోనే రాత్రి బస చేసే అవకాశం కలుగుతుంది. ట్రాన్స్ పోర్ట్, వ్యుపాయింట్ దగ్గర స్టే వంటి సౌకర్యం ఏపీ టూరిజం ఏర్పాటు చేస్తోంది.
విశాఖపట్నం, ఆగస్టు 18: ప్రకృతి పరవశానికి మారుపేరు తూర్పు కనుమలు. ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం, పచ్చ తివారీ పరిచినట్టు కొండల మధ్యలో మైదానం, స్వచ్ఛమైన గాలి, వాగులు, వంకలు, సెలయేళ్లు … వర్ణనలకు అందని అందం ఇక్కడ కనిపిస్తుంది. విదేశాలతో పోటీపడే వ్యూపాయింట్స్, సీజన్లో సింగిల్ డిజిట్ టెంపచేర్స్ నమోదయ్యే హిల్ స్టేషన్లు లాంటి ప్రకృతి అందాలు ఎన్నో అల్లూరి సీతారామరాజు జిల్లాలో చాలానే ఉన్నాయి. మారేడుమిల్లి, లంబసింగి, వంజంగి, అరకు, మాడగడ వంటి టూరిజం డెస్టినేషన్స్ సీజన్లో రద్దీగా మారుతున్నాయి. ప్రతీ ఏటా తెలుగు రాష్ట్రాలే కాదు తమిళనాడు, ఒడిషా, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా ఉంటోంది. ఐతే, పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు, సుదూర, మారుమూల ప్రాంతాల్లో కూడా వసతి సదుపాయాలను కల్పించే పరిస్థితులు లేవు.
దీంతో అన్ని సెగ్మెంట్ టూరిస్టులు ఇక్కడకు రావడానికి ఆసక్తి ప్రదర్శించడం లేదని పర్యాటక శాఖ గుర్తించింది. కేరళ, కర్ణాటక వెళ్ళేందుకు ఎందుకు మొగ్గు చూపుతున్నారో అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా కొత్త ప్యాకేజ్ లు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా విదేశాల్లో బాగా పాపులర్ అయిన కారవాన్ టూరిజం అమలుకు సన్నాహాలు చేస్తోంది. కేరళలో ఇటీవల దీనిని ప్రారంభించారు.ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో కారవాన్‌లోనే వంట చేసుకుని, అందులోనే రాత్రి బస చేసే అవకాశం కలుగుతుంది. ట్రాన్స్ పోర్ట్, వ్యుపాయింట్ దగ్గర స్టే వంటి సౌకర్యం ఏపీ టూరిజం ఏర్పాటు చేస్తోంది. ఒక్కో కారవాన్ ఖరీదు 25లక్షల వరకు అంచనా వేస్తుండగా, ప్రయివేట్ ఆపరేటర్లను ఆహ్వానించింది. డిమాండ్ ఆధారంగా పర్యాటక శాఖ కారవాన్ లు కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.
రాష్ట్ర వ్యాప్తంగా 15 ప్రాంతాల్లో కారావాన్ టూరిజం
సీజన్ లో వెకేషన్ కు వెళ్ళినప్పుడు హోటల్ రూమ్స్ కోసం వెయిటింగ్. రెస్టారెంట్‌లో ఫుడ్ ఎలా ఉంటుందోనన్న సందేహాలు. వ్యక్తిగత ప్రైవసీపై అనుమానాలు… ఇలా ప్రతి సగటు పర్యాటకుడికీ ఎదురయ్యే అనుభవాలకు ఇక చెప్పేందుకు ఆంధ్ర ప్రదేశ్ టూరిజం సిద్ధమవుతోంది. ఆ ప్రత్యామ్నాయమే కారవాన్ టూరిజం. దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్న కారావాన్ టూరిజం వైపు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకుల ఆదరణ ఉన్న మొత్తం 15 ప్రాంతాల్లో ఈ కారావాన్ టూరిజం కోసం ప్రణాళికలు చేస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ఈ 15 లో ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు ప్రాంతాలను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. మూడు రకాల కారవాన్ టూరిజంను పర్యాటకులకు పరిచయం చేసేందుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, గండికోట తదితర 15 చోట్ల దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని ప్రణాళికలకు కార్యరూపం దాల్చెందుకు పెద్ద యెత్తున ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఉమ్మడి విశాఖజిల్లాలో కారావాన్ టూరిజం కోసం గుర్తించిన ప్రాంతాలేంటో చూద్దామా!
అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని అంజోడా ఫారెస్ట్ – ప్రస్తుతం సరికొత్త ఏజెన్సీ డెస్టినేషన్. దీంతో అక్కడ కారవాన్ టూరిజం ను పెట్టాలని ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. అదే అల్లూరి జిల్లాలోని డల్లాపల్లి– హిల్‌స్టేషన్ లో కూడా కారవాన్ టూరిజం. వీటితో పాటు విశాఖ నగర పరిధిలోని జియో హెరిటేజ్ టాగ్ కల ఎర్రమట్టి దిబ్బలు – సముద్ర తీరానికి ఆనుకుని ఉండే ఈ ప్రాంతంలో బీచ్ కారవాన్ పెడితే విశేషమైన ఆదరణ లభిస్తుందని నమ్మకం
భిన్నమైన కారవాన్‌లు..
కారవాన్ టూరిజం వయబిలిటీ పై పర్యాటకశాఖ ఎండీ కన్నబాబు, విశాఖ రీజినల్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి లు ఈమధ్య అరకు, లంబసింగి, పాడేరు, చింతపల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించి వయబిలిటీ రిపోర్ట్స్ సిద్ధం చేశారు. ఉమ్మడి విశాఖ లో పైలట్ కింద ఎంపిక చేసిన మూడు ప్రాంతాల్లో మూడు భిన్నమైన టూరిజం స్పాట్స్ లో పైన్ చెట్లు అధికంగా ఉన్న అనంతగిరికి 35 కిలోమీటర్ల దూరంలోని అంజోడాలో ఫారెస్ట్ కారవాన్, డల్లాపల్లిలో హిల్‌స్టేషన్ కారవాన్, ఎర్రమట్టి దిబ్బలు ఎదురుగా బీచ్ కారవాన్‌ను పైలట్‌గా ప్రారంభించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అంతర్జాతీయ పర్యాటక కన్సల్టెన్సీ కసరత్తు..
పైలట్‌గా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఎంపిక చేసిన కన్సల్టెన్సీ సన్నాహలు ప్రారంభించిందట. ఎంపిక చేసిన ప్రాంతాల్లో పోటెన్షియాలిటీ ఎలా ఉంటుందన్న అంశంపై రిపోర్ట్ సిద్ధమవుతోందట. మరోవైపు కారవాన్ టూరిజంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయట. పీపీపీ పద్ధతిలో ఈ వ్యవహారానికి ప్లాన్ చేస్తోందట టూరిజం శాఖ. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపాయట. పైలట్ ప్రాజెక్టు పద్ధతిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో లగ్జరీ వాహనాలు కాకుండా, సాధారణ వాహనాలను లగ్జరీగా డిజైన్ చేయబోతున్నారట. ఇందుకోసం రవాణాశాఖ నుంచి కూడా అనుమతులు తీసుకొచ్చేందుకు పర్యాటక శాఖ సమాయత్తమవుతోందట.
ప్రకృతిని ఆస్వాదించేందుకు..
దీనిపై పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి టీవీ9 తో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా అమలవుతున్న కారవాన్ టూరిజం మన దేశంలో కూడా కేరళలో సక్సెస్ అయ్యిందన్నారు. పైలట్ కింద ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు ప్రాంతాలను గుర్తించామని ఆ ప్రాంతాల్లో అనుమతులు రాగానే ఒక్కో ప్రాంతంలో అర ఎకరం విస్తీర్ణంలో కారవాన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు శ్రీనివాస్. అక్కడ మౌలిక సదుపాయాలు ఆయిన మంచినీటి సౌకర్యం, విద్యుత్ సదుపాయం, సెక్యూరిటీ, ప్రధాన రహదారికి అనుసంధానం చేసే మార్గాలు ఇలా పర్యాటకులకు కావాల్సిన కనీస సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రకృతిని ఆస్వాదించేందుకు కారవాన్లలో టెంట్లు కూడా అందిస్తామన్న ఏపీటీడీసీ రీజనల్ డైరక్టర్ వాహనాన్ని బట్టి ధర నిర్ణయించాలని ఆలోచిస్తున్నామన్నారు. రాబోయే పిక్నిక్ సీజన్ సమయానికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామంటూ వివరించారు శ్రీనివాస్ ఫణి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం