Avocado Farming: ఆంధ్రా కాశ్మీరంలో నీడ కోసం వేసిన మొక్కలతో గిరి రైతులకు సిరులు.. పోషకాల గని ఈ పండు గురించి తెలుసుకోండి..

పోషకాల గని.. సర్వరోగ నివారిణి.. శీతల ప్రాంతాల్లోనే పండే ఆ ఫలం.. ఇప్పుడు మన తెలుగు నేలపై అడుగు పెట్టింది. ఏజెన్సీలో పుష్కలంగా పంటనిస్తోంది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అరుదుగా పండే అవకాడో.. గిరిజన రైతుల పంట పండిస్తోంది. చింతపల్లి మండలం గొందిపాకలు గ్రామంలో అవకాడో పంట పండిస్తున్నడు ఆదివాసి రైతు రాంబాబు. మన్యం ప్రాంతంలో కాఫీ మొక్కలకు నీడ కోసం అవకాడో మొక్కల్ని వేశారు.

Avocado Farming: ఆంధ్రా కాశ్మీరంలో నీడ కోసం వేసిన మొక్కలతో గిరి రైతులకు సిరులు.. పోషకాల గని ఈ పండు గురించి తెలుసుకోండి..
Avocado Farming
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Surya Kala

Updated on: Aug 18, 2023 | 11:02 AM

ఆంధ్ర కాశ్మీరం అంటే టక్కున గుర్తొచ్చే ప్రాంతం లంబసింగి. ఆపిల్, స్ట్రాబెరీ, డ్రాగన్ ఫ్రూట్ లాంటి ఫల తోటలకు అనుకూల వాతావరణం అల్లూరి ఏజెన్సీలోని చింతపల్లి సొంతం. అయితే ఈ ప్రాంతంలో ఇప్పుడు మరో అరుదైన పంట పండుతోంది. మెక్సికో, కొలంబియా, వియత్నాం, అమెరికా, బ్రెజిల్ అవకాడో.. ఇప్పుడు చింతపల్లిలో విరివిగా కాస్తోంది.

కాఫీ చెట్లకు నీడగా వేసి.. ఇప్పుడు లాభల పంట..

చింతపల్లి మండలం గొందిపాకలు గ్రామంలో అవకాడో పంట పండిస్తున్నడు ఆదివాసి రైతు రాంబాబు. మన్యం ప్రాంతంలో కాఫీ మొక్కలకు నీడ కోసం అవకాడో మొక్కల్ని వేశారు. దాదాపు పదేళ్ల క్రితం అంటే .. 2004 సంవత్సరంలో కాపీ బోర్డు అధికారులు కొంతమంది గిరిజన రైతులకు అవకాడో మొక్కలను పంపిణీ చేశారు. ఈ మొక్కలు ఇప్పుడు పెరిగి పెద్దవై గిరిజన రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. వీటిని వెన్నపండు అని కుాడ అంటారు. ఈ అవకాడో శాస్త్రీయ నామము పెరిసియా అమెరికానా.

మొక్క రూ.25 కొనుగోలు చేసి..

గొందిపాకలు గ్రామానికి చెందిన రాంబాబు అనే రైతుతో మరి కొంతమందికి అధికారులు అవకాడో మొక్కలను పంపిణీ చేశారు. కాఫీ పంటలకు నీడనిచ్చే చెట్టుగా అప్పట్లో ఒక్కొక్కటి 25 రూపాయలు చొప్పున కొనుగోలు చేశారు. ఒక్కొక్కరు విదేశి మొక్కలను నాటారు. రాంబాబు కూడా తన కాఫీ తోటలో 10 సంవత్సరాల క్రితం ఈ మొక్కలు వేశారు. ఇప్పుడు పెరిగి పెద్దవై మంచి ఫల సాయాన్ని అందిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

అప్పట్లో ఈ మొక్కల గురించి తెలియక..

తొలి ఐదేళ్లలో ఒక్కో చెట్టుకు ఐదు నుంచి పది కాయలు మాత్రమే కాసేవి. కానీ ఆ తర్వాత క్రమంలో వందల సంఖ్యలో అవకాడో కాయలు కాస్తున్నాయి. కిలో 200 వరకు ధర పలుకుతుంది. అయితే.. ఈ పళ్ళు కాస్తున్న దాని విలువ తెలియక రైతులు పట్టించుకోలేదు. కాలక్రమంలో కొంతమంది వచ్చి అవకాడో పండ్లపై అవగాహన పెంచడంతో ఇప్పుడు ఆవకాడో పంటపై తాము దృష్టి సారించినట్లు గిరిరైతు రాంబాబు చెబుతున్నాడు.

గుత్తులు గుత్తులుగా కాయలు..

నీడ కోసం వేసే మొక్కలు.. ఇప్పుడు లాభాల పంట పండిస్తున్నాయి. వీటి గురించి తెలియక గతంలో రైతులు పెద్దగా పట్టించుకోలేదు. కాఫీ పంటకు నీడను ఇవ్వడానికి మాత్రమే వాటిని పెంచేవారు. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫల సాయం వచ్చినప్పటికీ.. ఆ పండు ప్రాధాన్యత గిరి రైతులకు తెలియలేదు. తొలుత పదుల సంఖ్యలో కాసే కాయలు.. ఇప్పుడు వందల సంఖ్యలో విరగ్గాస్తున్నాయి. చెట్టుకు ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా అవకడో పండ్లు వేలాడుతున్నాయి. దాదాపుగా ఒక్కో చెట్టుకు 600 నుంచి 800 వరకు కాయలు కాస్తున్నాయి. అయితే ఈ పండు గురించి కొంతమంది స్వచ్ఛంద సంస్థలు, శాస్త్రవేత్తలు గిరి రైతులకు చెప్పడంతో ఔరా అనుకున్నారు. అప్పుడు నుంచి ప్రత్యేక దృష్టి సారించి వాటి సాగు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న ఈ అవకాడోకు ఇప్పుడు భలే డిమాండ్ ఏర్పడింది.

పోషకాల గని.. సర్వరోగ నివారిణి..

ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం చింతపల్లి, పాడేరు, జి కే వీధి మండలాల్లో అవకాడో సాగు రోజు రోజుకీ  విస్తరిస్తుంది. అయితే అవకాడ మొదటిగా భారత్ కు శ్రీలంక నుంచి వచ్చింది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా.. ముందుగా కేరళ, కర్ణాటక ప్రాంతాల్లో ఈ అవకాడో పండించే వారు. అవకాడో పండ్లులో న్యూట్రిషన్ ఎక్కువగా ఉంటుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. ఈ పండులో మంచి కొలెస్ట్రాల్ ఉండటం వలన గుండె జబ్బులు తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం ఉండటం వలన చక్కెర వ్యాధి ని కంట్రోల్ చేసే గుణాలు ఉన్నాయని అంటున్నారు ఉద్యాన శాస్త్రవేత్త బిందు. అవకాడో  సాగుకి సంబంధించి ఏజెన్సీ లోని గిరిజన ప్రాంతాలు ఎక్కువగా అనుకూలంగా ఉన్నట్టు గుర్తించామని అంటున్నారు చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు.

అందుకే అక్కడ పండుతున్నాయి..

అవకాడో పండించడానికి సుమారు 15 నుంచి 35 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే వాతావరణం అవసరం. మొక్క పెద్దయి ఆశించిన ఫలసాయం రావాలంటే కొన్నాళ్లు వేచి చూడాలి. నాలుగైదు సంవత్సరాలకు పుాత పూసి పండ్లు కాస్తాయి. పదేళ్ల వరకు వేచి చూస్తే పుష్కలంగా ఫలసాయం అందుతుంది. అవకాడో మొక్కలకు  అంటు కడితే రైతులకు మంచి లాభాలు వస్తాయని అంటున్నారు శాస్త్రవేత్తలు.

అవకాడో పై గిరి రైతుల ఆసక్తి..

అవకాడో ప్రాధాన్యత తెలిసి.. ఇప్పుడు వాటిని పండించేందుకు గిరిజన రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఆపిల్, స్ట్రాబెరీ, డ్రాగన్ ఫ్రూట్ పంటలకు అనుకూలమైన చింతపల్లి ఏజెన్సీలో అవకాడో పంటను విస్తరించేందుకు అధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..