USA: అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడికి అరెస్ట్‌ గండం.. అక్రమ సంబంధమే కారణమా..? వివరాలివే..

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడవక ముందు ఆయన పైలాపచ్చీసు జీవితం గురించి.. వెలగబెట్టిన రాసలీలల బాగోతాల గురించి.. కథలుకథలుగా బైటికొచ్చాయి. వాటిలో ఒకటి.. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ ఎపిసోడ్. అవినీతి ప్లస్..

USA: అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడికి అరెస్ట్‌ గండం.. అక్రమ సంబంధమే కారణమా..? వివరాలివే..
Donald Trump
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 31, 2023 | 8:50 AM

మొన్నటిదాకా అధ్యక్షుడి కుర్చీలో ఉన్న డోనాల్డ్ ట్రంప్‌కి సడెన్‌గా ఏంటీ జైలు యోగం..? ఆయన ఏ క్షణాన్నయినా అరెస్ట్ అయ్యే చాన్స్ ఉందా..? ఒకవేళ అరెస్ట్ అయ్యి జైలుగోడల మధ్యకు వెళితే మళ్లీ అధ్యక్షుడు కావాలన్న ఆయన ఆశ నెరవేరే చాన్స్ ఉన్నట్టా.. లేనట్టా..? అసలు ఆయన చేసిందేంటి.. ట్రంప్‌పై కఠిన చర్యలకు దారితీస్తున్న పరిణామాలేంటి..? ట్రంప్ అరెస్టవుతారా.. ఒకవేళ అరెస్టయితే బేడీలేసి రోడ్డు మీద నడిపిస్తారా.. గుట్టుగా లోపలేసి ఆయనకున్న గౌరవాన్ని కాపాడతారా..? అంటూ బెట్టింగులు కూడా షురూ అయ్యాయి. మరోవైపు ‘ఈ మంగళవారమే నాకు ఆఖరాట… నన్ను కాపాడుకోవడం మీ బాధ్యత… రండి రోడ్డెక్కండి..’ అంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆ ఒక్క ట్వీట్.. అమెరికా మొత్తాన్ని ఇప్పుడు ఆగమాగం చేస్తోంది.

ఫలితంగా మాజీ అధ్యక్షుడి కరడుగట్టిన అభిమానులు ఇప్పటికే అధికారులకు ఆన్‌లైన్‌లో బెదిరింపులు మొదలుపెట్టేశారు. ‘మా సారు మీదే చార్జ్ షీట్‌ ఫైల్ చేస్తావా..?’ అంటూ మాన్‌హట్టన్ డిస్ట్రిక్ అటార్నీని చంపేస్తామని హెచ్చరికలు కూడా వచ్చాయి. ఇంతకీ జైలుకెళ్లాల్సినంత తప్పు మాజీ ప్రెసిడెంట్‌ ఏం చేసినట్టు..? అంటూ ఆయన ఫ్లాష్‌బ్యాక్‌లోకి తొంగిచూస్తున్నారు జనం. అధ్యక్షుడవక ముందు ఆయన పైలాపచ్చీసు జీవితం గురించి.. ఆయన వెలగబెట్టిన రాసలీలల బాగోతాల గురించి.. కథలుకథలుగా బైటికొచ్చాయి. వాటిలో ఒకటి.. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ ఎపిసోడ్. అవినీతి ప్లస్ అక్రమ సంబంధం.. రెండూ కలిసి ట్రంప్ భవిష్యత్తును మంట గలిపేస్తున్నాయి.

2006లో డేనియల్స్‌తో డోనాల్డ్ ట్రంప్ ఎఫైర్ నడిపినట్టు ఆరోపణలున్నాయి. తర్వాత పదేళ్లకు 2016లో సరిగ్గా అధ్యక్షుడిగా పోటీ చేసే సమయంలో.. ట్రంప్‌ని కార్నర్ చేస్తూ.. ఆయనతో తన సంబంధం గురించి బైటపెట్టబోయిందా సుందరాంగి. అప్పట్లో లక్షా 30 వేల డాలర్లిచ్చి ఆమె నోరు మూయించారట. అది సరే ప్రైవేట్ వ్యవహారం. కానీ.. లీగల్ ఖర్చులంటూ మరో లక్షా 30 వేల డాలర్లు తన లాయర్‌కి సమర్పించుకుని.. దాని కోసం తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేశారట. న్యూయార్క్ చట్టాల ప్రకారం ఫోర్జరీ అనేది పెద్ద నేరం. ఇదే ఇప్పుడు ట్రంప్ మెడకు చుట్టుకుంది. అరెస్టు దాకా తీసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

వివాహేతర సంబంధం పెట్టుకోవడం, ఓటర్లకు తెలీకుండా ప్రభుత్వ ఖర్చుతో దాన్ని దాచిపెట్టడం, ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడం.. అన్నీ కలిసి.. ట్రంప్‌ని బోనులో నిలబెట్టబోతోంది. నేరం చిన్నదని తేలితే జరిమానాతో సరిపెడతారు. నేర తీవ్రత మరీఎక్కువనిపిస్తే గరిష్టంగా నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించక తప్పదు. ఒకవేళ ట్రంప్‌ను అరెస్ట్ చేస్తే?… అమెరికాలో మాజీ అధ్యక్షుడి అరెస్టు సమయంలో పాటించే ప్రోటోకాల్ ఏంటి? ఫ్లోరిడాలోని తన ఇంటి నుంచి ట్రంప్‌ న్యూయార్క్ సిటీ కోర్టుకి రావాల్సి ఉంటుంది. అక్కడే ఫోటోలు, వేలిముద్రలు తీసుకుంటారు. ఒకవేళ ట్రంప్ గోప్యతను కాపాడాలనుకుంటే మీడియా కంటబడకుండా ప్రైవేటు మార్గంలో కోర్టుకు తరలించే ఛాన్సుంది.

ఇటు.. ‘మాజీ అధ్యక్షుడికి అధోగతే’ అంటూ ట్రంప్‌ అరెస్ట్‌కు సంబంధించి విచ్చలవిడిగా ఫేక్ ఫోటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. జడ్జి ముందు భోరున ఏడుస్తున్నట్టు, జైల్లో బాత్‌రూములు కడుగుతున్నట్టు ట్రంప్ కొత్తవతారాలు సోషల్ మీడియాను దున్నేస్తున్నాయి. దేశాధ్యక్షుడిగా అత్యున్నత పదవిని వెలగబెట్టిన మనిషి కనుక.. ఆయన ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకుని.. అల్లర్లు జరక్కుండా ముందస్తుగా ప్రధాన నగరాల్లో సెక్యూరిటీ అలర్ట్ చేసింది అమెరికా ప్రభుత్వం. ట్రంప్ కేసును విచారిస్తున్న మాన్‌హట్టన్ క్రిమినల్ కోర్టు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్రంప్ టవర్ బయట కూడా పోలీసు పహారా నడుస్తోంది. అమెరికా చట్టసభలుండే క్యాపిటల్ హిల్ దగ్గర ఎమర్జెన్సీ విధించినా విధిస్తారు. గతంలో కూడా తన అభిమానుల్ని ట్రంప్ రెచ్చగొట్టిన సందర్భాలున్నాయి.

2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్‌ భవనంపై దాడికి పాల్పడ్డారు ట్రంప్ సపోర్టర్లు. ఒకవేళ అరెస్టయితే అధ్యక్షుడిగా మళ్లీ పోటీ చేసే ఛాన్స్ ఉంటుందా అంటే.. ఖచ్చితంగా ఉంది అంటున్నాయి అమెరికన్ చట్టాలు. నేరం రుజువైన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చెయ్యకూడదన్న నిబంధనలేమీ అక్కడ లేవు. పైగా.. ట్రంప్ సామాన్యుడు కాడు.. ఆయన్ను జైల్లో వేస్తే.. సానుభూతి పెరిగి.. 2024 ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో గెలుస్తారు.. మళ్లీ ప్రెసిడెంట్ అవుతారు.. అనేది ఎలోన్ మస్క్ లాంటి వాళ్లు చెబుతున్న జోస్యం. చూడాలి.. ట్రంప్ జీవితం ఈసారి ఏ మలుపు తిరగబోతోందో..?

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..