Telangana: ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌

Ram Naramaneni

| Edited By: Ravi Kiran

Updated on: Aug 21, 2023 | 3:58 PM

చెప్పింది చెప్పినట్టే తెలంగాణలో BRS అందరికంటే ముందు ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను BRS అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. పంచమి తిథి మంచిరోజు కావడంతో ఇదే శుభముహూర్తంగా భావించి కేసీఆర్ అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. ఎప్పటిలాగే.. సిద్దిపేట నుంచి హరీశ్ రావు, సిరిసిల్ల నుంచి KTR యథావిధిగా పోటీ చేయనున్నారు.

బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల రేస్ ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించారు CM KCR. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.  వేములవాడ, బోథ్‌‌, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌, వైరా, కోరుట్ల, స్టేషన్ ఘన్‌పూర్, ఉప్పల్‌  సిట్టింగ్ అభ్యర్థులను మార్చినట్లు ప్రకటించారు. కోరుట్లలో విద్యాసాగర్‌రావు కోరిక మేరకే ఆయన స్థానంలో కుమారుడు డా. సంజయ్‌కు టికెట్‌ ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ లెక్కన ఏడుగురు సిట్టింగులకు టికెట్లు ఇవ్వడం లేదని సీఎం చెప్పారు. ఉప్పల్‌లో బేతి సుభాష్‌రెడ్డి స్థానంలో బండారు లక్ష్మారెడ్డి, ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు స్థానంలో కోవా లక్ష్మి, వైరాలో రాములునాయక్‌ స్థానంలో మదన్‌లాల్‌, ఖానాపూర్‌లో రేఖానాయక్‌ స్థానంలో భూక్యా జాన్సన్‌ రాథోడ్‌, వేములవాడలో చెన్నమనేని స్థానంలో చల్మెడ లక్ష్మీనరసింహారావు, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రాజయ్య స్థానంలో కడియం శ్రీహరి, బోథ్‌లో రాథోడ్‌ బాపురావు స్థానంలో అనిల్‌ జాదవ్‌, కోరుట్లలో విద్యాసాగర్‌రావు స్థానంలో ఆయన కుమారుడు డా. సంజయ్‌ పోటీ చేయబోతున్నట్లు సీఎం తెలిపారు.  నర్సాపూర్, జనగామ, గోషామహల్, నాంపల్లి సీట్లు హోల్డ్‌లో పెట్టారు. గజ్వేల్, కామారెడ్డి 2 స్థానాల్లో ఈ సారి సీఎం కేసీఆర్ పోటీ చేయనున్నారు.

Published on: Aug 21, 2023 02:42 PM