MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో రాజకీయ ప్రకంపనలు.. అరెస్టుకు మరో అడుగు దగ్గరైన ఎమ్మెల్సీ కవిత?

BRS MLC Kavitha: నిజానికి మహిళా బిల్లు విషయంలో కేంద్రం అలసత్వాన్ని నిరసిస్తూ ఈ నెల 10న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాకు కవిత సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో కూడా క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఇదే  సమయంలో ఈడీ

MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో రాజకీయ ప్రకంపనలు.. అరెస్టుకు మరో అడుగు దగ్గరైన ఎమ్మెల్సీ కవిత?
Arun Pillai, MLC Kavitha
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 08, 2023 | 12:17 PM

Delhi Liquor Scam case: అనుకున్నట్టే అయ్యింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు తప్పదంటూ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసేందుకు ఈడీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్టే కనిపిస్తోంది. తాజాగా ఆమె బీనామీగా ఈడీ పేర్కొంటున్న అరుణ్ రామచంద్రపిళ్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ నెల 9న విచారణకు హాజరు కావాలంటూ ఇచ్చిన నోటీసులతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది.

నిజానికి మహిళా బిల్లు విషయంలో కేంద్రం అలసత్వాన్ని నిరసిస్తూ ఈ నెల 10న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాకు కవిత సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో కూడా క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఇదే  సమయంలో ఈడీ ఆ ధర్నాకు ఒక్క రోజు ముందు అంటే మార్చి 9న విచారణకు హాజరు కావాలని పిలవడంతో రాజకీయంగానూ ఇది మరింత దుమారానికి కారణమయ్యింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఓ మహిళకు బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ బీఆర్ఎస్ నేతలు మండి పడేందుకు కారణమయ్యింది కూడా.

సరే ప్రస్తుతానికి ఈ రాజకీయాలను…అరెస్టు వార్తల్ని కాసేపు పక్కనపెట్టి… అసలు దీనికి దారి తీసిన పరిస్థితులేంటి… ఎక్కడో ఢిల్లీలో స్కాం జరిగితే మన తెలుగు రాష్ట్రాల్లో అరెస్టులు జరగడమేంటి… అసలు దేశ రాజధానికి లిక్కర్ పాలసీకి.. తెలుగు రాష్ట్రాలకు సంబంధమేంటి… ఈ స్కాం ఎలా బయటపడింది.. ఇప్పటి వరకు ఈ స్కాంలో ఎంత మందిని సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.. రాజకీయంగా ఇది సృష్టించబోతున్న సంచలనాలు ఎలా ఉండబోతున్నాయి..

అసలేంటి లిక్కర్ స్కాం..

ఈ స్కాం కహానీ తెలుసుకోవాలంటే మనం సరిగ్గా ఓ రెండున్నరేళ్లు వెనక్కి వెళ్లాలి. కోవిడ్ నుంచి దేశం అప్పుడప్పుడే కోలుకుంటున్న రోజులవి. సెకెండ్ వేవ్ దెబ్బకు అల్లాడిపోయిన ఢిల్లీ జనం కూడా అప్పుడప్పుడే రోడ్డెక్కుతున్నారు. వాళ్ల జీవితాలు మళ్లీ గాడిన పడటం దాదాపు అటూ ఇటూగా మొదలైన రోజులవి. అప్పటి వరకు ఢిల్లీలో మధ్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉండేది. కానీ 2021 సెప్టెంబర్లో కొత్త మద్యం పాలసీ తయారీ కోసం ఎక్సయిజ్ కమిషనర్ రవి ధావన్ నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటుకు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆదేశించారు.

జనవరి 5, 2021 : ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్రజైన్, కైలాశ్​ గెహ్లాట్‌తో కూడిన మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) ఏర్పాటుకు మంత్రివర్గ నిర్ణయం తీసుకుంది.

మార్చి 22, 2021 : మంత్రుల బృందం నివేదిక సిద్ధమయ్యింది. క్యాబినెట్లో సమర్పించారు కూడా. ఈ నివేదికను అమలుచేసి 2021-22 సంవత్సరానికి పాలసీ తయారుచేయాల్సిందిగా అప్పటి ఎక్సైజ్ మంత్రి సిసోడియా తన శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

 మే 21 2021: కొత్త ఎక్సయిజ్ పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

నవంబర్‌లో ఢిల్లీ ప్రభుత్వం అంటే ఆమ్ ఆద్మీ సర్కారు కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. సరిగ్గా 2021 నవంబర్ 17న ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు కేజ్రీవాల్ సర్కారు ప్రకటించింది. ఆ పాలసీ ప్రకారం ఢిల్లీ ని 32 ఎక్సైజ్ జోన్లుగా విభజించారు. అప్పటి వరకు ప్రభుత్వం అధీనంలో ఉన్న లిక్కర్ లైసెన్సులను ప్రైవేటు వెండర్లకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అలా మొత్తం 849 మంది వెండర్లకు లైసెన్సులిచ్చారు. అలా లిక్కర్ బిజినెస్‌ నుంచి ఢిల్లీ ప్రభుత్వం తప్పుకుంది.

నిజానికి అప్పటి వరకు ఉన్న లిక్కర్ మాఫియాను, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి వినియోగదారులకు అంటే మందుబాబులకు మరింత మెరుగైన సేవలు ఇవ్వాలన్నది తమ ఉద్ధేశమంటూ ఈ కొత్త లిక్కర్ పాలసీని తీసుకురావడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది ఢిల్లీ సర్కారు. అందులో భాగంగా మద్యం అమ్మకం దారులకు కొన్ని మినహాయింపుల్ని కూడా ఇచ్చింది. దాంతో అప్పటి వరకు కోటా ప్రకారం మాత్రమే మద్యం తీసుకునే వెసులుబాటు ఉండే ఢిల్లీ వాసులకు… బంపర్ ఆఫర్ తగిలినట్టయ్యింది. ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులతో తమ అమ్మకాలను పెంచుకునేందుకు ఢిల్లీ మొత్తంగా మద్యం వ్యాపారులు సరికొత్త ఆఫర్లను ప్రకటించారు. ఎంఆర్పీ ధరలతో సంబంధం లేకుండా ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటూ మందుబాబుల్ని ఖుషీ చేసే ప్రయత్నం చేశారు.

సరిగ్గా అక్కడే అసలు కథ మొదలయ్యింది. అప్పటికే కేజ్రీవాల్ సర్కార్‌తో ఉప్పు-నిప్పులా ఉన్న ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సెనా దీనిపై దృష్టి పెట్టారు. నిజానికి ఈ పాలసీని అమల్లోకి తీసుకురాక ముందే అంటే 2021 నవంబరు 8న ఫారిన్ లిక్కర్ ధరల విషయంలో సంబంధిత అథారిటీ నుంచి అనుమతి లేకుండానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని లెఫ్టినెంట్ గవర్నర్ ఆరోపించారు. ఆ తరువాత 2022 జూలై 20న కొత్త ఎక్సయిజ్ పాలసీలో అవకతవకలున్నాయని, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకున్నారంటూ కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లాకు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా లేఖ రాశారు.

సక్సెనా లేఖ మేరకు 2022 జులై 22న సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. ఓ రకంగా అప్పటి వరకు ఉన్న ఢిల్లీ వెర్సెస్ ఢిల్లీ ఫైట్… ఈ ఇష్యూతో ముదురు పాకాన పడింది. ఎప్పుడైతే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో అక్కడ నుంచి లిక్కర్ స్కాం దర్యాప్తులో అడుగులు వేగంగా పడుతూ వచ్చాయి. 2022 ఆగస్టు 17న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నిందితులుగా ఢిల్లీ ఎక్సయిజ్ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా మొత్తం 15 మందిని చేర్చింది.

అక్కడితో విషయం ఆగిపోలేదు. ఈ స్కాంలో మనీ లాండరింగ్ చట్ట ఉల్లంఘనలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో 2022 ఆగస్టు 22న ఎన్ ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ రంగంలోకి దిగింది. ఇక అక్కడ నుంచి షురూ అయ్యింది అసలు సిసలైన కథ. మద్యం కుంభకోణానికి రాజకీయ రంగులు ముసురుకోవడం మొదలయ్యింది. ఓ రకంగా టార్గెట్ ఎవరన్నది ముందే ఫిక్స్ చేసుకొని దానికి అనుగుణంగా ఒక్కో అడుగు వేసుకుంటూ వచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 6న ఈడీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. లిక్కర్ స్కామ్‌లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై హైదరాబాద్‌లోని అరుణ్ రామచంద్రన్ పిళ్ళైకు చెందిన రాబిన్ డిస్టిల్లరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీలు, ఆయన నివాసం అలా మొత్తం ఆరుచోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సెప్టెంబరు 17న ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు ఆఫీసు అలాగే ఆయన నివాసంలో కూడా తనిఖీలు నిర్వహించారు. సెప్టెంబరు 21 మనీ లాండరింగ్ ఆరోపణలపై అరబిందో ఫార్మా ఫుల్‌టైమ్ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డిని ఈడీప్రశ్నించింది. అక్టోబరు 7, ఓ మీడియా సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు.

లిక్కర్ స్కామ్‌లో తొలి అరెస్టు..

అక్టోబర్ 10 నుంచి ఈ కేసులో అరెస్టుల పర్వం మొదలయ్యిందని చెప్పవచ్చు. లిక్కర్ స్కామ్‌తో సంబంధం ఉందని ఆరోపిస్తూ బోయిన్‌పల్లి అభిషేక్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు ఆపై అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబరు 12 ఆంధ్రప్రభ ఎండీ ముత్తా గౌతమ్‌ను అరెస్టు చేశారు. తొలిసారిగా అక్టోబరు 17న ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అంటే నవంబర్ 10న ఈ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. నవంబర్ 14న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్, బోయిన్ పల్లి అభిషేక్‌ను ఈడీ అరెస్ట్ చేసినట్టు ప్రకటించింది. నిజానికి అంతకు ముందు సీబీఐ కూడా ఈ ఇద్దర్ని అరెస్ట్ చేసింది. సరిగ్గా నవంబర్ 16న ఈ కేసు మరో మలుపు తిరిగిందని చెప్పొచ్చు. అదే రోజు ఈ కేసులో మరో నిందితుడైన దినేష్ అరోరా అప్రూవర్‌గా మారేందుకు స్పెషల్ కోర్టు అనుమతిచ్చింది.

ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో తొలి చార్జిషీటును 10 వేల పేజీలతో సమర్పించిన నవంబరు 25, సీబీఐ సమర్పించింది. విచిత్రమేంటంటే ఇందులో మనీష్ సిసోడియాను నిందితుడిగా పేర్కొనలేదు, ఆయనపై అభియోగాలనూ కూడా ప్రస్తావించలేదు. అటు ఈడీ కూడా నవంబర్ 26న ఈ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ ఉల్లంఘనలపై తొలి చార్జి షీటును ఈడీ పైల్ చేసింది.

తెరపైకి కవిత పేరు

సరిగ్గా ఇక్కడ నుంచి సౌత్ గ్రూప్ ప్రస్తావన పూర్తి స్థాయిలో మొదలయ్యిందని చెప్పవచ్చు. అంతకు మూడు రోజుల ముందే తన నివేదికలో సౌత్ గ్రూప్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్న ఈడీ కవిత పేరు ప్రస్తావనకు తీసుకొచ్చింది. కల్వకుంట్ల కవిత రెండు వేర్వేరు నెంబర్లతో మొత్తం పది మొబైల్ ఫోన్లను మార్చడం, డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేసినట్లు ఆరోపించింది. అలా ఈ స్కాంలో తొలి సారి కవిత పేరు నేరుగా ప్రస్తావనకు వచ్చింది.

ఇక్కడ నుంచే తెలంగాణలో కూడా పొలిటికల్ హీట్ మొదలయ్యింది. అప్పటికే TRS – BJP ల మధ్య ఫుల్ లెంత్ పైట్ నడుస్తోంది. ఓ వైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పేరుతో బీజేపీని కార్నర్ చేసేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్‌పై లిక్కర్ స్కాం పేరుతో ఎదురుదాడి చేయడం మొదలు పెట్టింది బీజేపీ. ఈ పొలిటికల్ ఫైట్ జరుగుతుండగానే డిసెంబర్ 6న లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరు కావాలంటూ కవితకు నోటీసులు జారీ చేసింది సీబీఐ. అయితే అప్పటికే ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు హాజరు కాలేనని కవిత చెప్పడంతో డిసెంబర్ 11న నేరుగా కవిత ఇంటికే వచ్చి ఉదయం నుంచి రాత్రి వరకు ఆమెను విచారించారు అధికారులు . ఆ పై సీఆర్పీసీ 191 కింద మరో నోటీసు కూడా జారీ చేసారు .

ఆ తర్వాత 2023 జనవరి 06 స్పెషల్ కోర్టులో రెండో చార్జిషీట్‌ను ఈడీ దాఖలు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరును ప్రస్తావించి సమీర్ మహేంద్రుతో మాట్లాడినట్లు వెల్లడించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 8న కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీై అరెస్ట్ చేసింది. అక్కడ నుంచి చాలా వేగంగా అడుగులు పడుతూ వచ్చాయి. అప్పటికే 2022 అక్టోబర్ 17న 8 గంటల పాటు మనీష్ సిసోడియాను విచారించిన సీబీఐ అధికారులు 2023 ఫిబ్రవరి 18 మరోసారి విచారణకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే నెలాఖరులో జరగనున్న బడ్జెట్ సమావేశాల కారణంగా తాను బిజీగా ఉన్నానని మరో రోజు విచారణకు వస్తానని సీబీఐకి తెలిపారు సిసోడియా. దీంతో ఫిబ్రవరి 26న సుమారు 8 గంటలసేపు విచారించిన సీబీఐ అధికారులు ఆయన్ను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ మర్నాడు అంటే ఫిబ్రవరి 27న ఢిల్లీ రాస్ అవెన్యూస్ కోర్టు సిసోడియాను ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 28న సిసోడియా బెయిల్ పిటిషన్ను కొట్టేసింది సుప్రీం కోర్టు. ఈ విషయంలో హైకోర్టును సంప్రదించాలని సూచించింది. అంతకు ముందే సిసోడియా సహా అరెస్టయన మరో మంత్రి సత్యేంద్రజైన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు .

సిసోడియా తర్వాత కవిత?

సిసోడియా అరెస్ట్ తర్వాత నుంచి ఇక ఈ కేసులో నెక్ట్స్ ఎవరు అనగానే ఎమ్మెల్సీ కవిత పేరే ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. ఇదే విషయమై టీవీ 9 కవితను ప్రశ్నించినప్పుడు ఆధారాలు అంటే అరెస్ట్ చెయ్యకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఇక ఈ కేసులో ప్రముఖంగా వినిపించిన పేరు సౌత్ గ్రూప్… అసలు ఇంతకీ ఏంటీ సౌత్ గ్రూప్..? కేంద్ర దర్యాప్తు సంస్థలు పేర్కన్న ప్రకారం ఈ గ్రూపులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అరబిందో ఫార్మా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ శరత్ చంద్రారెడ్డి, బోయిన్ పల్లి అభిషేక్, కల్వకుంట్ల కవిత, ఆమె బీనామీగా చెప్పుకుంటున్న రామచంద్రన్ పిళ్లై, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు సహా మొత్తం 12 మంది ఉన్నారు. వారిలో ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. ఇక మిగిలింది కేసీఆర్ కుమార్తె కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నది విశ్లేషకుల మాట.

స్కామ్‌లో కవితకు ఉన్న సంబంధం?

ఈ కుంభకోణంలో సీబీఐ ఆమెను ఒక సాక్షిగా విచారించి స్టేట్‌మెంట్ రూపంలో వివరాలను రికార్డు చేసుకున్నది. ఆ తర్వాత ఈడీ సమర్పించిన తొలి చార్జిషీట్‌లో ఆమెకు ఈ స్కామ్‌లో ఉన్న సంబంధం గురించి ప్రస్తావించింది. ఎక్సయిజ్ పాలసీ రూపకల్పన జరిగే సమయంలోనే సమీర్ మహేంద్రుతో అరుణ్ రామచంద్రన్ పిళ్లై ద్వారా కవిత ఫోన్‌లో మాట్లాడినట్లు ఈడీ పేర్కొన్నది. వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అరబిందో ఫార్మా ఫుల్‌టైమ్ డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి సౌత్ గ్రూపు పేరుతో ఢిల్లీలోని లిక్కర్ రిటెయిల్ వ్యాపారంలోకి రావాలని ఆసక్తి చూపినట్లు ఈడీ ఆరోపణ.

ఎంపీ మాగుంట తరఫున ఆయన కుమారుడు రాఘవ, ప్రేమ్ రాహుల్ ప్రతినిధులుగా ఉంటారని, కవిత తరఫున పిళ్లై, బోయిన్‌‌పల్లి అభిషేక్, ఆడిటర్ బుచ్చిబాబు ప్రతినిధులుగా ఉన్నారని ఈడీ వెల్లడించింది. ఇండో స్పిరిట్స్ కంపెనీలో భాగస్వాములుగా చేరడానికి ఆసక్తిగా ఉన్నట్లు పిళ్లై ద్వారా సమీర్ మహేంద్రుకు కవిత చెప్పినట్లు ఈడీ పేర్కొన్నది. 2022 ప్రారంభంలో సమీర్ మహేంద్రు నేరుగా హైదరాబాద్ వచ్చి కల్వకుంట్ల కవిత నివాసంలో చర్చలు జరిపారు. ఆ సమయంలో ఆమె భర్త అనిల్, గోరంట్ల బుచ్చిబాబు, శరత్‌చంద్రారెడ్డి, పిళ్ళై, బోయిన్‌పల్లి అభిషేక్ తదితరులు ఉన్నట్లు అభియోగం.

ఆ తర్వాత ఢిల్లీలోని ఒబెరాయ్ మెయిడెన్ హోటల్‌లో జరిగిన మీటింగులోనూ కవితతో చర్చించి 65% మేర వాటాలకు సమీర్ అంగీకరించినట్లు ఈడీ కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నది. కవితకు సన్నిహితుడైన వెన్నమనేని శ్రీనివాసరావు ఆమె ఆదేశం మేరకు పిళ్ళై నుంచి కోటి రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అప్పజెప్పినట్లు వెల్లడించింది.

దాదాపు రూ. 100 కోట్ల రూపాయలను అడ్వాన్స్ కిక్‌బ్యాక్ రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముట్టచెప్పినందున రీటెయిల్ దుకాణాల్లో ఎల్-1గా నిలిచిన ఇండో స్పిరిట్స్‌లో కవితకు వాటా లభించిందని తెలిపింది. ఇండో స్పిరిట్స్ కంపెనీల్లో ఎక్కడా కాగితాల మీద అధికారికంగా కవిత పేరు ఉండదని, ఆమె తరఫున పిళ్ళై ఉన్నారని వివరించింది. ఇలా తీసుకున్న డబ్బులో నుంచే ముత్తా గౌతమ్ కంపెనీలకు కొంత ఇచ్చినట్లు పిళ్లై తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నట్లు ఈడీ తెలిపింది.

బోయిన్‌పల్లి అభిషేక్ పాత్ర?

లిక్కర్ రీటెయిల్ దుకాణాలకు మద్యం సరఫరా చేసే రాబిన్ డిస్టిల్లరీస్ కంపెనీలో అరుణ్ రామచంద్రన్ పిళ్లైతో పాటు బోయిన్‌పల్లి అభిషేక్ కూడా ఒక డైరెక్టరుగా ఉన్నారు. సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్‌తో పిళ్ళైకు సంబంధాలు ఉండడంతో బోయిన్‌పల్లి అభిషేక్ కూడా పెట్టుబడులు పెట్టి లిక్కర్ వ్యాపారంపై ఆసక్తి చూపారు. బోయిన్‌పల్లి అభిషేక్‌, కల్వకుంట్ల కవిత సన్నిహిత మిత్రులు. గతంలో తిరుమల ఆలయానికి కూడా పిళ్ళై, కవితతో కలిసి వెళ్లారు.

ఫార్మా కంపెనీకి చెందిన శరత్‌చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ వ్యాపారంపై ఆసక్తిగా ఉన్నట్లు సమీర్ మహేంద్రుకు విజయ్ నాయర్‌ ద్వారా తెలిసింది. ఆర్థికంగా ఏ మేరకు లాభదాయకంగా ఉంటుందో ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ద్వారా స్టడీ చేయించారు. హోల్‌సేల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపకపోయినా రీటెయిల్ రంగంలోకి ఇంట్రెస్టు చూపారు. ట్రైడెంట్ కెమ్‌ఫార్ కంపెనీ ద్వారా ఐదు రీటెయిల్ జోన్లను కైవసం చేసుకున్నారు.

ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువ రిటెయిల్ జోన్లకు లైసెన్సు పొందడానికి అర్హత లేకపోవడంతో ఆర్గానోమిక్స్ ఈకో సిస్టమ్స్, అవంతికా కాంట్రాక్టర్స్ అనే ప్రాక్సీ కంపెనీల ద్వారా పొందినట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. బినామీల ద్వారా మరో నాలుగు రిటెయిల్ జోన్లు కూడా శరత్‌చంద్రారెడ్డికి దక్కాయని, మొత్తంగా తొమ్మిది జోన్లు ఆయన కంట్రోల్‌లో ఉన్నాయని పేర్కొన్నది. ఢిల్లీ లిక్కర్ మార్కెట్‌లో మొత్తం 30% ఈయన నియంత్రణలోనే ఉన్నట్లు తెలిపింది.

(రవి కుమార్ పాణింగిపల్లి, టీవీ9, హైదరాబాద్)