Vande Bharat Express: రైళ్లపై రాళ్ల దాడి చేస్తే క్రిమినల్ కేసులే.! 5 ఏళ్లు జైలు శిక్ష..
రైలులో ప్రయాణించే ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే రైళ్లపై రాళ్లు రువ్వడం..
రైలులో ప్రయాణించే ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే రైళ్లపై రాళ్లు రువ్వడం లాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని దక్షిణ మధ్య రైల్వే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) వెల్లడించింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లపై రాళ్ల దాడి చేయడం.. ఆర్పీఎఫ్ చట్టం ప్రకారం శిక్షార్హం. ఇలాంటి ఘటనలకు పాల్పడే నేరస్థులకు రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం.. 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రాళ్లు రువ్విన సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాజీపేట – ఖమ్మం, కాజీపేట – భోంగీర్, ఏలూరు – రాజమండ్రి ప్రాంతాల్లో వందేభారత్ రైళ్లను దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. 2023 జనవరి నుంచి రైళ్లపై రాళ్ల దాడి వంటి ఘటనలు తొమ్మిది జరిగాయి. ఇలాంటి సంఘటనల కారణంగా ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లడమే కాకుండా.. రైలు రీ-షెడ్యూల్ చేయాల్సి వస్తోంది. అలా జరిగితే.. ప్రయాణీకులంతా అసౌకర్యానికి గురి కావాల్సి ఉంది. ఈ ఘటనలలో ఇప్పటివరకు ఆర్పీఎఫ్ పోలీసులు పలు కేసులు నమోదు చేసి 39 మంది నేరస్తులను అరెస్టు చేసింది. ఇక కొన్ని సంఘటనల్లో 6 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు కూడా పట్టుబడ్డారు.
మరోవైపు రైళ్లపై రాళ్లు రువ్వడం వంటి ఘటనలు జరగకుండా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అవగాహన ప్రచారాలు చేయనుంది. ట్రాక్‌ల సమీపంలోని గ్రామాల సర్పంచ్‌లతో సమన్వయం చేయడంతో పాటు, వారిని గ్రామ మిత్రలుగా చేయడం వంటి అనేక నివారణ చర్యలను తీసుకోనుంది. వీటితో పాటు రాళ్లు రువ్వే ప్రమాద స్థలాలన్నింటిలో కూడా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిని మోహరించింది. అలాంటి ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారు వెంటనే 139 టోల్ ఫ్రీ నెంబర్‌కి డయల్ చేసి సమాచారం అందించనున్నారు.