IPL 2023: కోహ్లీ, రోహిత్‌ను భయపెట్టిన ఆ ఇద్దరూ.. కానీ! ఇప్పుడు ఆడటం కష్టమే.. ఎవరో తెలుసా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ 2023) ప్రారంభానికి ముందే, కొందరి ఆటగాళ్ల సీజన్ ముగిసినట్లు కనిపిస్తోంది...
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ 2023) ప్రారంభానికి ముందే, కొందరి ఆటగాళ్ల సీజన్ ముగిసినట్లు కనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, జానీ బెయిర్‌స్టో, ఝే రిచర్డ్‌సన్, శ్రేయాస్ అయ్యర్ లాంటి సీనియర్ ప్లేయర్స్ గాయాలతో లీగ్ మొత్తానికి దూరం అయ్యారు. ఇక ఇప్పుడు వీరితో పాటు ఈ లిస్టులోకి మరో ఇద్దరు యువ ఆటగాళ్లు కూడా చేరారు. వాళ్లు కూడా ఈ సీజన్ ఆడటం కష్టమే. గత సీజన్‌లో IPL అరంగేట్రం చేసిన ఈ ఇద్దరు ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్‌ను పలుసార్లు ఔట్ చేశారు. ఇక ఆ ఇద్దరూ మరెవరో కాదు ముఖేష్ చౌదరి, మొహ్సిన్ ఖాన్. ఈ యువ ప్లేయర్స్ ఐపీఎల్ 2023 సీజన్ ఆడటం డౌట్‌ఫుల్‌గా ఉంది. పేసర్లిద్దరూ గాయపడి ఇంకా పూర్తిగా ఫిట్ అవ్వలేదని ఆయా ఫ్రాంచైజీలు పేర్కొన్నాయి.
26 ఏళ్ల ముఖేష్ చౌదరి, చెన్నై సూపర్ కింగ్స్ తరపున నమోదు చేసిన గణాంకాలు అమోఘం అని చెప్పాలి. ప్రస్తుతం అతడు గాయం నుంచి కోలుకుంటున్నాడని.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడని సీఎస్‌కే ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ క్రిక్‌బజ్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. గత సీజన్‌లో చెన్నై తరఫున 13 మ్యాచ్‌లు ఆడిన ముఖేష్ అత్యధికంగా 16 వికెట్లు పడగొట్టాడు. అతడు తన స్వింగ్ బౌలింగ్‌తో సీనియర్ ప్లేయర్ల దగ్గర నుంచి ఫ్రాంచైజీల వరకు అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి అనుభవజ్ఞుల వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటు ఐపీఎల్‌లో కూడా అరంగేట్రం చేసిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన పేసర్ మొహ్సిన్ ఖాన్ ప్రస్తుతం ఫిట్‌నెస్ కోసం కష్టపడుతున్నాడు. మొహ్సిన్ ప్రస్తుతం ఎల్‌ఎస్‌జి క్యాంప్‌లో ఫిజియోల పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్నాడు. అతడు పూర్తిగా ఫిట్ కావడం ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది. మొహ్సిన్ ఖాన్ గత సీజన్‌లో LSG తరపున 9 మ్యాచ్‌లలో 14 వికెట్లు పడగొట్టి, జట్టులో రెండో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా అవతరించాడు. అయితే అప్పటి నుంచి గాయం కారణంగా క్రికెట్‌కు దూరమైన అతడు.. ఆ తర్వాత ఏడాది కాలంగా ఏ స్థాయిలోనూ మ్యాచ్‌లు ఆడలేదు.