నాకు టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీ 20-25 సీట్లు కోల్పోతుంది.. హైకమాండ్‌కు బీజేపీ సీనియర్ నేత వార్నింగ్

|

Apr 15, 2023 | 4:37 PM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ప్రధాన పార్టీలకు కత్తిమీద సాములా మారింది. సీట్లు దక్కని ఆశావహులు ఇతర పార్టీలకు జంప్ కావడం లేదా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని ప్రకటిస్తున్నారు. మరీ ముఖ్యంగా బీజేపీలో టిక్కెట్ల కేటాయింపు అగ్గి రాజేస్తోంది.

నాకు టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీ 20-25 సీట్లు కోల్పోతుంది.. హైకమాండ్‌కు బీజేపీ సీనియర్ నేత వార్నింగ్
Jagadish Shettar
Image Credit source: TV9 Telugu
Follow us on

Karnataka Elections 2023:  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ప్రధాన పార్టీలకు కత్తిమీద సాములా మారింది. సీట్లు దక్కని ఆశావహులు ఇతర పార్టీలకు జంప్ కాగా.. మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని ప్రకటించారు. మరీ ముఖ్యంగా బీజేపీలో టిక్కెట్ల కేటాయింపు అగ్గి రాజేస్తోంది. పార్టీ సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్సేలకు టిక్కెట్ నిరాకరించడంపై రగడ కొనసాగుతోంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్‌కు సీటు కేటాయింపుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. యువ నాయకులకు అవకాశం కల్పించేందుకు వీలు కల్పిస్తూ.. వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని పార్టీ అధిష్టానం తనకు సూచించినట్లు ఇటీవల ఆయన మీడియాకు వెల్లడించారు. అయితే ఎన్నికల నుంచి తప్పుకోవాలన్న సూచనను అంగీకరించేది లేదని స్పష్టంచేశారు. టిక్కెట్ దక్కని పక్షంలో రెబల్ అభ్యర్థిగా బరిలో దిగుతానని ప్రకటించారు. తనకు టిక్కెట్ నిరాకరిస్తే పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ పార్టీ పెద్దలకు ఇప్పటికే ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

తాజాగా.. తనకు టిక్కెట్ నిరాకరిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ కనీసం 20 నుంచి 25 సీట్లను కోల్పోవాల్సి ఉంటుందని శెట్టర్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన తర్వాత కూడా.. పార్టీ అధిష్టానం తన సీటు విషయంలో పార్టీ పెద్దలు ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆదివారం వరకు ఎదురుచూసి.. ఆ తర్వాత తన భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని శెట్టర్ మీడియాకు తెలిపారు. సీనియర్లకు టిక్కెట్లు నిరాకరించడంపై పార్టీ అధిష్టానం పునరాలోచించుకోవాలని సూచించారు. ఇది వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను దెబ్బతీస్తుందన్నారు.

శెట్టర్‌కు సీటు ఇవ్వకపోతే నార్త్ కర్ణాటకలో 20-25 స్థానాల్లో పార్టీకి నష్టం జరుగుతుందని సీనియర్ నేత యడియూరప్ప కూడా పార్టీ అధిష్టానానికి చెప్పారని వెల్లడించారు. తనకు సీటు ఇవ్వకపోతే దాని ప్రభావం రాష్ట్రమంతటా ఉంటుందని.. ప్రత్యక్షంగా 20 నుంచి 25 నియోజకవర్గాల్లో ఉంటుందని చెప్పుకొచ్చారు. తనకు సీటు ఇవ్వనందుకు పార్టీ పదవులకు రాజీనామా చేసేందుకు ముందుకు వచ్చిన పార్టీ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వారు తనపై ఎంతో అభిమానం చూపిస్తున్నారని అన్నారు.

ఇవి కూడా చదవండి

మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి ఒకే విడతలో మే 10న పోలింగ్ నిర్వహించి మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 212 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. జగదీశ్ శెట్టర్ సహా మరో 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి