New Covid Variant: భారత్‌లోకి ఇప్పటికే ప్రవేశించిన కోవిడ్ కొత్త వేరియంట్.. ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలుసా?
యూకేలో నమోదవుతోన్న మొత్తం కరోనా కేసుల్లో ఈ కొత్త వేరియంట్ 14.6 శాతంగా ఉండడం గమనార్హం. ఎరిస్ అని పిలిచే ఈ కొత్త వేరియంట్ యూకేలో విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇదే క్రమంలో ఈ కొత్త వైరస్ ఇప్పుడు భారత్‌లోనూ విస్తరిస్తోంది. మే నెల నుంచి భారత్‌లో కొత్త వైరస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన ఈ ఈజీ 5.1 కేసులు మహారాష్ట్రాలో కనిపించాయి. కోవిడ్ కొత్త వేరియంట్‌ను గుర్తించి రెండు నెలలు గడిచినా జూన్, జులైలో కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపించలేదు...
యావత్ గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతుందని అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. అగ్ర రాజ్యాలను సైతం హడలెత్తించి, ఆర్థికంగా దేశాలను కుదేలు చేసిన కరోనా మహమ్మారి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత తగ్గుముఖం పట్టింది. అయితే అంతా సంతోషిస్తున్న ఈ తరుణంలో కరోనా కొత్త వేరియంట్ మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈజీ.5 (EG.5) పేరుతో పుట్టుకొచ్చిన ఈ కొత్త రకం వైరస్ మొదటి సారి యూకేలో వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ వైరస్ క్రమంగా ప్రపంచాన్ని చుట్టేసే పనిలో పడింది.
యూకేలో నమోదవుతోన్న మొత్తం కరోనా కేసుల్లో ఈ కొత్త వేరియంట్ 14.6 శాతంగా ఉండడం గమనార్హం. ఎరిస్ అని పిలిచే ఈ కొత్త వేరియంట్ యూకేలో విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇదే క్రమంలో ఈ కొత్త వైరస్ ఇప్పుడు భారత్‌లోనూ విస్తరిస్తోంది. మే నెల నుంచి భారత్‌లో కొత్త వైరస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన ఈ ఈజీ 5.1 కేసులు మహారాష్ట్రాలో కనిపించాయి. కోవిడ్ కొత్త వేరియంట్‌ను గుర్తించి రెండు నెలలు గడిచినా జూన్, జులైలో కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపించలేదు. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం.. జులై చివరి నాటికి యాక్టివ్ కేసుల సంఖ్య 70గా ఉండగా ఆగస్టు నాటికి ఈ సంఖ్య 115కి పెరిగింది.
తాజాగా సోమవారం మహారాష్ట్రాలో కరోనా కేసులు 109కి చేరింది. ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసుల పెరుగుదలను జులై 31న అధికారికంగా గుర్తించారు. వైద్యాధికారుల లెక్కల ప్రకారం.. ముంబైలో గరిష్టంగా 43 కేసులు, పుణెలో 34, థానేలో 25 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాయ్‌ఘఢ్, సాంగ్లీ, షోలాపూర్, సతారా, పాల్ఘర్‌లో ఒక్కో యాక్టివ్ కేసు నమోదైంది. ఇదిలా ఉంటే పుణెలో గడిచిన 15 రోజుల్లో 10 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒక వ్యక్తి మరణించాడు. అయితే నమోదైన 10 కేసుల్లో తేలికపాటి లక్షణాలు కనిపించినట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే కరోనా పాజిటివ్‌గా తేలిన వారిని ఆసుపత్రిలో చేరడం, ఐసీయూలో చేర్చడం వంటి పరిస్థితి రాలేదని చెబుతున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్‌లో కొన్ని జన్యు మార్పులు సంతరించుకోవడం వల్ల ఈ కొత్త వేరియంట్ వచ్చిందని సైంటిస్ట్ చెబుతున్నారు. ఒమిక్రాన్ లక్షణాలే ఈ కొత్త వేరియంట్‌లోనూ కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముక్కుకారడం, విపరీతమైన తలనొప్పి, తుమ్ములు, ఆయాసం వంటి లక్షణాలు ఈ కొత్త వేరియంట్‌లో కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. మరి ఈ కొత్త వేరియంట్ కేసులు ఇంతటితోనే ఆగిపోతాయా.? లేదా గత వేరియంట్స్ లాగే విజృంభిస్తాయా చూడాలి.
ఇదిలా ఉంటే ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఈ కొత్త వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం చేస్తోంది. గడిచిన కొన్ని రోజులుగా ఈజీ 5.1ను ట్రాక్ చేస్తోంది. ప్రస్తుతానికి ఈ వేరియంట్ తో పెద్దగా ముప్పులేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. వ్యాక్సిన్ కారణంగా ఈ వైరస్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..