పేదల ప్రాణాలపాలిట అమృత సంజీవని ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ .. ఇక్కడ అందించే సేవలను గురించి తెలుసుకోండి ఇలా

Super Speciality Hospital: రోజు రోజుకీ వైద్యం ఖరీదైన సేవగా మారిన నేపథ్యంలో పేదల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయింది. అయితే ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మాత్రం..

పేదల ప్రాణాలపాలిట అమృత సంజీవని ఈ  సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ .. ఇక్కడ  అందించే సేవలను గురించి తెలుసుకోండి ఇలా
Satya Sai Hospital
Follow us
Surya Kala

|

Updated on: Aug 20, 2021 | 2:27 PM

Super Speciality Hospital : రోజు రోజుకీ వైద్యం ఖరీదైన సేవగా మారిన నేపథ్యంలో పేదల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయింది. అయితే ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మాత్రం ప్రాణాలను నిలబెడుతూ.. నిరుపేదల దేవాలయంగా నిలిచింది. ఆర్ధిక స్తోమత లేకుండా మృత్యుఒడిలోకి చేరుతున్న అనేక మందికి ప్రాణదాతగా మారింది. అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలను అందిస్తుంది భగవాన్ శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. బడుగు బలహీన వర్గాల కోసం ఆస్పత్రి నిర్మించిన సేవా తత్పరుడు పుట్టపర్తి సత్యసాయిబాబా.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందిస్తున్న సేవలు.. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి తదితర విషయాలను తెలుసుకోండి. గుక్కెడు తాగునీటి కోసం ఎదురుచూస్తున్న పల్లె సీమల దాహార్తిని తీర్చిన కరుణామయుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఓ వైపు ఆధ్యాత్మిక బోధనలు చేస్తూనే మరోవైపు ప్రజలకు ఉపయోగపడే అనేక పనులు చేసిన సేవా తత్పరుడు. సత్యసాయిబాబా నెలకొల్పిన సంస్థల్లో ఒకటి భగవాన్ శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ సరైన వైద్య సౌకర్యాలు లేని స్థానికులే కాదు..వైద్యం చేయించుకోవడానికి ఆర్ధిక స్తోమత లేని అనేకమంది అనేక రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజా వైద్యశాల.

ఇక్కడ ఆస్పత్రి సేవలను జిల్లా ప్రజలే కాకుండా రాష్ట్ర, దేశ ప్రజలు కూడా వినియోగించుకుంటున్నారు. ఇక్కడ వైద్య పరీక్షలు, సేవలను అన్నీ ఉచితం. సత్యసాయి తల్లి ఈశ్వరాంబ కోరిక మేరకు నిరుపేదలకు వైద్యం అందించాలని సంకల్పించారు. 1956 లో పుట్టపర్తిలో సత్యసాయి జనరల్‌ ఆస్పత్రి నెలకొల్పారు. అప్పటి నుంచి ఈ ఆస్పత్రికి భారీ సంఖ్యలో వైద్యం కోసం బాధితులు ఆశ్రయిస్తుండడంతో మరిన్ని సేవలను విస్తరించే దిశగా అడుగులు వేశారు. దక్షిణాసియాలోనే అతిపెద్ద సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని పుట్టపర్తి లో నిర్మించారు. ఇక్కడ ఎటువంటి వ్యాధికైనా చికిత్స అంతా ఉచితంగా అందిస్తారు. పుట్టపర్తిలో 1991, నవంబర్‌ 22న శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆస్పత్రిని బాబా స్థాపించారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రారంభోత్సవం చేశారు. ఈ ఆస్పత్రిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలు ఉచితంగా నిరుపేదలకు అందిస్తున్నారు.

ఆసుపత్రి ఆహ్లాదకరమైన వాతావరణం:

సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని 110 ఎకరాల్లో రూ.300 కోట్లతో 9 నెలల్లో నిర్మిచారు. ఈ ఆస్పత్రి నిర్మాణం దేవాలయాన్ని తలపిస్తుంది. ఇక్కడ ఖరీదైన రోగాలకు వైద్యసేవలను అందిస్తుంది. కార్డియాలజీ, కార్డియోథరోకిక్‌ వాసిక్కులర్‌ సర్జరీ , యురాలజీ, ఆప్తమాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, ఆర్థోపెడిక్‌, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వంటి సేవలను ఉచితంగా బాధితులకు అందిస్తుంది. ఇక ఆస్పత్రి ఆవరణలో అందమైన పచ్చికబయళ్లు, కృత్రిమ జలపాతాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ ఆస్పత్రిని సందర్శించడానికి పర్యాటకులను మధ్యాహ్నం వేళల్లో లోపలికి అనుమతిస్తారు.

ఉచిత వైద్య సేవలు :

ఇక్కడ ఆస్పత్రిలో సేవలను పొందాలనుకునే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే రిజిస్ట్రేషన్ కు , వైద్య పరీక్షలకు, సేవలకు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చే వారు ఇబ్బంది పడకుండా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషలవారు ఉంటారు. రోగులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారి మాటలను అవసరమైన భాషల్లోకి తర్జుమా చేస్తారు.

ఆస్పత్రికి చేరుకునే మార్గం:

సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్‌కు 3 కిలోమీటర్ల దూరంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఉంటుంది. ఆటో, బస్సుల ద్వారా సులభంగా ఆస్పత్రికి చేరుకోవచ్చు.వైద్యం చేయించుకోవాలనుకునేవారు తప్పని సరిగా గుర్తింపు కార్డుని తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, లేదా ఓటరుఐడీని తీసుకుని వెళ్ళాలి. ఇక ఆస్పత్రి ఆవరణలో ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా ఉండాలి.. సెల్ ఫోన్లు వినియోగం పూర్తిగా నిషేధం. చెప్పులను ఆస్పత్రి ఆవరణలోనే విడిచి లోపలకు వెళ్ళాలి. ఆస్పత్రి సమాచారంకోసం సేవాదళ్‌ సభ్యులు, వాలంటీర్లను సంప్రదించవచ్చు. ఆసుపత్రిలోపలికి తూర్పువైపున గల గేటు నుంచి వెళ్లాల్సిఉంటుంది. రిజిస్ట్రేషన్ కు తెల్లవారుజామున 5 గంటలకు క్యూలో టోకెన్లు పొందాలి. రోగులకు సత్యసాయి సేవాదళ్ స్ర్కీనింగ్‌, రిజిస్ట్రేషన్ పేరిట ప్రాథమికంగా టోకన్లను పంపిణీ చేస్తారు. ఆన్ లైన్ లో కూడా ముందుగా వైద్యానికి సంబంధించిన వివరాలను వెబ్ సైట్ www.psg.sssihms.org.in లో చూడాల్సి ఉంది.